Friday, April 19, 2024

జోరు తగ్గని మహమ్మారి

- Advertisement -
- Advertisement -

కరోనాతో దేశవ్యాప్తంగా ఒకేరోజు 1007 మంది మృతి

 కొత్తగా 64,553 మందికి వైరస్
 ఒకేరోజు రికార్డు స్థాయిలో 8.50లక్షల టెస్టులు
 రోజుకు మిలియన్ పరీక్షలదిశగా భారత్
 కొజికోడ్ దుర్ఘటన సహాయ చర్యల్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా
 హోం ఐసోలేషన్‌కు సిఎం పినరయి, 8 మంది మంత్రులు

64553 New Corona Cases Registered in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలదాకా కొత్త కేసులు నమోదవుతూ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 64,553 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 24 లక్షలు దాటిపోయింది. శుక్రవారం నాటికి ఈ సంఖ్య 24,61,190కి చేరుకుంది. అయితే కరోనా జయిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి కరోనానుంచి కోలుకున్న వారి సంఖ్య 17,51,555కు చేరుకుంది. తాజాగా 57,573 మంది కరోనానుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో రికవరీ రేటు మరింత పెరిగి 71.17 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 1007 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 48,040కి చేరుకుంది. మరణాల రేటు 1.95 శాతంగా ఉంది. కాగా మరో 6,61,595 యాక్టివ్ కేసులున్నాయి. ఈ నెల 7న దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలను దాటగా, కేవలం వారం రోజుల వ్యవధిలోనే కొత్తగా మరో 4లక్షలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

రోజుకు మిలియన్ టెస్టుల దిశగా..
మరో వైపు దేశంలో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజుకు 10 లక్షల టెస్టుల దిశగా టెస్టుల సంఖ్య సాగుతోంది. గురువారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 8.4లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించారు. గడచిన 24 గంటల్లో 8,48,728 శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) తెలిపింది. దేశంలో ఒక్క రోజే ఇంత భారీ సంఖ్యలో టెస్టులు నిర్వహించడం ఇదే మొదటిసారి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన టెస్టుల సంఖ్య 2.7 కోట్లను దాటినట్లు ఐసిఎంఆర్ తెలిపింది. కాగా, శుక్రవారం నమోదైన మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 413 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య19,063కు చేరుకుంది. తమిళనాడులో తాజాగా 119 మరణాలు సంభవించగా, కర్నాటకలో వైరస్ బారిన పడి 103 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఢిల్లీలో కేవలం 14 మంది మరణించారు. తమిళనాడులో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,397 మంది మృతిచెందగా, కర్నాటకలో 3,613 మంది ప్రాణాలు కోల్పయారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,167గా ఉంది. కాగా 2 వేలకు పైగా మరణాలు సంభవించిన రాష్ట్రాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, యుపి, పశ్చిమ బెంగాల్‌లు ఉన్నాయి.

మహారాష్ట్రలో మరో 147 మంది పోలీసులకు కరోనా
కాగా కరోనాతో కకావికలమవుతున్న మహారాష్ట్రలో మరో 147 మంది పోలీసులు మహమ్మారి బారిన పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడిన పోలీసులు సంఖ్య 11,920కి పెరిగినట్లు రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. వీరిలో 9,569 మంది కోలుకోగా ఇంకా 2,227యాక్టివ్ కేసులున్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో124 మంది పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

కోలుకున్న అమిత్ షా..మరికొన్ని రోజులు హోం ఐసొలేషన్‌లో
కాగా ఇటీవల కరోనా బారిన పడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోలుకున్నారు. గురువారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు తాను మరికొన్ని రోజులు హోం ఐసొలేషన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. దేవుడి దయతోనే కోలుకున్నానని తెలిపారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 2న తనకు కరోనా సోకినట్లు అమిత్ షా స్వయంగాతెలిపారు. వైద్యుల సూచన మేరకు గుర్గావ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే ఈ అమిత్ షాకు నెగెటివ్ వచ్చినట్లు నెల 9న బిజెపి ఎంపి మనోజ్ తివారీట్వీట్ చేయగా ఆయనకు ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు ఖండించాయి.

64553 New Corona Cases Registered in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News