Home తాజా వార్తలు ఆహుతి

ఆహుతి

వరంగల్‌లో   8 మంది దుర్మరణం

భద్రకాళి బాణాసంచాలో భారీ అగ్ని ప్రమాదం   

ఐదుగురికి గాయాలు

భూకంపాన్ని తలపించింది
మృతుల్లో మహిళలే ఎక్కువ
నిర్లక్షం కారణంగానే….
క్షతగాత్రులు ఎంజిఎంకు
అధికారుల తీరుపై విమర్శలు
పర్యవేక్షణ లోపంపై నిరసనలు

సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, విచారణకు ఆదేశం
ఘటనా స్థలాన్ని సందర్శించిన డిప్యూటి సిఎం కడియం
మాంసం ముద్దలైన శరీరాలు, హృదయ విదారక దృశ్యాలు

Fire-Accident

వరంగల్ బ్యూరో/అర్బన్/క్రైమ్ : వరంగల్ నగర శివారు ప్రాంతమైన కోటిలింగాల సమీపంలోని భద్రకాళి ఫైర్‌వర్క్ అనే బాణసంచా కర్మాగారంలో బుధవారం ఉదయం సంభవించిన పేలుడులో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ఇందులో ఏడుగురు మహిళలే. ఐదుగురు తీవ్ర గాయాలతో ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొద్దిమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీలు లేని తీరులో మాంసపు ముద్దలయ్యాయి. పేలుడు ధాటికి మృతుల శరీరభాగాలు అర కిలోమీటర్ దూరం వరకు విసిరివేయబడ్డాయి. దగ్గరలోని ఇళ్ళ పైకప్పులు (రేకులు) ముక్కలైపోయాయి. పలు ఇళ్ళ గోడలు బీటలువారాయి. పేలుడు శబ్దం రెండు కి.మీ. దూరం వరకూ వినిపించింది. రోజువారీ తరహాలోనే బాణసంచాను భద్రపరిచే గోదామును శుభ్రం చేయడానికి 20 మంది కార్మికులు లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే భారీ స్థాయిలో మంటలు రావ డం, దట్టమైన పొగ ఆవరించడం, ఒక్కసారిగా భారీ శబ్దంతో బాణసంచా పేలిపోవడంతో లోపలేం జరుగుతుందో అర్థం కాలేదు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడడంతో ఎనిమిది మంది పరుగులతో బయటకు  స్వ ల్ప గాయాలతో చేరుకున్నప్పటికీ మిగిలినవారు లోపలే సజీవ దహనమైపోయారు. ఏడు మృతదేహాలను అగ్నిమాపక సిబ్బం ది వెలుపలికి తీసుకొచ్చారు. మృతులు  కాశిబుగ్గకు చెందిన బాల్నే రఘుపతి(40), గాజుల హరికృష్ణ(36), సుందరయ్య నగర్‌కు చెందిన కోమటి శ్రావణి(33), బేటి శ్రావణి, బసుకుల రేణుక(47), కీర్తినగర్‌కు చెందిన కందకట్ల శ్రీదేవి(34), ఎనమాములకు చెందిన రంగువినోద్‌లుగా గుర్తించారు.
విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణమా? :ఫ్యాక్టరీలోపల విద్యుత్ షార్ట్ సర్కూట్ లేదా నిప్పు కారణమై ఉంటుందని నగర పోలీసు కమిషనర్ ప్రాథమిక విచారణలో తేలింది. అయితే నిర్దిష్ట కారణాలను అన్వేషిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు. 2021 మార్చి వరకు ఈ బాణసంచా ఫ్యాక్టరీకి లైసెన్సు ఉందని వివరించారు. ఉదయం సంఘటన జరిగితే యజమాని పత్తా లేకుండా పోయారని, పోలీసులు రంగంలోకి దిగి సమాచారం సేకరించి శివారు ప్రాంతంలోని ఫారెస్టు కార్యాలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. యజమాని గొల్లపల్లి రాజ్‌కుమార్ అలియాస్ బాంబుల కుమార్‌పై ఐపిసిలోని 304, 285 సెక్షన్‌ల కిం ద, పేలుడు పదార్ధాల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఉదయం గోదామును శుభ్రం చేసే సమయలో సిగరెట్ వెలిగించుకోడానికి అగ్గిపుల్ల గీసి ఉండే అవకాశం కూడా లేకపోలేదని, అయితే ఇప్పుడే స్పష్టతకు రాలేమని, పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత నిర్దిష్ట కారణాలు తెలుస్తాయని తెలిపారు. యజమానిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు జరుపుతాం : కలెక్టర్
ఇంత భారీ స్థాయిలో పేలుడు జరిగిన బాణసంచా కర్మాగారం సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని, నిబంధనల ఉల్లంఘన ఏ మేరకు జరిగితే దర్యాప్తు చేస్తామని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత పేర్కొన్నారు. 2016లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగేంత వరకూ బాణసంచా ఫ్యాక్టరీలకు రెవిన్యూ విభాగం లెసెన్సులు ఇస్తూ ఉండేదని, ఇటీవల పోలీసు కమిషనరేట్ ఏర్పడడంతో ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైళ్ళను అప్పగించామని రూరల్ జిల్లా కలెక్టర్ హరిత స్పష్టం చేశారు. లెసెన్సును రెన్యూవల్ చేసే ప్రతీసారి కర్మాగారంలో క్షుణ్ణంగా తనిఖీ జరుగుతుందని, అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థ ఉందో లేదో సిబ్బంది రిశీలిస్తారని, క్రమం తప్పకుండా అగ్నిమాపక సిబ్బంది వెళ్ళి పరిశీలిస్తారని హరిత వివరించారు. ఎక్కడ లోపం జరిగిందో లోతుగా దర్యాప్తు జరుపుతామని, సంఘటనకు కారణాలను వివరిస్తూ నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
