Saturday, April 20, 2024

కరోనా చీకట్లపై కత్తిదూస్తూ కొవ్వొత్తులై..

- Advertisement -
- Advertisement -
99 doctors have died of covid 19 across in india
రోగుల చికిత్సలో ఉన్న డాక్టర్లకూ వైరస్. ఇప్పటికే 99 మందికి పైగా బలి. 1300 మంది వైద్యులకు పాజిటివ్

న్యూఢిల్లీ : సరిహద్దులలో జవాను… ఆస్పత్రులలో డాక్టరు. ఇప్పుడు ఈ ఇద్దరూ దేశమంతా గర్వించదగ్గ వీరులు అవుతున్నారు. ఎముకలు కొరికే చలిలో దూకుడుకు దిగే శత్రువుతో అనుక్షణపు పారాహుషార్‌తో సాగే జవాను. మన సరిహద్దులను కాపాడుతూ ఉంటాడు. దేశ ప్రజలను నిశ్చింతగా నిద్రపోనిస్తాడు. కన్పించే ఆవలి శత్రువును ఆమడదూరంలో నిలుపుతాడు. మరో వైపు వైద్యుడు కన్పించని కరోనా వైరస్ శత్రువు నుంచి ప్రజలను కాపాడేందుకు తనను తాను ఫణంగా పెట్టుకుని వీరోచిత పోరు సల్పుతాడు. ఈ అజ్ఞాత వైరస్ శత్రువు అంతుబట్టని లక్షణాలతో సాగుతోంది. ముట్టుకున్న వారిని సోకుతుంది. శరీరాన్ని కబళిస్తుంది.

అయితే ఇటువంటి పరిణామాలకు బెదరకుండా డాక్టరు తన విధి నిర్వహణలో ముందుకు సాగుతున్నాడు. దేశవ్యాప్తంగా ఇప్పటికే కరోనా రోగులకు సేవలు అందిస్తూ, చికిత్సల తరువాత వారిని ఆరోగ్యంగా ఇంటికి పంపించిన డాక్టర్లలో 99 మంది డాక్టర్లు ఆ తరువాత కరోనా వచ్చి కోలుకోలేని స్థితిలో మృతి చెందారు. వీరూ దేశానికి అమరవీరులే. దేశంలో ప్రముఖ వైద్య సంస్థ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) వారు వెలువరించిన ప్రకటనలో ఇప్పటికే 99 మంది డాక్టర్లు మృతి చెందిన విషయాన్ని తెలిపారు. కరోనా రోగుల చికిత్సలో ఉండే వైద్యులు అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని రెడ్ అలర్ట్ వెలువరించారు. ప్రత్యేకించి మెడికోలు జాగ్రత్తలు తీసుకోవాలని, సీనియర్ డాక్టర్ల సలహాలు పాటిస్తూ విధి నిర్వహణలో ఉండటం మంచిదని సూచించారు. పలు ప్రాంతాలలో వైద్య శిక్షణలో ఉన్న డాక్టర్లు నర్సులు కూడా కోవిడ్‌కాటుకు గురయ్యారు.

వైరస్‌తో సహజీవనమే వృత్తిధర్మం

కరోనావైరస్ కట్టడి యజ్ఞంలో దేశమంతటా వైద్య సిబ్బంది, ఆసుపత్రుల నిర్వహణా సిబ్బంది విశేషసేవలు అందిస్తున్నారు. వైరస్ లక్షణాలు ఉండే వేలాది మంది ఆస్పత్రులకు వచ్చినప్పుడు వారిని కసురుకోకుండా విసుకోకుండా చికిత్సలు అందిం చే క్రమంలో వారు వైరస్‌కు గురవుతున్నారు. కరో నా కంటైన్మెంట్ ఇప్పుడు దేశంలో ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో సాగుతోంది. వైద్య చరిత్రలో దేశానికి సంబంధించి ఇప్పటివరకూ ఈ స్థాయిలో వైద్య సిబ్బంది అత్యంత క్లిష్ట పరిస్థితులలో పనిచేయాల్సి రావడం ఇదే తొలిసారి. ఇప్పటికే దేశంలో 1302 మంది డాకర్టు ఇతర వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నారు. వీరిలో పలువురు మృతి చెందారని, ఇది చాలా ఆందోళనకర పరిణామం అని వైద్య సంస్థ తెలిపింది. ప్రత్యేకించి 50 సంవత్సరాలు దాటిన డాక్టర్లు ఎక్కువగా ఈ కరోనా చికిత్స సేవల దశలో చనిపోయ్యారు.

