Home తాజా వార్తలు ఉపాధి కోల్పోయిన 75 లక్షల మంది

ఉపాధి కోల్పోయిన 75 లక్షల మంది

75 lakh people lose jobs in April as lockdowns sprout

 

నాలుగు నెలల గరిష్ఠానికి నిరుద్యోగం రేటు
కరోనా లాక్‌డౌన్ ఆంక్షలతో ఉద్యోగులపై ప్రభావం
సిఎంఐఇ నివేదిక

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి రెండో దశ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా సెకండ్ వేవ్, స్థానికంగా లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా 75 లక్షల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. 8 శాతంతో నిరుద్యోగం రేటు నాలుగు నెలల గరిష్ఠానికి చేరిందని సిఎంఐఇ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి) నివేదికలో పేర్కొంది. నిరుద్యోగం పరిస్థితి మరింత క్లిష్టంగా మారొచ్చని, ఈ ప్రతికూల పరిస్థితి కొనసాగే అవకాశముందని సిఎంఐఇ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేష్ వ్యాస్ అన్నారు. కేంద్రానికి చెందిన ప్రొప్రైటరీ డేటా ప్రకారం, మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో నిరుద్యోగం రేటు 7.97 శాతానికి చేరింది.

పట్టణ ప్రాంతాల్లో 9.78 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 7.13 శాతం ఉంది. మార్చిలో జాతీయ నిరుద్యోగం రేటు 6.50 శాతంగా ఉండగా, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సంఖ్యాపరంగా దిగువనే ఉంది. కొవిడ్ 19 సెకండ్ వేవ్ కారణంగా లాక్‌డౌన్ వంటి ఆంక్షలు విధించాల్సి రావడం, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం వంటి అంశాలతో ఉద్యోగాలపై ప్రభావం ఏర్పడింది. కొవిడ్ వేవ్ పెరుగుతుందనే విషయం తెలియదని, అయితే ఉద్యోగాల పరంగా ఒత్తిడి నెలకొందని వ్యాస్ అన్నారు. నిరుద్యోగం ఇప్పటికీ అధిక స్థాయిలో ఉందని, కార్మిక శక్తి కదలికలు పడిపోయాయని అన్నారు.

75 lakh people lose jobs in April as lockdowns sprout