Home రాష్ట్ర వార్తలు 8 వేల కోట్ల కుంభకోణం

8 వేల కోట్ల కుంభకోణం

పద్మశ్రీ, అర్జున అవార్డుల గ్రహీత మల్టీలెవల్ టోపీ
హాంకాంగ్ కేంద్రంగా అడ్డా
దేశ వ్యాప్తంగా 5 లక్షల మంది బాధితులు
నలుగురు డైరెక్టర్లను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
Mykhel1మన తెలంగాణ/సిటీబ్యూరో: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది నుంచి సుమారు రూ.8 వేల కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఓ సంస్థ గుట్టును నగర సిసిఎస్ పోలీసులు రట్టు చేశారు. హాంకాంగ్‌ను అడ్డాగా చేసుకున్న సదరు సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను ప్రయోగించి మోసాలకు పాల్పడింది. సదరు కంపెనీకి చెందిన మన దేశ నలుగురు డైరెక్టర్లను బుధవారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు పద్మశ్రీ, అర్జున్ అవార్డు గ్రహీత కూడా ఉండడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో మోసపోయిన బాధితులు 30 వేలకు పైనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘క్యూ నెట్’ అనే పేరుతో హాంకాంగ్‌లో మల్టీ లెవల్ మార్కెట్ సంస్థ నడుస్తుంది. ప్రపంచంలోని కొన్ని దేశాలలో మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు అనుమతులు ఉన్నాయి. మన దేశంలో ఇలాంటి మల్టీ లెవల్ మార్కెటింగ్‌పై నిషేధం ఉంది. ఈ విషయం తెలిసికూడా ముంబాయికి చెందిన మైఖల్ జోసెప్ ఫెరైర (78), మల్‌కామ్ నోజెర్ దెసై (45),మగర్‌లాల్ వి బాలాజి (40), బెంగుళూరుకు చెందిన శ్రీనివాస్‌రావు వెంక (47)లు క్యూ నెట్ సంస్థకు అనుబంధంగా మన దేశంలో ‘విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ఈ నలుగురు డైరెక్టర్లుగా ఉన్నారు. దీనిని వీరు మన దేశంలో రెండేళ్ల క్రితం ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో వీరు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రూ.10 వేలు కడితే విలువైన వస్థువులు అందజేస్తామని, మరో ఇద్దరు సభ్యులను తమ సంస్థలో చేరిస్తే వారికి రూ.10 వేల విలువైన వస్తువులు అందజేయడంతో పాటు సభ్యత్వం ఇప్పించినందుకు మంచి కమీషన్ ఇస్తామని ఆశ చూపారు. వీరి ప్రకటనలకు నమ్మిన దేశ వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఈ సంస్థలో ఒక్కోక్కరు రూ.10 వేలు చెల్లించి సభ్యులుగా చేరారు. సభ్యులుగా చేరిన తరువాత ప్రకటనలో పేర్కొన్న మాదిరిగా వారికి విలువైన వస్తువులు రాలేదు, కమీషన్లు రాలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు దేశ వ్యాప్తంగా ఆయా పోలీసు స్టేషన్‌లలో సదరు మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ నిర్వా హకులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన సుమన్ గోషా (30) అనే వ్యాపారి తాను రూ.16 లక్షలు మోసపోయానని గత ఏడాది సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు అందిన వారం రోజులకే మరో బాధితుడు కూడా ఇదే తరహాలో ఫిర్యాదు చేశాడు. దీంతో సిసిఎస్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఇదే తరహాలో గత ఏడాది కూకట్‌పల్లి, మాదాపూర్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లలో కూడా బాధితులు ఫిర్యాదు చేయడంతో అక్కడ కూడా సదరు సంస్థపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో సదరు మల్టీలేవల్ మార్కెటింగ్ సంస్థకు ఏజెంట్లుగా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన నలుగురిని సిసిఎస్ పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా తమపై కేసులు ఉన్నాయని తెలుసుకున్న నలుగురు డైరెక్టర్లు పరారీలో ఉన్నారు. ఈ నలుగురు డైరెక్టర్లను వారం రోజుల క్రితం ముంబాయి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులు అరెస్టు అయ్యారని తెలుసుకున్న సిసిఎస్ పోలీసులు పిటి వారెంట్‌పై నలుగురు డైరెక్టర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. మల్టీలేవల్ మార్కెటింగ్ పేరుతో ఎవరెవరి వద్ద ఎంత డబ్బు వసూలు చేశారు, ఈ డబ్బు ఎవరికి వద్ద ఉంది, తదితర అంశాలపై విచారించారు. ‘విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్’ సంస్థ పేరుతో దేశ వ్యాప్తంగా 5 లక్షల మందిని మోసగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్‌లో ఈ సంస్థ బారిన పడిన బాధితుల సంఖ్య 50కిపైగా ఉంది. పై నలుగురు డైరెక్టర్లను సిసిఎస్ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
నిందితుడు పద్మశ్రీ, అర్జున్ అవార్డు గ్రహిత….
‘విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్’కు డైరెక్టర్‌గా ఉన్న ముం బాయికి చెందిన మైఖల్ జోసెప్ ఫెరైరకు గతంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, అర్జున్ అవార్డును ప్రకటించింది. అత్యత ప్రతిష్టాత్మకమైన అవార్డు పొందిన మైఖల్ జోసెప్ మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో వేలాది కోట్ల రూపాయలను మోసగించాడు. దేశ వ్యాప్తంగా ఆ సంస్థ రూ.8 వేల కోట్ల రూపాయలను వసూలు చేసి మోసగించినట్లు తేలింది. అయితే ఈ డబ్బు ఎక్కడ ఉంది అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వీరికి చెందిన దేశంలోని పలు బ్యాంకులలో ఉన్న బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు.