Home లైఫ్ స్టైల్ బహిరంగ అపహాస్య భారతం

బహిరంగ అపహాస్య భారతం

lf

దేశంలో 73 కోట్ల మందికి టాయిలెట్ సౌకర్యం లేదు 

స్త్రీలే కాదు, పురుషులు,  పిల్లలు అంతా కలిపి దేశంలో దాదాపు 73 కోట్ల మందికి టాయిలెట్ సౌకర్యం లేనట్లు 2017 లో వాటర్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ‘అవుట్ ఆఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ వరల్డ్ టాయిలెట్స్’ అనే నివేదిక చెబుతుంది. ఇందులో దాదాపు 35 కోట్ల మందికిపైగా బాలికలు, మహిళలే.  దేశంలో ప్రతిఏటా దాదాపు 60000 మందికి పైగా 5 సంవత్సరాలలోపు వయసుగల పిల్లలు డయేరియాతో చనిపోతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. బహిరంగ మలవిసర్జన వల్ల వ్యాపించే కొంకి పురుగుల కారణంగా డయేరియా, రక్తహీనత, తక్కువ బరువు కలిగి ఉండడం వంటి సమస్యలు తలెత్తుతాయని వీటి వలన పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల మందగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. డయేరియా వ్యాప్తికి పారిశుద్ధానికి దగ్గర సంబంధం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు టాయిలెట్లు అత్యధిక శాతం ఉన్న (91శాతం కుటుంబాలు) కేరళలో డయేరియా దేశం మొత్తం మీద తక్కువగా కేవలం 3.4శాతం మాత్రమే ఉంది. అదే విధంగా మహిళల్లో రక్తహీనత కూడా దేశం మొత్తం మీద అతి తక్కువగా కేవలం 22 శాతం మాత్రమే ఉంది. ఇందుకు భిన్నంగా టాయిలెట్లు అతితక్కువగా ఉన్న (కేవలం 25 శాతం కుటుంబాలు) బీహార్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఇక్కడ డయేరియా అత్యధికంగా 10.2 శాతంగానూ, స్త్రీలలో రక్తహీనత కూడా అత్యధికంగా 58.3 శాతంగానూ ఉంది. ఇంటి వద్ద టాయిలెట్లు లేకపోవడంవల్ల  స్త్రీలు చీకటిపడే వరకు ఆగి బహిర్భూమికి వెళ్తున్నారు. అందువల్ల వారు లైంగిక దాడులకు గురిఅయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.

మీకు ఇంట్లో టాయిలెట్ లేకపోతే ఇబ్బందిగా లేదా? అని నేను అడిగిన ప్రశ్నకు రేణుకమ్మ చెప్పిన సమాధానం నాకు ఇంకా గుర్తుంది. ఎందుకు ఉండదమ్మా? ఇంట్లో ఆడపిల్లలు బహిర్భూమికి పోతే వాళ్ళు వచ్చే వరకు భయమే. ఇప్పటికి దాదాపు పదమూడు గంటలు అయింది నేను బయటకిపోయి. పగటి పూట బహిర్భూమికి వెళ్లాలంటే సిగ్గుగా ఉంటుంది. వర్షాకాలం వస్తే వానలో, బురదలో ఎక్కడ బయటకి పోవలసి వస్తుందో అని మేము రోజుల తరబడి అన్నం కూడా తినం అని ఆమె చెప్పగానే నాకు ఏమి మాట్లాడాలో తోచలేదు. గొంతుకు ఏదో అడ్డంపడినట్లయింది. పక్కనే ఉన్న ముసలమ్మ అందుకుని నా పరిస్థితి చూడమ్మా. లేవలేను, నడవలేను, ఎవరైనా తోడులేనిదే బయటకి వెళ్ళలేను. నేను బయటకి వెళ్లాల్సొచ్చినప్పుడల్లా వాళ్ళని వీళ్ళని బతిమాలాడుకోవాలి అని కళ్ళనీళ్లు పెట్టుకోగానే నాకు కూడా దుఃఖం ఆగలేదు. మన దేశంలో కోట్లాది స్త్రీల పరిస్థితి ఇదే. సహజంగా మలమూత్ర విసర్జన అనేది వారికి దైనందిన సమస్య. స్త్రీలే కాదు, పురుషులు, పిల్లలు అంతా కలిపి దేశంలో