Friday, April 19, 2024

బాంబుల శబ్దాలతో వణకి పోతున్నాం… తరలింపు కోసం నిరీక్షిస్తున్నాం

- Advertisement -
- Advertisement -
600 Indian students in the Ukraine-Russia border
ఉక్రెయిన్ -రష్యా సరిహద్దులో 600 మంది భారత విద్యార్థుల ఆవేదన

కీవ్ : ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను , పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసేయడంతో పొరుగు దేశాలైన రొమేనియా, హంగరీ, పోలండ్ నుంచి భారత్ విమానాలు నడుపుతోంది. అయితే ఈశాన్య ఉక్రెయిన్ లోని రష్యా సరిహద్దులకు సమీపంలో 600 మంది భారతీయులు చిక్కుకుపోయినట్టు తాజా సమాచారం. వీరంతా ఉక్రెయిన్ నగరంలోని ఓ యూనివర్శిటీలో చదువుతున్నారు. ఈ యూనివర్శిటీ రష్యా సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండడంతో ఇప్పటివరకు అక్కడి నుంచి ఒక్క విద్యార్థిని కూడా స్వదేశానికి తరలించలేదని, తామంతా భయంతో గడుపుతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రష్యా దురాక్రమణకు ముందు మమ్మల్ని స్వదేశానికి వెళ్లి పోవాలని అడ్వైజరీలు జారీ అయ్యాయని, కానీ పరీక్షలున్నవారు ఇక్కడే ఉండాలని యూనివర్శిటీ చెప్పిందని, దాంతో ఇక్కడే ఉండాల్సి వచ్చిందని, తరువాత పరిస్థితులు మారిపోయాయని విద్యార్థులు వాపోయారు.

గత ఐదు రోజులుగా బాంబులు, షెల్లింగ్‌ల శబ్దాలతో వణకి పోతున్నామని, మానసికంగా కుంగిపోతున్నామని , ఆహారం, నీళ్లు కూడా దొరకలేదని, ఏటీఎంలలో డబ్బులు అయిపోయాయని ఈ యూనివర్శిటీలో చదువుతున్న మహారాష్ట్ర విద్యార్థి విరాజ్ వాల్దే ఫోన్లో పిటిఐకి తెలియజేశారు. ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ తమను స్వదేశానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించట్లేదని విరాజ్ ఆరోపించారు. “ భారత విద్యార్థులంతా కేవలం ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులను ఉపయోగించుకుని పోలాండ్, హంగరీ, రొమేనియా దేశాలకు రావాలని ఎంబసీ అడ్వైజరీలు జారీ చేసింది. కానీ సుమీ నగరం ఈశాన్య ఉక్రెయిన్‌లో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పశ్చిమ సరిహద్దులకు రావడం అనేది అసాధ్యం. పశ్చిమసరిహద్దులకు వెళ్లాలంటే 1500 కిలోమీటర్లు ప్రయాణించాలి” అని ఆ విద్యార్థి ఆవేదన వెలిబుచ్చారు. అందువల్ల తమను రష్యా మీదుగా భారత్‌కు తీసుకెళ్లాలని కేంద్రప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇదిలా ఉండగా సుమీ నగరం లోని భారత విద్యార్థులను రష్యా మీదుగా స్వదేశానికి తరలించే అంశాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News