రాంచి: పథల్‌గర్హి అనే గిరిజన సంప్రదాయాన్ని వ్యతిరేకించారన్న ఆరోపణపై ఏడుగురిని హత్య చేశారని పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ ఘటన జార్ఖండ్ లోని పశ్చిమ సింఘ్భమ్ జిల్లా బురుగులకెర గ్రామంలో జరిగింది. ఏడుగురిని చంపి వారి శవాలను అడవిలో పూడ్చి పెట్టారన్న సమాచారం తెలియగానే పోలీసులు మంగళవారం రాత్రి ఆ గ్రామం చేరుకున్నారని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సాకేత్‌కుమార్ సింగ్ చెప్పారు. ఆ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో పూడ్చి పెట్టిన శవాలను వెలికి తీశారు. పథల్‌గర్హి అనే సంప్రదాయంపై గ్రామంలో మంగళవారం సమావేశం జరిగింది.
పథల్‌గర్హి అంటే రాతిని చెక్కడం. గిరిజన సమాజంలో ఇది చాలా ప్రాచీన ఆచారం. సమావేశంలో వివాదం తలెత్తి పథల్‌గర్హి మద్దతుదారులు ఆ గ్రామానికి చెందిన ఏడుగురిని కిడ్నాప్ చేసి లాఠీలు, గొడ్డళ్లతో వారిని హత్య చేశారని ఐజి తెలిపారు. స్థానిక గ్రామపంచాయతీ స్వయం పాలనకు ఈ రాళ్లు సంకేతాలుగా గిరిజనులు ఆచారం పాటిస్తుంటారు. ఈ ఆచారం ప్రకారం గ్రామం సార్వభౌమిక ప్రాంతంగా భావిస్తుంటారు. బయటివారిని ఎవరినీ గ్రామంలోకి రానీయరు.
7 Villagers Killed in Ranchi for Opposing Pathalgarhi