Home అంతర్జాతీయ వార్తలు మదర్సాలో పేలుడు : ఏడుగురు పిల్లల మృతి

మదర్సాలో పేలుడు : ఏడుగురు పిల్లల మృతి

7 Died With IED Bomb Blast In Pak

 

పెషావర్‌లో దారుణం.. మరో 70 మందికి గాయాలు

పెషావర్: వాయువ్య పాకిస్తాన్‌కు చెందిన పెషావర్ నగరంలోని ఒక మదర్సా(ఇస్లామిక్ పాఠశాల)లో మంగళవారం ఉదయం ఒక భారీ బాంబు పేలుడు సంభవించి ఏడుగురు పిల్లలు మరణించగా మరో 70 మంది గాయపడ్డారు. ఉదయం ప్రార్థనల అనంతరం ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. మదర్సా గోడకు సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గోనె సంచిలో వదిలిన పేలుడు పదార్థాలు పేలిపోవడంతో ఏడుగురు పిల్లలు మరణించినట్లు పెషావర్ ఎస్‌పి వఖర్ అజీమ్ తెలిపారు. ప్రార్థనల అనంతరం పిల్లలు మదర్సాకు చేరుకుంటున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.

ఏడు మృతదేహాలు తమకు అందాయని, ఈ పేలుడులో చాలా మంది గాయపడ్డారని ఆసుపత్రి అధికారులు నిర్ధారించారు. పేలుడు జరిగిన సమయంలో సుమారు 40-50 మంది పిల్లలు మదర్సాలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మదర్సాలో దాదాపు 1100 మంది పిల్లలు చదువుకుంటున్నట్లు దాని నిర్వాహకులు తెలిపారు. పిల్లలపై జరిగిన ఈ దాడిని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఖండించారు. ఈ దాడికి సంబంధించి ఏ సంస్థ ఇప్పటి వరకు బాధ్యత తీసుకోలేదు.

7 Died With IED Bomb Blast In Pak