Home జాతీయ వార్తలు నాలుగో విడతలో 64% శాతం పోలింగ్

నాలుగో విడతలో 64% శాతం పోలింగ్

బెంగాల్‌లో హింస, కేంద్ర మంత్రి సుప్రియోపై ఎఫ్‌ఐఆర్
అత్యల్పం అనంత్‌నాగ్, బెంగాల్ అత్యధికం, ఓటేసిన బాలీవుడ్, వ్యాపార, రాజకీయ దిగ్గజాలు

 Lok Sabha Election

 

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లోని 72 నియోజక వర్గాల్లో నాలుగో విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం మీద 64 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం వరాలు తెలిపాయి. గత మూడు దశల్లో మాదిరిగానే ఈ సారి కూడా పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగింది. కాగా పలు చోట్ల ఇవిఎంలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. బీర్‌భూమ్ జిల్లాలోని ననూర్ పోలింగ్ కేంద్రాల వద్ద బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ కారణంగా ఉద్రిక్తత నెలకొంది. అన్సోల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ సిబ్బందిని బెదిరించారంటూ టిఎంసి ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఇసి ఆదేశించింది. కాగా టిఎంసి కార్యకర్తలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ బిజెపి కూడా ఇసికి ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనలు మినహా మొత్తంమీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఇసి వర్గ్గాలు తెలిపాయి. జమ్మూ,కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజకవర్గంలో నాలుగు విడతలుగా పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన రెండో విడత పోలింగ్‌లో అత్యల్పంగా 9.97 శాతం పోలింగ్ జరగ్గా పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 76.47 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాలుగో విడతలో ముంబయిలోని ఆరు లోక్‌సభ స్థానాలతో పాటుగా మహారాష్ట్రలోని 17 లోక్‌సభ స్థానాలు, రాజస్థాన్, యుపిలలో చెరి 13, పశ్చిమ బెంగాల్ 8, మధ్యప్రదేశ్, ఒడిశాలలో చెరి ఆరు, బిహార్‌లో అయిదు, జార్ఖంగ్‌లో మూడు, అనంత్‌నాగ్ నియోజకవర్గంలో కొంత భాగంలో పోలింగ్ జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం బిహార్‌లో 53.67, మధ్యప్రదేశ్‌లో 65.86, మహారాష్ట్ర 51.06, ఒడిశా 64.05, రాజస్థాన్ 62.86, యుపి 53.12, జార్ఖండ్‌లో 63.40 శాతం పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు. క్రికెటర్ సచిన్ తెండూల్కర్, ఆయన భార్య అంజలి, కుమారుడు అర్జున్, కుమార్తె సారాకూడా ఓటు వేశారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబంతో పాటుగా పలువురు బాలీవుడ్ నటులు కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. కండల వీరుడు సలాన్ ఖాన్ బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై నార్త్ కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటి ఊర్మిళా మతోండ్కర్ కూడా బాంద్రాలోనే ఓటు వేశారు. కాగా ఓటేసిన ప్రముఖుల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ , రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, బిజెపి సిటింగ్ ఎంపి పరేశ్ రావల్ దంపతులు, బిజెపి మధుర ఎంపి అభ్యర్థి హేమామాలిని , ఆమె కుమార్తెలు ఈషా డియోల్, అహనా డియోల్, సినీ నటి రేఖ, మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహింద్రా తదితరులున్నారు. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా పలువురు వృద్ధులు, వికలాంగులు సైతం ఓటగు హక్కును ఉపయోగించుకోవడం విశేషం. తొలి మూడు విడతల పోలింగ్‌లో 302 లోక్‌సభ నియోజక వర్గాలకు పోలింగ్ జరగ్గా, మిగిలిన చివరి మూడు విడతల్లో168 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

64% Polling Registered in Fourth Phase Lok Sabha Election