చనిపోయిన దాదాపు వంద మంది డాక్టర్లలో 73 మంది వరకూ 50 ఏండ్లు దాటిన వారే. వారు సీనియర్లు కావడం, వైద్య వృత్తిలో తగు అనుభవం ఉండటంతో తామే కరోనా రోగులకు చికిత్స విషయంలో నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలిసోతెలియకో నిర్లక్షంతో వ్యవహరించడం వారికి ప్రాణాంతకం అయింది. ఇక 35 నుంచి 50 ఏండ్ల లోపు ఉన్న వారు కూడా మృతి చెందారు. వీరిలో అత్యధికులు హౌస్‌సర్జన్లు ఇతరులు. మృతి చెందిన వైద్యులలో 57 మంది జనరల్ ప్రాక్టిషినర్స్ అని అధికారికంగా వెల్లడైంది. కరోనా చికిత్సలో ఉన్న డాక్టర్లు బలి అవుతున్న పరిణామం గురించి ఐఎంఎ తొలిసారిగా వెల్లడించింది.

డాక్టర్లూ జాగ్రత్త పాటించండి

అత్యధిక సంఖ్యలోనే కరోనా రోగులకు చికిత్సలు అందిస్తూ, సరైన సౌకర్యాలు లేకపోవడం కూడా డాక్టర్లకు సవాలుగా మారింది. ఈ క్రమంలో చికిత్సల ప్రక్రియలలో ఉండే వైద్య సిబ్బంది ముప్పును ఎదుర్కోవల్సి రావడం తీవ్రమైన అంశంగా మారింది. ప్రైవేటు ప్రాక్టిసు డాక్టర్లు చాలా మంది ఇప్పటికే తమ ప్రాక్టిసును నిలిపివేశారు. దేశంలో ఇతరత్రా రోగాల నిర్థారణలో , రక్తపు పరీక్షలు మూత్రపరీక్షలలో ఉండే సిబ్బంది కూడా కరోనాకు గురవుతున్నారు. దీనితో కరోనా వైరస్‌తో ఇతరత్రా వ్యాధుల చికిత్స క్రమంలో కూడా పలు చిక్కులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ ప్రకారం వైద్యులు ఖచ్చితంగా చికిత్సల ప్రక్రియలలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిపడ్డ కరోనా వైరస్ ఇంతకు ముందటి జబ్బులకు విభిన్నమైనది కావడంతో ఇందుకు అనుగుణంగా కరోనా చికిత్సలో ఉండే డాక్టర్లకు, వైద్య సిబ్బందికి తగు విధంగా ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ ఏర్పాటు కావాల్సి ఉందని ఐఎంఎ తెలిపింది.

వెనువెంటనే ఆసుపత్రులలో పరిపాలనా పరమైన నిర్వహణలో కీలక మార్పులు చేర్పులు చేపట్టాల్సి ఉంది. ఇన్‌ఫెక్షన్ నియంత్రణ పద్ధతులు ఆసుపత్రుల్లో రూపొందించాల్సి ఉంది. పెద్దపెద్ద ఆసుపత్రులలో డాక్టర్లకు తగు వైరస్ నివారణ జాగ్రత్తలు అమలు పర్చాల్సి ఉంటుంది. డాక్టర్లు నర్సులు ఇతర వైద్యసిబ్బందికి తగు విశ్రాంతిని ఇవ్వడంతో పాటు వారు చికిత్సలు అందించే సమయంలో ఉధృత స్థాయిలో క్లీనింగ్ శానిటైజేషన్ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తున్న సిబ్బందికి తగు రక్షణ కల్పించే దిశలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడితేనే దేశానికి కరోనా విముక్తి వేగవంతం అవుతుందని ఐఎంఎ అభిప్రాయపడుతోంది.

వారికోసం పాటుపడాలి

కరోనా చికిత్సలో ఉండే వైద్య సిబ్బంది ఆలనాపాలనకు సరైన చర్యలు తీసుకోవాలని, ఇందుకు ఓ స్నేహపూరిత సైంటిఫిక్ బృందం ఏర్పాటు చేయాలని ఐఎంఎ సెక్రెటరీ జనరల్ డాక్టర్ ఆర్‌వి అశోకన్ చెప్పారు. వారికి తగు సూచనలు అందిస్తూ ఉండాలి. వర్కింగ్ హౌవర్స్‌ను తగు విధంగా క్రమబద్థీకరించాలి, వారికి పిపిఇలు, చికిత్సదశలో తీసుకునే జాగ్రత్తలపై శిక్షణ ఇప్పించాలి. సంక్లిష్టమైన భౌతికదూర పాటింపు చర్యలు తీసుకోవాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News