మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా (Team India) ప్రస్తుతం 12తో వెనుకబడి ఉన్న సంగతి తెలిసిందే. లార్డ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ చేజేతులా ఓడింది. స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్‌తో సహా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ ఆటగాడు కెఎల్ రాహుల్ తదితరులు విఫలమయ్యారు. దీంతో టీమిండియాకు అనూహ్య ఓటమి తప్పలేదు. ఇలాంటి స్థితిలో రానున్న మ్యాచుల్లో భారత జట్టుపై ఒత్తిడి ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. లీడ్స్, లార్డ్‌లలో మ్యాచ్‌ను గెలిచే స్థితిలోఉండి కూడా జట్టు పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇది జట్టు ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసింది.
సిరీస్‌ను దక్కించుకోవాలంటే ఇకపై జరిగే రెండు టెస్టుల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి భారత్‌కు ఏర్పడింది. కీలక సమయంలో బ్యాటర్లు ఒత్తిడికి గురై (batters under pressure) వికెట్లను పారేసుకుంటున్నారు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. జట్టుకు అండగా నిలువాల్సిన సమయంలో బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుకుంటున్నారు. ఇది జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇకపై జరిగే మ్యాచుల్లోనైనా బ్యాటర్లు తమ ఆటను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లకు జట్టులో కొదవలేదు. అయితే వీరిలో నిలకడ లోపించడం జట్టుకు సమస్యగా తయారైంది. తొలి ఇన్నింగ్స్‌లో బాగానే ఆడుతున్నా రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి బ్యాటర్లు చతికిల పడిపోతున్నారు.
అంతేగాక ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో కూడా మరింత మెరుగైన స్కోరును సాధించే ఛాన్స్ ఉన్నా కొంత మంది బ్యాటర్లు నిర్లక్షంగా ఆడి వికెట్లను పారేసుకుంటున్నారు. దీంతో జట్టు ఆశించిన స్కోరును అందుకోలేక పోతోంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ విషయం స్పష్టమైంది. రెండో టెస్టులో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. లార్డ్‌లో జరిగిన టెస్టులో కూడా మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా మరింత మెరుగైన స్కోరు సాధించి ఉండాల్సింది. అయితే కీలక సమయంలో వికెట్లను కోల్పోవడంతో భారత్ ఒక్క పరుగు ఆధిక్యాన్ని కూడా అందుకోలేక పోయింది. ఇలాంటి స్థితిలో రానున్న మ్యాచుల్లో బ్యాటర్లు మరింత మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు. కానీ ప్రస్తుతం జట్టు ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే మిగిలిన రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ను ఓడించడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్‌లో అసాధారణ రీతిలో రాణిస్తేనే టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. లేకుంటే మరోసారి చేదు ఫలితాన్ని చవిచూడం ఖాయం.