డైరీలో రాసుకుంటావో…గుండెల మీద రాసుకుంటావో నీ ఇష్టం
రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే నీకు ఎందుకు ఏడుపు?
నువ్వు పడావు పెట్టిన ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తాం
రాష్ట్ర అభివృద్ధిని చూసి నువ్వు, నీ కుటుంబం కుళ్లిపోవాలి
నాగర్‌కర్నూల్ జిల్లా జటప్రోల్ ప్రజాపాలన ప్రగతిబాట సభలో కెసిఆర్‌పై
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎదుగుతున్నా, రాష్ట్రం అభివృద్ధి సాధిస్తున్నా కెసిఆర్‌కు, ఆయన కుటుంబానికి దుఃఖం ముంచుకుని వస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జటప్రోలు గ్రామంలో శుక్రవారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆయన ప్రా రంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా పా లన ప్రగతి బాటలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాలమూరు బిడ్డ నైన నేను ఈ మట్టిలో పుట్టి ముఖ్యమంత్రి అయితే కెసిఆర్ కుటుంబం ఓర్వలేకపోతోంది అని ఆరోపించారు. 2034 వరకు నేనే సిఎంగా ఉంటా. పాలమూరు నుంచే పాలన సాగిస్తానని ఛాలెంజ్ విసిరారు. దీ నిని డైరీలో రాసుకో..నీ గుండెల మీద రాసుకో అ ని కెసిఆర్‌నుద్దేశించి అన్నారు.
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటే కెసిఆర్‌కు దుఃఖం ఎందుకని ప్రశ్నించారు. పేదలు బాగుపడుతున్నందుకు దుఃఖమా, నిరుద్యోగ యువతకు 60 వేల ఉద్యోగాలు కల్పించినందుకు దుఃఖమా? మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్న అభివృద్ధిని చూసి దుఃఖమా..? పడావు పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నందుకు దుఃఖమా..? మీ మనవళ్లు, మనవరాళ్లతో సమానంగా చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకు దుఃఖమా మహిళలకు పెట్రోల్ బంకులు, మహిళా క్యాంటీన్‌లు, ఆర్‌టిసి అద్దె బస్సులకు యజమానులు చేస్తున్నందుకా, అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఆడబిడ్డలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించినందుకు కెసిఆర్‌కు దుఃఖమా అని ప్రశ్నించారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే అది మూడేళ్లకే కూలేశ్వరం అయ్యిందని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల వంటి అనేక ప్రాజెక్టులు ఎంత నాణ్యతతో ఉన్నాయో.. కెసిఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఏ మేరకు నాణ్యతతో ఉన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు కేటాయించి ఉంటే కరువు ప్రాంతమైన ఉమ్మడి పాలమూరు జిల్లా, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలం అయ్యేవని అన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పాలమూరు బిడ్డలను కెసిఆర్ మోసం చేశారని, ఆ దొంగలకు సద్దులు మోస్తున్న మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమాధానం చెప్పాలన్నారు. దుఃఖంతో రగిలిపోతున్న కెసిఆర్‌కు తాము చేస్తున్న అభివృద్ది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా నుంచి ఎంపిగా గెలిచి ఈ పాలమూరుకే సున్నం పెట్టిన కెసిఆర్‌కు పాలమూరును అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. పాలమూరులో పడావు పెట్టిన సాగునీటి ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. పారిపోయి పాలమూరుకు వస్తే పాలమూరు బిడ్డలు తెలంగాణ నినాదాన్ని భుజాన ఎత్తుకుని కెసిఆర్‌ను గెలిపిస్తే నిండా ముంచారని ఆరోపించారు. ఎంపిని చేసి ఢిల్లీకి కెసిఆర్‌ను పంపితే సోనియాగా గాంధీ పార్లమెంట్ బిల్లు పెట్టే సమయంలో ఆయన సభలో లేరని అయినా ప్రజల సెంటిమెంట్‌ను గుర్తించిన సోనియమ్మ ఆంధ్రాలో తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు 98 జిఓ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి కెసిఆర్ ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు. ఇదే జిల్లాకు చెందిన వాల్మీకి బోయ సోదరులు ఎస్‌టి జాబితాలో చేర్చాలని, మాదాసి కురుమలకు ఎస్‌సి హోదా కల్పించాలని కోరితే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. నల్లమల ప్రాంతంలోనే ఈ జాతి బిడ్డలు అధికంగా ఉన్నారని వీరి హక్కుగా ఉన్న సమస్యలను ఎందుకు తీర్చలేకపోయారన్నారు. పాలమూరు ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడాన్ని ప్రాంత ప్రజలు గుర్తించాలని అభివృద్ధిని విస్మరించారన్నది ప్రజలు గుర్తించాలన్నారు. పదేళ్లలో పడావు పెట్టిన ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. డిసెంబర్ నాటికి పరిహారాన్ని చెల్లించే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నట్లు వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్షం రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్షంగా రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పాటు పడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. మంచి సంకల్పంతో మహిళా స్వయం సహాయక సంఘాలకు చేయూతను అందిస్తూ అనేక పథకాలను రూపొందించి అందించామని అన్నారు.
