Home తాజా వార్తలు పాజిటివ్‌ల కంటే డిశ్చార్జ్‌లే ఎక్కువ…

పాజిటివ్‌ల కంటే డిశ్చార్జ్‌లే ఎక్కువ…

925 new Covid cases and 3 deaths registered in TS

 

కొత్తగా మరో 925 కేసులు, ముగ్గురు మృతి
జిహెచ్‌ఎంసి పరిధిలో 161, జిల్లాల్లో 764 మందికి వైరస్
2,62,653 కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య కంటే డిశ్చార్జ్‌ల సంఖ్యనే అధికంగా తేలుతోంది. కొత్తగా 925 పాజిటివ్‌లు నమోదు కాగా, 1367 మంది డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే వైరస్ సోకే వారి కంటే కోలుకునే వారు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం వైరస్ సోకిన వారిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 925 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 10, భద్రాద్రి 43, జగిత్యాల 39, జనగాం 19, భూపాలపల్లి 15, గద్వాల 11, కామారెడ్డి 12, కరీంనగర్ 52,ఖమ్మం 42, ఆసిఫాబాద్ 8, మహబూబ్‌నగర్ 12, మహబూబాబాద్ 9, మంచిర్యాల 26, మెదక్ 5, మేడ్చల్ మల్కాజ్‌గిరి 91, ములుగు 18, నాగర్‌కర్నూల్ 12, నల్గొండ 46, నారాయణపేట్ 0, నిర్మల్ 12, నిజామాబాద్ 11, పెద్దపల్లి 23, సిరిసిల్లా 25,

రంగారెడ్డి 75, సంగారెడ్డి 17, సిద్ధిపేట్ 13, సూర్యాపేట్ 23, వికారాబాద్ 14, వనపర్తి 10, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ లో 46, యాదాద్రిలో మరో 14 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో నలుగురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,62,653కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,49,157 కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

అతి స్వల్పంగా డెత్ రేట్…
రాష్ట్రంలో కరోనా డెత్ రేట్ అతి స్వల్పంగా తేలుతోంది. ఎనిమిది నెలల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల రేట్ కేవలం 0.54 శాతం తేలింది. ఇది దేశ సగటు 1.5 శాతం కంటే తక్కువగా తేలడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న నియంత్రణ చర్యలతో రాష్ట్రంలో అతి తక్కువ మరణాలు సంభవిస్తున్నట్లు ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా మరేరాష్ట్రంలోనూ ఇంత తక్కువ స్థాయిలో మరణాలు సంభవించలేదని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

51 లక్షలకు చేరువలో కరోనా టెస్టులు…
రాష్ట్రంలో కరోనా టెస్టులు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల 92 వేల 689 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంటే ప్రతి పది లక్షల మందిలో ఏకంగా లక్షా 36 వేల 826 మందికి కరోనా టెస్టులు చేసినట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. రాబోయే రోజుల్లో ప్రతి రోజూ లక్ష మందికి టెస్టులు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రతి రోజూ చేసే టెస్టుల్లో 44 శాతం మంది ప్రైమరీ కాంటాక్ట్‌లకు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరో 12 శాతం సెకండరీ కాంటాక్ట్‌లకు టెస్టులు చేస్తున్నట్లు అధికారులు హెల్త్ బులెటెన్‌లో పేర్కొన్నారు.

యాక్టివ్ కేసులు 12 వేలు మాత్రమే…
రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు కేవలం 12,070 మాత్రమే ఉన్నట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటెన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు లక్షల 62 వేల 653 మందికి వైరస్ సోకగా, వీరిలో ఏకంగా రెండు లక్షల 49 వేల 157 మంది కోలుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అంటే ప్రస్తుతం 12,070 యాక్టివ్ కేసులుండగా వీరిలో ఏకంగా 9741 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.

925 new Covid cases and 3 deaths registered in TS