కుటుంబాలను ఆదుకుంటాం : డిప్యూటీ సిఎం
బాణసంచా కర్మాగారం పేలుడుతో మృతిచెందినవారంతా నిరుపేద కూలీలేనని, చాలా మంది పిల్లలు తల్లులను కోల్పోయారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లిస్తుందని, వారందరికీ రెండు పడకగదుల ఇళ్ళను మంజూరు చేస్తుందని, దెబ్బతిన్న ఇళ్ళకు పరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. తల్లిని కోల్పోయిన పిల్లలను ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుని చదివిస్తుందని తెలిపారు. నివాసాల మధ్య బాణసంచా ఫ్యాక్టరీ ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని వస్తున్న స్థానిక ఆరోపణలపై డిప్యూటీ సిఎం స్పందిస్తూ, పోలీసులు, జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారని, నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తల్లిని కోల్పోయిన పిల్లల బాధ వర్ణనాతీతం అని వ్యాఖ్యానించారు.
భీతావహ వాతావరణం : భారీ స్థాయి పేలుడుతో చుట్టుపక్కల ప్రాంతంలోని ఇండ్ల పైకప్పులు, కిటికీలు విరిగిపోయాయి. ఆరు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసి క్షతగాత్రులను ఆంబులెన్స్‌ల ద్వారా వైద్య సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. నగర పోలీసు కమిషనర్, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది అక్కడికి చేరుకునే వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. భారీ స్థాయిలో పేలుడు శబ్దం, దట్టమైన పొగ, మండలను చూసిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను రక్షించారు. కాలిపోయిన శరీరాలకు తాత్కాలిక ఉపశమనంగా సమీపంలో ఉన్న చెట్ల ఆకులను కప్పారు. కొద్దిసేపటికి అక్కడికి 108 అంబులెన్స్ సర్వీసులు రావడంతో ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. భారీ స్థాయిలో శబ్దంతో కూడిన పేలుడు సంభవించడంతో సుందరయ్యనగర్, కాశీబుగ్గ తదితర ప్రాంతాల్లోని కూలీలు అక్కడికి చేరుకుని తమ కుటుంబ సభ్యుల కోసం ఆరాట పడ్డారు. మృతిచెందిన వార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలు స్థానికులకు కంటతడి పెట్టించాయి.
ఉలిక్కిపడ్డ కోటిలింగాల : ఒక్కసారిగా ఉదయం పదకొండు గంటల సమయంలో బాణసంచా కర్మాగారంలో చోటుచేసుకున్న ప్రమాదంతో భారీ శబ్దం, దట్టమైన పొగ అలుముకోవడంతో కాశీబుగ్గ, సుందరయ్యనగర్, కోటిలింగాల ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. రెండు కిలోమీటర్ల దూరం వరకూ శబ్దం వినిపించిందని కాశీబుగ్గ స్థానికులు వ్యాఖ్యానించారు. పేలుడు ధాటికి భూమి కంపించిన అనుభూతి ఏర్పడిందని, కాళ్ళకింద భూమి కదిలినట్లయిందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న ఇళ్ళ పైకప్పు రేకులు ముక్కలైపోయాయి. కిటికీల అద్దాలు, తలుపులు పగిలిపోయాయి. కొన్ని ఇళ్ళ గోడలకు పగుళ్ళు ఏర్పడ్డాయి. ఇరవై ఏళ్ళుగా ఈ ఫ్యాక్టరీ నడుస్తూ ఉందని, జనావాసాల మధ్య ఇది ఉండడం ప్రమాదకరమని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు కాలి బూడిదయ్యే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపించారు. చేతులు కాలిన తర్వాత ఆకుల చందంగా అధికారుల తీరు ఉందని వ్యాఖ్యానించారు. ఫిర్యాదు చేసినప్పుడే అధికారులు తగిన తీరులో స్పందించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేదే కాదని, అధికారులు, సిబ్బంది బాణసంచా యజమానితో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకుని, అవినీతికి పాల్పడి నిర్లక్షంగా వ్యవహరించినందుకు ఇప్పుడు కూలీలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్థానికులు ఆరోపించారు.