Home తాజా వార్తలు 90 ఎంఎల్ ఆరోగ్యకరమైన కిక్‌నిస్తుంది

90 ఎంఎల్ ఆరోగ్యకరమైన కిక్‌నిస్తుంది

90 ML cinema

 

‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో హీరోగా యువతలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమా ‘90 ఎంఎల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేహా సోలంకి హీరోయిన్‌గా కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర తెరకెక్కించిన ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈనెల 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా బిగ్ సీడీని లాంచ్ చేశారు. ఈ వేడుకలో సందీప్ కిషన్, జానీ మాస్టర్, రోల్ రిడా, తాగుబోతు రమేష్, విఠల్ రెడ్డి, రజిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ “కార్తికేయ క్రియేటివ్ వర్క్ బ్యానర్ నా కోసమే పుట్టింది.

ఈ బ్యానర్‌లో ‘ఆర్‌ఎక్స్ 100’ మూవీతో మంచి హిట్ అందుకున్నాము. ఇప్పుడు ‘90 ఎంఎల్’ కూడా సక్సెస్ సాధించి నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నా”అని అన్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ “నాకు మంచి తమ్ముడు లాంటి వ్యక్తి కార్తికేయ. అతను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు చూశాను. చాలా కష్టపడతాడు. దర్శకుడు శేఖర్ నాకు ముందే తెలుసు. అతనికి ఈ సినిమా మంచి గుర్తింపు తేవాలని కోరుకుంటున్నా”అని పేర్కొన్నారు. డైరెక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ “డిసెంబర్ 5న రిలీజ్ కాబోయే ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది.

అనూప్ రూబెన్స్ చాలా తక్కువ సమయంలో మంచి ఆల్బమ్ ఇచ్చారు. హీరోయిన్ నేహా సినిమాలో చాలా బాగా నటించింది. ఇక కథ వినగానే సినిమా ఒప్పుకొని ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా నాకు అండగా ఉన్న హీరో కార్తికేయ”అని తెలిపారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ “మందు తాగకపోతే బ్రతకని ఒక వ్యక్తి, మందు వాసన అంటే పడని ఒక వ్యక్తి కూతురికి మధ్య నడిచే లవ్ స్టోరీ ఈ సినిమా. మంచి బడ్జెట్‌లో సినిమాను నిర్మించాలని సొంతంగా మా హోమ్ బ్యానర్‌లో నిర్మించడం జరిగింది. దర్శకుడు శేఖర్ రెడ్డి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. రవి కిషన్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు. ఈ సినిమా ఆల్కహాల్‌ను ప్రోత్సహించదు… ఆరోగ్యకరమైన కిక్‌నిస్తుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనూప్ రూబెన్స్, నేహా సోలంకి తదితరులు పాల్గొన్నారు.

90 ML cinema released on December 5th