ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి
మొదటివిడతలో 93.3శాతం సీట్ల భర్తీ
తొలిసారి ఎస్‌సి కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు
సీట్లు పొందిన వారిలో అబ్బాయిలే అధికం
76 కాలేజీలు, 6 యూనివర్శిటీల్లో 100% సీట్ల భర్తీ
ఆప్షన్లు ఇచ్చినా 16,793 మందికి లభించని సీట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. మొదటి విడతలో 93.3 శాతం సీ ట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద 172 కాలేజీల్లో 83,054 సీట్లు అందుబాటులోకి ఉండగా, 77,561 సీట్ల కేటాయింపు జరిగింది. సీట్లు పొందిన వారిలో 41,924 మంది(54.1 శాతం)అబ్బాయిలు, 35,637 మంది(45.9శాతం) అమ్మాయిలు ఉన్నారు. తొలి విడత సీట్ల కేటాయింపు తర్వాత 5,493 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా మిగిలాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 యూ నివర్సిటీ కళాశాలల్లో 6,108 సీట్లు అందుబాటులో ఉండగా, 5, 151 సీట్లు (84.3శాతం) కేటాయించారు. 957 సీట్లు ఖాళీగా మిగిలాయి.
రెండు ప్రైవేట్ యూనివర్సిటీలలో 1,367 సీట్లు అందుబాటులో ఉండగా, 1,357 సీట్లు(99.2 శాతం) కేటాయించగా, 10 సీట్లు ఖాళీగా మిగిలాయి. 149 ప్రైవేట్ కళాశాలల్లో 75,384 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి విడతలో 70,959 సీట్లు కేటాయించారు. ప్రైవేట్ కాలేజీల్లో 4,425 సీట్లు ఖాళీగా మిగిలాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో 16,793 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చినప్పటికీ పరిమితంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడం, సీట్ల లభ్యత, రిజర్వేషన్లు తదితర కారణాల వల్ల వారికి ఏ కాలేజీలోనూ సీట్లు లభించలేదు. మొదటి విడత కౌన్సెలింగ్ ద్వారా మిగిలిపోయిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో తొలిసారి ఎస్‌సి(షెడ్యూల్ కులాలు)లలో సబ్ కేటగిరీల వారీగా సీట్లు కేటాయించారు.
ఎస్‌సి వర్గీకరణ అమలయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు అమలు చేస్తున్న ఇడబ్లూఎస్ కోటా రిజర్వేషన్ కింద ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో 6,083 సీట్లు కేటాయించారు. ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈసారి మొత్తం 59,31,279 వెబ్ ఆప్షన్లు నమోదయ్యాయి. ఏటా సుమారు 40 నుంచి 50 లక్షల వరకు వెబ్ ఆప్షన్లు నమోదవుతుండగా, ఈ సారి మాత్రం దాదాపు 59 లక్షలకుపైగా ఆప్షన్లు నమోదయ్యాయి. మొత్తం 82 ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో 100 శాతం సీట్లు భర్తీ కాగా, అందులో ఆరు యూనివర్సిటీలు, 76 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో కంప్యూటర్ సైన్స్, ఐటి అనుబంధ బ్రాంచీలకే విద్యార్థులు అత్యధికంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.
22 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి..
కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా ఈనెల 22వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలా చేయని విద్యార్థుల సీటు కేటాయింపు రద్దువుతుంది. తర్వాత విడత కౌన్సిలింగ్‌లో ఆ సీటు ఖాళీ గా ఉన్నట్లుగా పరిగణిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత ఈ నెల 31 నుంచి ఆగస్టు 2 వరకు ఆయా కాలేజీ ల్లో రిపోర్టింగ్ చేయాలి. అదే సమయంలో విద్యార్థుల సర్టిఫికెట్లు జిరాక్స్ సెట్‌తో పాటు ఒరిజినల్ టిసిని కాలేజీలో అందజేయాల్సి ఉంటుంది.
మాక్ కౌన్సెలింగ్‌తో పెరిగిన అవగాహన
ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా సీట్ల భర్తీ ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈసారి జెఇఇ అడ్వాన్స్‌డ్ తరహాలో నిర్వహించిన మాక్ కౌన్సెలింగ్ సత్ఫలితానిచ్చింది. కళాశాల, బ్రాంచీ ఎంపిక పరిమితంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు మాక్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపుతో తమ ర్యాంకుకు ఏ కాలేజీలో, ఏ బ్రాంచీలో సీటు వస్తుందో అన్న అంశంపై అవగాహన పెరిగింది. దాంతో విద్యార్థులు తమ ర్యాంకుకు అనుగుణంగా తమకు ఏ కాలేజీలో, ఏ బ్రాంచీలో సీటు వస్తుందో అని ముందుగానే ఒక అంచనాకు వచ్చారు. మాక్ సీట్ల కేటాయింపు తర్వాత 36,544 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.