దాదాపు 73 కోట్ల మందికి టాయిలెట్ సౌకర్యం లేనట్లు 2017 లో వాటర్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ‘అవుట్ ఆఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ వరల్డ్ టాయిలెట్స్’ అనే నివేదిక చెబుతుంది. ఇందులో దాదాపు 35 కోట్ల మందికిపైగా బాలికలు, మహిళలే. దేశంలో ప్రతిఏటా దాదాపు 60000 మందికి పైగా 5 సంవత్సరాలలోపు వయసుగల పిల్లలు డయేరియాతో చనిపోతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. బహిరంగ మలవిసర్జన వల్ల వ్యాపించే కొంకి పురుగుల కారణంగా డయేరియా, రక్తహీనత, తక్కువ బరువు కలిగి ఉండడం వంటి సమస్యలు తలెత్తుతాయని వీటి వలన పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల మందగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. డయేరియా వ్యాప్తికి పారిశుద్ధానికి దగ్గర సంబంధం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉదాహరణకు టాయిలెట్లు అత్యధిక శాతం ఉన్న (91శాతం కుటుంబాలు) కేరళలో డయేరియా దేశం మొత్తం మీద తక్కువగా కేవలం 3.4శాతం మాత్రమే ఉంది. అదే విధంగా మహిళల్లో రక్తహీనత కూడా దేశం మొత్తం మీద అతి తక్కువగా కేవలం 22 శాతం మాత్రమే ఉంది. ఇందుకు భిన్నంగా టాయిలెట్లు అతితక్కువగా ఉన్న (కేవలం 25 శాతం కుటుంబాలు) బీహార్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఇక్కడ డయేరియా అత్యధికంగా 10.2 శాతంగానూ, స్త్రీలలో రక్తహీనత కూడా అత్యధికంగా 58.3 శాతంగానూ ఉంది. ఇంటి వద్ద టాయిలెట్లు లేకపోవడంవల్ల స్త్రీలు చీకటిపడే వరకు ఆగి బహిర్భూమికి వెళ్తున్నారు. అందువల్ల వారు లైంగిక దాడులకు గురిఅయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ మధ్య ఉత్తరప్రదేశ్‌లో కత్రా వద్ద పద్నాలుగు పదిహేను సంవత్సరాలున్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు బహిర్భూమికని వెళ్లి లైగింక దాడికి గురై తర్వాత చెట్టుకి ఉరివేయబడి వేలాడుతూ కనపడిన సంఘటన దేశమంతా సంచలనం రేపింది. చీకటిపడే వరకు స్త్రీలు బహిర్భూమికి వెళ్లలేక తిండి, నీళ్లు మానుకోవడం, మల,మూత్ర విసర్జనను ఆపుకోవాల్సి రావడం వాళ్ళ ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
టాయిలెట్ సౌకర్యం లేని పాఠశాలల్లో ఇబ్బందిపడలేక చదువు మానేస్తున్న బాలికలు ఎందరో? చదువు మధ్యలోనే ఆపేస్తున్న బాలికలలో దాదాపు 23శాతం మంది తమ నెలసరి సమయంలో పాఠశాలలో సరైన టాయిలెట్ సదుపాయాలు లేకపోవడమే తాము చదువు మానేయడానికి కారణం అని చెప్పడం ఈ సమస్య తీవ్రతను తెలియచేస్తున్నది. ప్రజల, ముఖ్యంగా స్త్రీలు, పిల్లల ఆరోగ్యాలపై, చదువులపై, భద్రతపై, గౌరవంపై, ఆర్ధిక అభివృద్ధిపై ఇంత తీవ్రప్రభావం చూపుతున్న ఈ సమస్య పరిష్కారానికి ఎంత వరకు కృషి జరుగుతున్నదనే దానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. 