పాఠశాల విద్యార్థుల స్కూల్ డ్రెస్సులను కుట్టడానికి ఒక డ్రెస్సుకు 75 రూపాయలు చెల్లిస్తూ మహిళా సంఘాలకే ఆ బాధ్యత అప్పగించి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలకు మహిళా సంఘాలకు పూర్తి బాధ్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన సరిగ్గా జరుగుతుందా లేదా అన్న బాధ్యతలు అప్పగించామని అన్నారు. సెక్రటరియేట్ నుంచి కింది స్థాయి వరకు ఇందిరమ్మ క్యాంటీన్‌లను ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో వెయ్యి ఆర్‌టిసి అద్దె బస్సులను మహిళా సంఘాలకు అందించి ఆ బస్సులకు యజమానులను మహిళలను చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మహిళలకు ఆర్‌టిసిలో ఉచిత ప్రయాణాలు, పెట్రోల్ బంకుల ఏర్పాట్లు, వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను మహిళలకు కేటాయించామని అన్నారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీలకు రుణాలను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. రూ.344 కోట్ల నిధులతో రాష్ట్రంలోని 3 లక్షల 52 వేల 632 స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించే చెక్కులను జటప్రోలు వేదిక పైనుంచి అందించామని అన్నారు. ఇదంతా చూసి కెసిఆర్, కెసిఆర్ పిల్లలు పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకునే స్థితిలో దుఃఖంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా 118 దేశాలకు చెందిన సుందరీమణులు మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను చూసి సంబురపడ్డారని అన్నారు.
శిల్పారామం వద్ద వంద కోట్ల భూమిలో 150 దుకాణాలను ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు అందించామని అన్నారు. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల వ్యాపారాన్ని మహిళా సంఘాలు చేయాలన్నదే లక్షంగా పెట్టుకున్నామని అన్నారు. ఒక పక్క మహిళల ఆర్థికాభివృద్ధి, మరోపక్క పేద పిల్లలు నాణ్యత ప్రమాణాలతో మంచి విద్యను అభ్యసించే విధంగా అనేక పథకాలను రూపొందించి ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 60 వేల ఉద్యోగాలను కల్పించామని అన్నారు. తాము అధికారం చేపట్టి రెండున్నర ఏళ్లు పూర్తయ్యేలోగా పది మాసాలలో మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. దీంతో పాటు ఐటి సెక్టర్‌తో పాటు ప్రైవేట్ సెక్టార్‌లో విదేశీ పెట్టుబడిదారుల నుంచి వేలాది కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
కెసిఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్
కెసిఆర్ శాపగ్రస్తుడని, తెలంగాణ ప్రజలు బాగుపడుతుంటే కెసిఆర్, ఆయన కుటుంబం ఓర్వలేకపోతోందని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కెసిఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకుని తెలంగాణ బిడ్డలపై ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దుఃఖంతో రగిలిపోతున్న కెసిఆర్ దవాఖానాలకు పోతున్నారని వ్యాఖ్యానించారు. రాబో యే కాలంలో అభివృద్ధి చూసి తామేంటో చూపిస్తామని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇన్‌ఛార్జి మంత్రి దామోదర రాజనర్సింహకు ఆదేశాలు ఇస్తున్నానని సభా వేదిక ముఖంగా అన్నారు. సభకు మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత వహించగా మంత్రులు రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎంపి మల్లు రవి, ఎంఎల్‌సి కూచకుళ్ల దామోదర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి, మేఘా రెడ్డి, మధుసూదన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ పర్ణిక రెడ్డి, అనిరుధ్ రెడ్డి, ఈర్లపల్లి శంకర్, ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎంఎల్‌సి సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.