Home తాజా వార్తలు నాన్న కొడుతున్నాడు సార్…

నాన్న కొడుతున్నాడు సార్…

Police-Complaint* తండ్రిపై పోలీసులకు 8ఏళ్ల బాలుడు ఫిర్యాదు
* విస్తుపోయిన ఎస్సై, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్

నిజామాబాద్‌:  సార్ నాన్న కొడుతున్నాడంటూ ఓ 8 ఏళ్ల బాలుడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైకు ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో విస్తు పోయిన వర్ని ఎస్సై అనిల్‌ రెడ్డి కొంత సేపటికి తేరుకొని బాలుడిని తనవద్దే ఉంచుకొని బాలుడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే… వర్ని మండలం వడ్డెపల్లి గ్రామానికి చెందిన శివ, రుక్మిణి దంపతుల 8 ఏళ్ల కుమారుడు మహేష్ 3వ తరగతి చదువుతున్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడికి దసరా సెలవులు రావడంతో ఇంటి వద్దే ఆడుకుంటున్న సమయంలో తండ్రి మందలింపుతో నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు.

నాన్న కొడుతున్నాడని అక్కడే ఉన్న ఎస్సైను కలవడంతో ఎస్సైతో పాటు ఇతర పోలీసు సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆరా తీస్తే గతంలో పలుమార్లు అమ్మనాన్నతో కలిసి బాలుడు పోలీస్‌స్టేషన్ వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. కుటుంబ తగాదాల కారణంగా తరుచూ అమ్మానాన్నలు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కడం కుమారుడు ముందే గొడవపడడం పోలీసులు ఇద్దరినీ సముదాయించి పంపడం బాలుడిని ప్రభావితం చేసినట్లు స్పష్టమైంది. సమస్య వస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలన్న ఆలోచన బలంగా నాటుకుపోవడంతో బాలుడు తండ్రిపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు భావించారు. వెంటనే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ఈ సంఘటన వర్ని మండలంలో చర్చనీయాంశం కాగా ఎస్సై అనిల్‌రెడ్డి సైతం విస్తు పోయారు.

8 Year Old Boy Police Complaint against His Father