2016లో ఒక సిటిజెన్ ఫోర్‌మ్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో దాదాపు 88 శాతంపైగా కుటుంబాలు మొబైల్ సదుపాయం కలిగి ఉండగా 50 శాతం కన్నా తక్కువ కుటుంబాలు మాత్రమే టాయిలెట్ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. అంటే టాయిలెట్ లేకపోవడానికి కారణం సాధారణంగా మనం అనుకునేటట్లు ఆర్ధిక పరిస్థితులు మాత్రమే కారణం కాదు. ఒక మంచి మొబైల్ ఫోన్ కొనుక్కునే స్థోమత కలిగిన కుటుంబానికి ఒక టాయిలెట్ కట్టుకునే స్థోమత లేదు అనుకోలేము కదా. ఈ టాయిలెటే లేకపోవడానికి ఎన్నో ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కనీసం తాగడానికి, ఇతర అవసరాలకు కూడా ఇంటి వద్ద నీరు లేక మైళ్లకుమైళ్ళు నడిచిపోయి తెచ్చుకునే కుటుంబాలకు ఇంటి వద్ద టాయిలెట్ కట్టుకుంటే నీళ్లు ఎలావస్తాయి అనేది ఒక సమస్య. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం మరొక సమస్య. అసలు టాయిలెట్ కట్టుకునేందుకు స్థలమే లేకపోవడం ఇంకొందరి సమస్య. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో మురికివాడలలో నివసించే ప్రజలకు ఉండేందుకే స్థలం సరిపోని పరిస్థితులు. టాయిలెట్ కట్టుకునేందుకు స్థలం ఎక్కడి నుండి వస్తుంది? ఇవి మాత్రమేకాక ఇంటి వద్ద టాయిలెట్ ఉంటే మంచిది కాదని, అది భూ గర్భజలాలను కలుషితం చేస్తుందని, ఇంటిలో ఉన్నవారికి జబ్బులు వస్తాయని కొంత మంది ప్రజలలో ఉండే అపోహలు కూడా వారు టాయిలెట్ కట్టుకోకపోవడానికి ఒక కారణం. మరి ఇంతవిస్తృతమైన అతి ముఖ్యమైన సమస్యపై ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఈసమస్యపై ఈనాడు కాదు ఎప్పుడో 1980 లలోనే స్పందించి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాయి. 1986లో ప్రారంభించిన కేంద్రీయ గ్రామీణ పారిశుధ్ధ పథకం ద్వారా ప్రభుత్వం విస్తృతంగా సబ్సిడీలు అందించి ప్రజలను టాయిలెట్లు నిర్మించుకోవలసిందిగా ప్రోత్సహించింది. తర్వాత 1999 లో మొదలైన సంపూర్ణ పారిశుద్ధ్య పథకం దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పెద్దఎత్తున టాయిలెట్ల నిర్మాణం చేపట్టే దిశగా ప్రయత్నాలు చేసింది. కేవలం టాయిలెట్ల నిర్మాణమేకాక వాటి ఆవశ్యకత గురించి ప్రజలను చైతన్యపరిచే వైపుగా ఈ పథకం దృష్టిపెట్టింది. ఈ సంపూర్ణ పారిశుద్ధ్య పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం నుండి కొంత నగదు అందించడమేకాక నిర్మాణంలో సహకారం అందించడం కూడా జరుగుతుంది. అయితే పథకం అమలు తీరులో లోపాలు, అవినీతి, తగినన్ని వనరులు కేటాయించలేకపోవడం వంటి లొసుగుల వల్ల ఈ పథకం ఆశించినంత పురోగతి సాధించలేకపోయింది. ఈ పధకం కింద నిర్మించిన టాయిలెట్లలో దాదాపు 30 శాతం అసలు నిర్మాణం పూర్తి చేసుకోనివి, లేదా నిర్మాణ లోపాల వల్ల, నిర్వహణా లోపాల వల్ల వినియోగంలో లేకుండాపోయినవి. ఈ విధంగా సంపూర్ణ పారిశుద్ధ పథకం అనుకున్న ఫలితాలు అందివ్వలేకపోవడంతో దీనిని తిరిగి కొన్నిమార్పులతో 2012 లో నిర్మల భారత్ అభియాన్ పేరుతో 2014 లో స్వచ్ఛ భారత్ పేరిట తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది.
