Tuesday, April 23, 2024

సిద్ధూ ఇంట్లో సందడే సందడి

- Advertisement -
- Advertisement -

60 Congress MLAs turn up at Navjot Singh Sidhu's home

60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల హంగామా
సిఎం అమరీందర్‌పై రాజకీయ సిక్సర్?
కీలక మంత్రులు కూడా హాజరు

అమృత్‌సర్ : పంజాబ్ పిసిసి నూతన అధ్యక్షులు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ నివాసంలో బుధవారం సందడి నెలకొంది. దాదాపుగా 60 మంది ఎమ్మెల్యేలు ఈ మాజీ క్రికెటర్ ఇంటికి చేరారు. ఇది సిద్ధూ బలప్రదర్శనగా కన్పించింది. కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో సిఎం అమరీందర్ సింగ్‌కు, నవ్‌జోత్ సింగ్‌కు మధ్య సయోధ్య కుదిరిందనే వార్తలు వెలువడుతున్న దశలోనే ఇంత మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి రావడంతో రాజీ మాట నిజమేనా? అనే అనుమానాలు తలెత్తాయి. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం 80. ఇరవై మంది తప్పితే మిగిలిన వారంతా పిసిసి నేత ఇంటికి రావడం కీలక పరిణామం అయింది. సిఎం క్యాప్టెన్ అమరీందర్‌కు , ఈ క్రికెటర్‌కు చాలా కాలంగా పడటం లేదు. ఇటీవలే మత సంస్థల అమలిన ఉదంతాలపై సిఎంపై సిద్ధూ తమ దాడిని తీవ్రతరం చేశారు. దీనికి ప్రతిగా చాలా రోజులుగా సిద్ధూకు సిఎం అమరీందర్ కలుసుకునే అవకాశం ఇవ్వడం లేదు.

అమృత్‌సర్ ఈస్ట్ ఎమ్మెల్యే అయిన సిద్ధూకు, అమరీందర్‌కు మధ్య వైరం చాలా దూరం పోతుందని అంతా భావించారు. ఈ దశలోనే నవ్‌జోత్ పిసిసి నేత అయ్యారు. ఇది ఆయనకు పదోన్నతిగా మారింది. సిద్ధూ తనపై పరుష పదజాలం వాడాడని, ఇందుకు క్షమాపణ చెపితే తప్ప ఆయనకు అపాయింట్‌మెంట్ ఇచ్చేది లేదని సిఎం చెపుతూ వస్తున్నారు. బుధవారం సిద్ధూ నివాసానికి వచ్చిన వారిలో మంత్రులు కూడా ఉన్నారు. సుఖ్‌జిందర్ సింగ్, రాంధావా, త్రిప్త్ రాజీందర్ సింగ్ బజ్వా వంటి మంత్రులు ఇక్కడికి చేరడం రాజకీయ విశేషంగా మారింది. పిసిసి అధ్యక్షుడిగా వైదొలిగిన సునీల్ జక్కర్ కూడా ఇక్కడికి వచ్చిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యేలంతా సిద్ధూతో కలిసి ఓ లగ్జరీ బస్సులో స్వర్ణ దేవాలయానికి వెళ్లారు. అక్కడ అప్పటికే అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు, సిద్ధూ అభిమానులు చేరి ఉన్నారు. స్వర్ణ దేవాలయంలో అంతా కొద్ది సేపు ప్రార్థనలు నిర్వహించారు. పంజాబ్ సుభిక్షానికి తాము వేడుకున్నామని సునీల్ జక్కర్ తెలిపారు.

సిద్ధూ నివాసంలో ఎమ్మెల్యేల సమీకరణ వెనుక మంత్రి రాంధావా కీలకమైన వ్యక్తిగా ఉన్నారని తెలిసింది. సిఎం వైఖరి తనను విస్మయపర్చిందని అక్కడ విలేకరుల వద్ద ఆయన వ్యాఖ్యానించారు. సిద్ధూకు పదోన్నతిని అంతా గౌరవించాల్సిందే అన్నారు. గతంలో ఉన్న వైరాలను ఇప్పుడు దృష్టిలో పెట్టుకుంటే ఎట్లా అని నిలదీశారు. సిద్ధూతో ఆయన ఎందుకు సఖ్యతతో ఉండటం లేదన్నారు.

శుక్రవారం ప్రమాణస్వీకారం
సిఎం అమరీందర్‌కు ఆహ్వానం

శుక్రవారం జరిగే పిసిసి అధ్యక్ష ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను పిసిసి నేత సిద్ధూ ఆహ్వానించనున్నారు. ఈ మేరకు రంగం సిద్ధం అయింది. ఇప్పటివరకూ సిద్ధూ నేరుగా సిఎంను కలుసుకునేందుకు ముందుకు రాలేదని, ఏది ఏమైనా ఆయన నుంచి బహిరంగ క్షమాపణ వస్తేనే సిఎం ఆయనను కలుసుకునేందుకు కుదరదని ఆయన మీడియా సలహాదారు రవీణ్ తుక్రాల్ ట్వీట్ వెలువరించారు. శుక్రవారం సిద్ధూ పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా బాధ్యతలు తీసుకుంటారు. ఈ కార్యక్రమం సిద్ధూ బలప్రదర్శనకు దారితీస్తుందని, సిఎంకు ఆయనకు వైరం మరింత పెరుగుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. అయితే సిఎంను కార్యక్రమానికి పిలిచే పార్టీపరమైన ఆహ్వానం సిద్ధూనే రూపొందించారు. దీనిపై సిద్ధూ , ఇంతకు ముందటి పిసిసి చీఫ్ జక్కర్ ఇతర నేతల సంతకాలు ఉంటాయి. ఆహ్వాన పత్రాన్ని సిఎంకు పంపిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News