Home తాజా వార్తలు 8 మందిని మింగిన రోడ్లు

8 మందిని మింగిన రోడ్లు

Accident

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: వరంగల్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం, సాయంత్రం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. స్థానికుల కథనం ప్రకారంగా వివరాలిలా ఉన్నాయి.. జనగాం జిల్లా దేవరుప్పుల మండలం బంజార గ్రామ శివారులో పెట్రోల్‌బంకు వద్ద రెండు షిఫ్టు కారులు ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. వారిలో జనగాం జిల్లా కేంద్రానికి చెందిన పోగ సోమనర్సయ్య(36), చింతకింది మణికుమార్(25) దేవరుప్పుల మండలం పెద్ద వంగరకు చెందిన ఒర్రె మహేష్(30), కొమ్ము కృష్ణ(28)లు మృతిచెందిన వారిలో ఉన్నారు. మరో సంఘటనలో వరంగల్ రూరల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామశివారులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన బానోతు సోన(35) ములుగు నుండి కారులో వరంగల్‌కు వస్తున్నారు.

వరంగల్ నుండి ములుగు వైపు వస్తున్న తిరుపతిరెడ్డి కారును ఢీ కొట్టి ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను సోనా ఢీ కొట్టారు. ఈ సంఘటనలో సోనా కారులో ప్రయాణిస్తున్న సోనాతో పాటు ఆయన భార్య రజిత(33) వారి అబ్బాయి అక్కడిక్కడే మృతిచెందగా అంబులెన్స్‌లో ఉన్న అశ్విన్ అనే వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు సంఘటనల్లో ఎనిమిది మంది మృత్యువాత పడడం ఉమ్మడి జిల్లాను కుదిపేసినట్లయింది. ఇదిలా ఉంటే రెండు సంఘటనల్లో జరిగిన మృత్యువాతపై పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు.

8 killed in different road accidents