Home తాజా వార్తలు పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్వైభవం

పంచాయతీరాజ్ వ్యవస్థకు పునర్వైభవం

 Rural Development

 

అధికారుల సమీక్ష సమావేశంలో
మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ : పంచాయతీ రాజ్ వ్యవస్థకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు గ్రామీణాభివృద్ధి కోసం 60 రోజుల ప్రణాళికను అమలు చేయబోతున్నామని దానికి అధికారులందరూ సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పచ్చని పరిశుభ్రమైన పల్లె సీమల నిర్మాణమే లక్షంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన కార్యాచరణ అమలుకు వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. 60 రోజుల ప్రణాళిక అమలు కోసం అన్నివిధాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పకడ్బంధీగా అమలు చేయాలన్నారు.

పంచా యతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకొచ్చేం దుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాచరణకు శ్రీకారం చుట్టారన్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు పంచాయతీరాజ్ శాఖకు వ్యవస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించారన్నారు. ఈ ప్రణాళిక అమలు కోసం అవసరమైన పోస్టులను కొత్తగా మంజూరు చేయించారన్నారు. 1956 తరువాత పంచాయతీరాజ్ శాఖలో ఒకేసారి 312 పోస్టులను కొత్తగా నియమించిన సందర్భాలు లేవన్నారు. గ్రామాలపై గ్రామీణ వికాసంపై సిఎం కెసిఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉండడం వల్లనే ప్రత్యేక ప్రణాళికకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న అధికారులకు పదోన్నతుల జాబితాను వేగంగా తయారు చేయాలన్నారు. జడ్పి సిఈఒ, డిప్యూటి సిఈఒ, ఎంపిఒ, డిడిపిఒ, ఎంపిడిఒ, ఎంపిఒ పోస్టులకు అర్హులైన అధికారుల జాబితాను సిద్ధం చేసి పదోన్నతులు కల్పించాలన్నారు.

గ్రామ కార్యదర్శుల నుండి పైస్థాయి వరకు అన్ని దశలలో పదోన్నతులు పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌యోజన మూడవ దశ కింద తెలంగాణ రాష్ట్రానికి 2724 కిలోమీటర్ల కొత్తరోడ్లు మంజూరయ్యాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే ఈ పథకాల కింద రూ.2 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి రానున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసి అవసరం ఉన్న చోట రోడ్డు మార్గం అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా మన రాష్ట్రంలో తెలంగాణలో హరితహారం కార్యక్రమం నడుస్తుందన్నారు. అధికారులు చొరవ తీసుకున్న గ్రామాల్లో హరితహారంలో మంచి ఫలితాలు నమోదయ్యాయన్నారు. గ్రామస్థాయిలో ఖచ్చితంగా 85 శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామపంచాయతీల అభివృద్ధిలో పారిశ్రామిక వేత్తలను, దాతలను, ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాములను చేయాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాలకు కొత్త భవనాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించి రెండు వేల జనాభా, ఐదు వేల జనాభా, పదివేలా జనాభాకు అనుగుణంగా మూడు వేర్వేరు భవనాల నమూనాలను సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందనేది అంచనా వేసి నివేదిక ఇవ్వాలన్నారు. పాలకవర్గాల్లో కో ఆప్షన్ సభ్యుల నియామకానికి మార్గదర్శకాలను ఖరారు చేయాలన్నారు. అదేవిధంగా అభివృద్ధి కమిటీ నియామకాల ప్రక్రియపైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత అనేది ప్రధానమని, పారిశుధ్య నిర్వహణకు మంచి ప్రణాళిక ఉండాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే రూ.600 కోట్లు రావాల్సి ఉందన్నారు.

ఈ నిధులు త్వరగా విడుదలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఆగస్టు 26న కేంద్ర ప్రభుత్వం సాగునీటి పారిశుధ్యం శాఖ ఢిల్లీలో జల్ జమీన్, మిషన్ పథకంపై అన్నిరాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రం తరపున దీనిపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర విజయాలను వివరించేలా ఈ నివేదిక ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ ఎం.రఘునందన్‌రావు, మిషన్ భగీరథ ఈఎన్‌సి తదితరులు పాల్గొన్నారు.

60 Day Plan for Rural Development