Home జాతీయ వార్తలు అగ్రి బిల్లులు ఆపండి

అగ్రి బిల్లులు ఆపండి

 8 MPs were suspended from Rajya Sabha

 

రాష్ట్రపతికి 18 విపక్షాల వినతి

ప్రజాస్వామ్య వధను నిలిపివేయండి
వ్యవసాయ బిల్లులను తిప్పికొట్టండి
వీటిపై సంతకం చేయకండి
ప్రతిపక్షాల బాధాతప్త లేఖ
అధికారిక బలంతో అరాచకం
అట్టుడికిన రాజ్యసభ
విపక్షాల ఆందోళనలతో పలుసార్లు వాయిదా పడిన సభ
సభ్యుల తీరుపై వెంకయ్య ఆవేదన

8 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్

న్యూఢిల్లీ: అధికార బలం, అంతకు మించిన అడ్డగోలుతనంతో కేంద్రం వ్యవసాయ బిల్లులను ఆమోదింపచేసుకుందని, వీటిని నిలిపివేయాలని దేశంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు స్పందించాయి. వ్యవసాయ బిల్లులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మోదించరాదని, వీటి ఆమోద సంతకం చేయరాదని సోమవా రం 18 రాజకీయ పార్టీలు దేశ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు లేఖ పంపించాయి. రాజ్యసభలో ఎనిమిది మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్, సభ్యుల నిరసనలు, నినాదాల హోరు తరువాత సభ అర్థాంతర వాయిదా వంటి నాటకీ య పరిణామాల నడుమ ఈ విజ్ఞప్తి చోటుచేసుకుంది. సస్పెండ్ అయిన వివిధ పార్టీల సభ్యులు ఆ తరువాత సభాధ్యక్షుల రూలింగ్‌కు అనుగుణంగా సభ నుంచి బయటకు వెళ్లలేదు. సభలోనే ఉండి తమ నిరసనల ఉధృతిని కొనసాగించారు.

ఆ తరువాత వివిధ పార్టీల నేతలు, ఎంపిల కీలక సమావేశం జరిగింది. తరువాత బిల్లులను తిరస్కరించాలని ఏకంగా 18 పార్టీలు సంఘటిత రీతిలో దేశ ప్రధమ పౌరుడికి విజ్ఞప్తి చేయడం ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సెషన్ ముగింపు దశలో మరింత వేడికి దారితీసింది. పార్లమెంట్‌లో అధికార పక్షం ఈ బిల్లులను ఆమోదింపచేసుకున్న క్రమం పూర్తిగా అప్రజాస్వామికంగా ఉందని రాష్ట్రపతికి ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. ఇది సంపూర్ణ స్థాయి నిరంకుశ రీతి ప్రజాస్వామ్య హననం, అంతకు మించి పార్లమెంటరీ సాంప్రదాయాలకు విఘాతం అని ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. ఇటీవలి కాలంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ రాజకీయ పార్టీలు సంఘటితంగా వ్యవహరించడం, ప్రభుత్వాన్ని ధోరణిని నిరసిస్తూ ముక్తకంఠంతో రాష్ట్రపతికి తమ విజ్ఞప్తిని తెలియచేయడం తొలిసారిగా రికార్డు అయింది.

లోక్‌సభ, రాజ్యసభల ఆమోద ప్రక్రియ తరువాత బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదసంతకాలకు వెళ్లుతున్నాయి. రాష్ట్రపతి సంతకం చేస్తే బిల్లులు చట్టబద్ధతను సంతరించుకుంటాయి. ఈ దశలో ప్రతిపక్షాలు రాష్ట్రపతి వద్దకు తమ వాదనను తీసుకువెళ్లడంతో ఆ తరువాత రాష్ట్రపతి స్పందన ఏమిటనేది ఇప్పుడు కీలకంగా మారింది. కాంగ్రెస్, టిఆర్‌ఎస్, వామపక్షాలు, డిఎంకె, సమాజ్‌వాది పార్టీ, టిఎంసి, ఆర్జేడీ వంటి మొత్తం 18 రాజకీయ పార్టీల నేతలు ఈ బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి లేఖ పంపించాయి. ఈ బిల్లులు పూర్తిగా కార్పొరేట్ల పక్షపాతంగా ఉన్నాయని టిఆర్‌ఎస్ ఎంపిలు గళమొత్తారు. కార్పొరేట్లకు పెత్తనం కల్పిస్తూ, రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఈ బిల్లులు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి తమ వ్యతిరేకతను చాటింది. ప్రెసిడెంట్‌కు ప్రతిపక్షాలు సంయుక్తంగా పంపించిన లేఖలో పలు సున్నిత కీలక అంశాలను ప్రస్తావించారు.

ప్రతిపక్షాల బాధాతప్త లేఖ ఇదే..
‘రాష్ట్రపతి గారూ. ఇప్పుడు పార్లమెంట్ ఆమోదం పేరిట మీ ముందుకు వస్తున్న బిల్లుల విషయాన్ని మేం ప్రస్తావిస్తున్నాం. దేశంలోని వైవిధ్యపు విభిన్న పార్టీలు సొంత రాజకీయ అజెండాలకు , భౌగోళిక పూర్వాపరాలకు అతీతంగా స్పందిస్తున్నాం. ఈ బిల్లుల ఆమోద ప్రక్రియతో ప్రజాస్వామ్య హత్య జరిగింది. దీనిని గౌరవనీయంగా మీ దృష్టికి తీసుకువస్తున్నాం. ప్రజాస్వామిక అత్యున్నత దేవాలయం అయిన పార్లమెంట్ వేదికగా ఇప్పుడు ఈ ఘటన జరిగింది. దీనిని సవినయంగా మీ పరిగణనలోకి తీసుకువస్తున్నాం. పార్లమెంట్ వేదికగానే పద్ధతులకు విరుద్ధంగా వ్యవహారం సాగడం దారుణం అని తెలియచేస్తున్నాం. ఈ బిల్లులు మీ పరిశీలనకు వస్తున్నందున వీటిని నిలిపివేయాల్సి ఉందనే విషయాన్ని దృష్టికి తెస్తున్నాం. దీనిపై సంతకం చేయరాదని కోరుతున్నాం.