2019 అక్టోబర్ 2న మహాత్మాగాంధీ 150 జయంతి నాటికి దేశంలో దాదాపు 11 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, అందుకు తగిన స్థలం వసతులులేని చోట పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం ద్వారా దేశంలో బహిరంగ మల విసర్జనకు ముగింపు పలకాలనేది ఈ పథకం లక్ష్యం. కేవలం టాయిలెట్ల నిర్మాణమేకాక బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం, మనుషులే పారిశుద్ధ పనులు నిర్వహించడాన్ని, మనం నెత్తిన మోసుకుపోవడాన్ని అంతమొందించడం వంటి లక్ష్యాల సాధన ద్వారా దేశాన్ని స్వచ్ఛ భారత్‌గా రూపుదిద్దడమే ఈ పథకం ఉద్ధేశ్యం. పెద్ద ఎత్తున పథకాన్ని రూపొందించడమేకాక అందుకు తగినన్ని నిధులు సమకూర్చడం, ఆ నిధులలో దాదాపు ఎనిమిది శాతాన్ని పారిశుద్ధ్యం మీద ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి కావాల్సిన ప్రచార పథకాలకు కేటాయించడం ఒక మంచి పరిణామం. మరోవైపు స్వచ్ఛ పాఠశాల, స్వచ్ఛ వైద్యశాల వంటి పథకాలతో వివిధ ప్రభుత్వ వసతులతో కూడా పరిశుభ్రతను ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతున్నది. 2017 నాటికి ఐదు కోట్ల టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే మరి రెండు సంవత్సరాలలో ఇంకో ఆరు కోట్ల వ్యక్తిగత టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఈ పథకం వేగం అందుకున్న తీరు గమనిస్తే ఈ లక్ష్యసాధన సాధ్యం అయ్యేట్లే కనిపిస్తుంది. అయితే స్వచ్ఛ భారత్ లక్షం కేవలం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పూర్తిగా సాధ్యం కాదు. ఎక్కడైతే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం సాధ్యం కాదో అక్కడ కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించడం వాటిని వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించడం కూడా జరగాల్సి ఉంది. టాయిలెట్ల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణపైన కూడా పెద్దఎత్తున కృషి జరగాలి. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ అనేక మంది టాయిలెట్లను సామాను భద్రపరుచుకునే స్టోర్ రూమ్‌లుగా వినియోగించడం మనకు తెలిసిందే. ఇక పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు సరైన నీటి సౌకర్యం లేక, శుభ్రత లేక, దుర్గంధాన్ని వెదజల్లుతూ అసౌకర్యం కలిగించే సందర్భాలే ఎక్కువ. అందుకే ప్రజలు వీటిని వినియోగించేందుకు సుముఖత చూపడం లేదు. బృంద్వశ్వర్ పాఠక్ స్థాపించిన సులభ్ సంస్థ దేశంలో విస్తృతంగా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మాణం చేసి పే అండ్ యూజ్ పద్ధతిలో వాటిని నిర్వహించడం ద్వారా ఒక పారిశుధ్య విప్లవానికి తెర తీసింది. ఇప్పుడు అత్యంత కీలకంగా మారిన అంశం టాయిలెట్ల నిర్వహణ, వినియోగం. దీనిని ప్రోత్సహించేందుకు పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు అవసరం. బహిరంగ ప్రదేశాల శుభ్రత, నిర్వహణ విషయానికి వస్తే ఇంకా చెప్పుకోదగ్గ పురోగతి మనకు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్తచెదారంతో నిండిపోయిన ప్రదేశాలే కనిపిస్తుంటాయి. ఇందుకు ప్రభుత్వాల నిర్వహణను తప్పుపట్టేకంటే పౌరులుగా మన అలక్ష్యమే ఇందుకు ప్రధానకారణం అనిపిస్తుంది. ఒక సమాజంగా మన అందరి ఉమ్మడి ఆస్తులైన ప్రదేశాల పట్ల మనం చూపించే ఈ అలక్ష్యమే అవి అలా అపరిశుభ్రంగా ఉండడానికి కారణం. కోట్లాది మంది ప్రజలు వేసే మురికిని కొన్ని వేలమంది పారిశుద్ధ కార్మికులు శుభ్రం చేయాలని ఆశించడం, అలా చేయనందుకు వారిని నిందించడం ఎంతవరకు న్యాయ? నిజానికి మనం వేసే ఆ చెత్తను, ఆ దుర్గంధాన్ని భరిస్తూ ఆ మాత్రమైనా శుభ్రంగా ఉంచుతున్నందుకు వారికి మనం చేతులెత్తి నమస్కరించాలి. పారిశుద్ధ్యం స్వాతంత్రం కన్నా అత్యంత ఆవశ్యకమైనది అన్నారు మహాత్మాగాంధీ. ప్రభుత్వం వైపు నుండి జరుగుతున్న కృషికి పౌర సమాజం చేయూత తోడైతే అపరిశుభ్రత నుండి, బహిరంగ మల విసర్జన నుండి స్వాత ంత్రం మరింత సులువుగా సాధ్యమవుతుంది. రేణు కమ్మ లాంటి కోట్లాది మహిళల భద్రత, ఆరోగ్యం, ఆత్మగౌరవం ముడిపడింది ఈ స్వాతంత్ర సాధన తోటే.