Home జిల్లాలు సేద్యానికి తొమ్మిది గంటల విద్యుత్

సేద్యానికి తొమ్మిది గంటల విద్యుత్

 పరిశ్రమలు, గృహ అవసరాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్
 ఏడాదిలోనే విద్యుత్ కొరతను అధిగమించాం
 రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
 విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు
 ఇంటింటికి గోదావరి నీళ్లు : రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
 గతం కన్నా మేడ్చల్ అభివృద్ధి ఘనం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
 నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

power-supplyమేడ్చల్/కీసర : వ్యవసాయానికి తొమ్మిది గంటలు పరిశ్రమలు, గృహ అవసరాల నిమిత్తం 24 గంటల నాణ్యమనైన విద్యుత్ అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలం పరిధిలో ఒక ఓవర్‌హెడ్ ట్యాంక్, మూడు సబ్‌స్టేషన్ల నిర్మాణాలకు రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డిలతో కలిసి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మొదటగా పట్టణంలోని స్టేషన్‌రోడ్డులో మిషన్ భగీరథలో భాగంగా రూ.1.20 కోటి వ్యయంతో నిర్మించనున్న 5 లక్షల లీటర్ల సామర్థం గల ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని దోబీఘట్ సమీపంలో రూ.1.43 కోటి వ్యయంతో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి పూడూరు గ్రామ పరిధిలో రూ.3.93 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజబొల్లారం గ్రామ పరిధిలో రూ.3.18 కోట్లతో నిర్మించనున్న సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ అందజేయాలనే లక్షంతో ప్రభుత్వం ముందుకుసాగుతోందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా గత వేసవిలో సైతం నిరంతర విద్యుత్ అందజేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు. నిరంతర విద్యుత్ అందించాలనే ఉద్ధేశంతోనే నూతన సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నగరానికి మేడ్చల్ చేరువగా ఉండటంతో గతంలోనే చాలా పరిశ్రమలు మేడ్చల్ పరిధిలో స్థాపన జరిగిందన్నారు. పరిశ్రమలలో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుండి ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు ఇక్కడి వలస వచ్చారని, దీంతో జనాభా అధికంగా పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని అన్నారు. వినియోగానికి తగినట్లుగా విద్యుత్ అందకపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నూతన సబ్‌స్టేషన్‌లను నిర్మిస్తున్నామని విద్యుత్ కొరత లేకుండా చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కోసం ఎంతో ఖర్చు చేస్తుందని అన్నారు.
ఇంటింటికీ గోదావరి నీళ్లందిస్తాం : రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
రానున్న రెండేళ్లలో జిల్లా అంతటా ఇంటింటికీ నల్లా ద్వారా నీరందిస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రజల దాహార్తిని తీర్చాలని సీఎం కెసిఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకురావడం హర్షణీయమని అన్నారు. మొదటగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గంతో పాటు మేడ్చల్ నియోజక వర్గానికీ ఈ వేసవిలోనే నీరందించనున్నట్లు తెలిపారు.
మేడ్చల్ అభివృద్ధి ఘనం : ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి
గతంలో కన్నా మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి ఎంతో ఘనంగా ఉందని ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. గత పాలకులు చేయలేని అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే మేడ్చల్ నియోజవర్గానికి మంచిగా నిధులు వస్తున్నాయని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని ఇంకా ఎంతో అభివృద్ది చేయాలనే తపనతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి విజయలక్ష్మీ, జడ్పీటిసి సభ్యురాలు శైలజా హరినాథ్, వైస్ ఎంపిపి భవానీ, విద్యుత్ శాఖ జిల్లా జోనల్ సీజీఎం పాండ్యా, ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఈ విజయరాంకుమార్, డీఈ రత్నాకర్‌రావు, ఈఈ(సివిల్) సత్యనారాయణరెడ్డి, డీఈ అబ్దుల్ కరీం, తహశిల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, నగరపంచాయతీ కమీషనర్ రామిరెడ్డి, ఎంపిడిఓ దేవసహాయం, ఈఓపీర్డీ జ్యోతిరెడ్డి, ఏడీ సత్యనారాయణరాజు, ఏఈ మోజెస్, సర్పంచ్‌లు స్రవంతి, నారాయణగౌడ్, రాజమల్లారెడ్డి, ఎంపిటిసి మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నారెడ్డి నందారెడ్డి, మల్లిఖార్జున్‌స్వామి, మండల అధ్యక్షుడు భాస్కర్‌యాదవ్, నగరపంచాయతీ అధ్యక్షుడు యు.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, నాయకులు ఇంద్రసేనారెడ్డి, దర్శన్, మేకర రాజశేఖర్‌రెడ్డి, రాఘవేందర్, శ్రీనివాస్, నర్సింహ్మారెడ్డి, వెంకటేశ్, రాములుయాదవ్, రామస్వామి, అజ్మత్, సుధాకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, మోనార్క్, మల్లేష్‌యాదవ్, మహిళా నాయకురాలు వసంత, శారద పాల్గొన్నారు.
కీసరలో..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలోనే విద్యుత్ కొరతను అధిగమించామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నాగారం, రాంపల్లి, అంకిరెడ్డిపల్లి గ్రామాలలో ఏర్పాటు చేయనున్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు సోమవారం ఆయన రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేశామని, వచ్చే ఏడాది నాటికి తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్ మండలాలలో 11 విద్యుత్ సబ్ స్టేషన్‌ల నిర్మాణాలకు రూ.65 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆరు నెలల కాలంలో సబ్ స్టేషన్ల నిర్మాణాలను పూర్తిచేసి ప్రజలకు మరింత మెరుగై విద్యుత్ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. పేదలకు రెండు పడక గదులను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలో జిల్లా అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వివక్షకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయత్వంలో జిల్లాను అన్ని రంగాల్లో ముందు నిలుపుతామని అన్నారు. వచ్చే ఏడాది నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలువ నున్న తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఇచ్చే స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1200 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.238 కోట్లు జిల్లాకే దక్కాయని తెలిపారు. దీంతో పాటు మిషన్ కాకతీయ, రెండు పడక గదుల ఇళ్ల పథకాలలో మిగతా జిల్లాలతో పోల్చితే మన జిల్లాకు అత్యధిక నిధుల కేటాయింపులు జరిగాయ న్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, అభివృద్ది కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.వినయ్‌కుమార్, తహశీల్దార్ సీఎచ్.రవీందర్‌రెడ్డి, ఎంపీపీ ఆర్.సుజాత, జడ్పీటీసీ బి.రమాదేవి, సర్పంచ్‌లు కె.చంద్రారెడ్డి, ఎం.జ్యోతి, పి.అనురాధ యాదగిరి గౌడ్, పి.రాజమణి, జి.మల్లేష్, ఉప సర్పంచ్ బి.శ్రీనివాస్ గౌడ్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షులు ఎం.రవికాంత్, ప్రధాన కార్యదర్శి టి.శ్రీధర్, ఎంపీటీసీ, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.