మీకున్న సంపూర్ణాధికారాలను వినియోగించుకోండి, రాజ్యాంగ, నైతికపరమైన విచక్షణాయుత అధికారాలను పరిగణనలోకి తీసుకుని వ్యవహరించండి. ఇప్పుడు తీసుకువచ్చింది అక్రమ చట్టం, దీనిని పూర్తిస్థాయి చట్టంగా అమలులోకి రానివ్వకుండా చూడండి. బ్లాక్ లా నిజమైన లా కాకుండా స్పందించండి’ అని ఈ లేఖలో కోరారు. ఆదివారం అత్యంత అసాధారణ, అంతకు మించిన గందరగోళం నినాదాలు నిరసనల నడుమనే రాజ్యసభలో ఆదివారం ఈ బిల్లులకు మూజువాణి ఆమోదం దక్కింది. ఈ క్రమంలో డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాసానికి నోటీసు, తరువాత రోజు ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ వంటి కీలక పరిణామాలు జరిగాయి. రాజ్యసభ సోమవారం వాయిదా పడింది. ఇప్పుడు తెచ్చిన బిల్లులు వ్యవసాయ సంస్కరణల ప్రధాన ఉద్ధేశపు బిల్లులు అని ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీ సమర్థించారు.

అయితే ఇవి ప్రజాస్వామ్యపు గొంతునులిమే చర్య అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రభుత్వం చెపుతున్న దానిని బట్టి ఈ బిల్లులోని అంశాలతో రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలుంటుంది. దీనికి సంబంధించి వారికి సరైన గిట్టుబాటు ధరలకు భరోసా కల్పించే చట్టం వస్తుంది. ఇక రైతులు నేరుగా అగ్రిబిజినెస్‌లోకి ప్రవేశించి తద్వారా తమ పంటలకు వాణిజ్యపరమైన పోటీలో సరైన ధరలు పొందేందుకు వీలు కల్పించే అధికారిక ఏర్పాటు ఉంటుంది. అంతేకాకుండా రైతులు వ్యాపారులతో ముందుగా కుదుర్చుకున్న ధరలకు అనుగుణంగా విక్రయించుకునేందుకు దారి ఏర్పడుతుంది.

అయితే ప్రభుత్వం కేవలం రైతాంగాన్ని దెబ్బతీస్తూ, పంటల మార్కెట్‌లో పూర్తి స్థాయిలోనే మార్కెటింగ్, కార్పొరేట్ సంస్థల ఆధిపత్యానికి వీలు కల్పించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటువంటి చట్టాలతో రైతాంగం పూర్తిగా సందిగ్ధావస్థకు వెళ్లుతుందని, వారి పంటలకు సరైన ధరలు దక్కని స్థితి ఏర్పడుతుందని ఆందోళనకు దిగుతున్నారు. పలు రాష్ట్రాలలో ఇప్పటికే రైతులు , వ్యవసాయ సంఘాలు ఈ బిల్లులపై వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టారు. పంజాబ్, హర్యానా ఇతర రాష్ట్రాలలో ఈ ఉద్యమం చివరికి పూర్తి స్థాయిలో ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటువంటివి అన్ని కూడా రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా చోటుచేసుకుంటున్నాయని, వీటికి తలొంచేది లేదని మోడీ సర్కారు స్పష్టం చేస్తోంది.

24వ తేదీ నుంచి కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం..
ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు వ్యవసాయ బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. ఈనెల 24 నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమం ఆరంభం అవుతుందని సోమవారం పా ర్టీ నేతలు తెలిపారు. బిల్లులకు వ్యతిరేకంగా ఉధృతస్థాయిలో ఉద్యమం ఉంటుందని, దేశవ్యాప్తంగా ఈ బిల్లులకు వ్యతిరేకంగా రెండు కోట్ల మంది రైతుల సంతకాలు సేకరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత కెసి వేణుగోపాల్ తెలిపారు. ఈ సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కాంగ్రెస్‌తరఫున పంపిస్తామని వెల్లడించారు. రాష్ట్రాల పార్టీల ఇన్‌చార్జీల భేటీ తరువాత ఉద్యమ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి ఉత్తర ప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జీ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక కూడా హాజరయ్యారు.

అధికారిక బలంతో అరాచకం..
రైతులకు సంబంధించిన అత్యంత కీలకమైన ఇటువంటి అంశంపై ఈ ప్రభుత్వం పూర్తిగా అధికార బలంతో, విచక్షణారహితంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు స్పందించాయి. అవాస్తవిక ధోరణిని అవలంభిస్తోన్న పాలనాయంత్రాంగం విచిత్రంగా వ్యవహరిస్తోందని, సంబంధిత భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. అన్నింటిని పరిశీలించి పరిగణనలోకి తీసుకుని తగు విధంగా హుందాగా వ్యవహరించాలి. అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వం తనదైన రీతిలో జిద్ (మొండితనం)తో వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి.

8 MPs were suspended from Rajya Sabha