Thursday, April 18, 2024

శవాల బావి మిస్టరీ తేలేదేలా..?

- Advertisement -
- Advertisement -

Telangana news,Telangana Latest news,Telangana Breaking news,Mana Telangana news, Telangana Online News

 తొమ్మిది మంది మృతి కేసులో ముమ్మరంగా దర్యాప్తు..
 ఫోరెన్సిక్ నివేదికే కీలకం..
 పోలీసుల అదుపులో ఇద్దరు బీహార్ యువకులు..?

మనతెలంగాణ/వరంగల్ క్రైం: ఒక పాడుపడ్డ బావిలో రెండు రోజుల క్రితం తొమ్మిది మృతదేహాలు లభించిన సంఘటనపై మిస్టరీ ఇంతవరకు వీడలేదు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు బయటి వ్యక్తులు నలుగురు ఒకే బావిలో మృతిచెంది ఉండడం మిస్టరీగా మారింది. పోలీసులకు సవాల్‌గా మారిన ఈకేసును చేధించేందుకు వరంగల్ సిపి ఏడు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయగా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా శివారులో రూరల్ జిల్లా పరిధిలోని గీసుకొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రీయల్ ఏరియా సమీపంలోని ఓ పాడుపడ్డ బావిలో గురువారం ఒకే కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలు లభ్యమవ్వగా, శుక్రవారం రోజున మరో ఐదు మృతదేహాలు బయటపడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతుల్లో పశ్చిమబెంగాల్, బీహార్, త్రిపుర మూడు రాష్ట్రాలకు చెందిన వారు ఉండడంతో ఈ తొమ్మిది మంది మృతి పట్ల దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. అయితే మొదటిరోజున పాడుబడ్డ బావి పక్కనే ఉన్న గోదాం యజమాని సంతోష్ నాలుగు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మసూద్ అతని భార్య నిష, కుమార్తె బుస్రా, మనుమడు బబ్లూల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆమరుసటి రోజు శుక్రవారం మసూద్ కుమారులు షాబాద్ అలం, షోహెల్ అలంల మృతదేహాలతో పాటు బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాం అనే ఇద్దరు మృతదేహాలు, త్రిపురకు చెందిన షకీల్ అనే యువకుని మృతదేహం లభించాయి.

 నాలుగు హత్యలు.. ఐదు ఆత్మహత్యలా..?
గొర్రెకుంట శివారులోని బావిలో లభ్యమైన తొమ్మిది మృతదేహాల కేసులో నలుగురిని హత్య చేసి, మరో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. తొమ్మిది మృతదేహాలను ఎంజిఎం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. ఈ పోస్టుమార్టం నివేదికలో నలుగురి మృతదేహాలపై కొన్ని గాయాలైనట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో నిపుణులు వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఈ మృతదేహాల మిస్టరీపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వడానికి మరో వారం రోజులు పడుతుందని ఎంజిఎం ఫోరెన్సిక్ వైద్యనిపుణుడు డాక్టర్ రజామాలిక్ తెలిపారు. నలుగురి శరీరంపై గాయాలున్నాయని వారు చనిపోయిన తరువాతనే బావిలో పడేసినట్లు భావిస్తున్నామని అవి హత్యలని మిగతా ఐదుగురు మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని వారు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నట్లు డాక్టర్ రజామాలిక్ ప్రాథమికంగా తెలిపారు. ఇద్దరు బీహార్‌కు చెందిన యువకులు సంజయ్, మోహన్‌లను శనివారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరు నోరువిప్పితే మిస్టరీ వీడుతుందని ఊహిస్తున్నారు.

 

9 Dead bodies found inside old well in Warangal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News