పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’.(Hari Hara Veeramallu) ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూలై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా లెజండరీ నిర్మాత ఎ.ఎం. రత్నం మీడియాతో మాట్లాడుతూ.. ‘17వ శతాబ్ధం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు.
ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లుకోవడం జరిగింది. హరి హర వీరమల్లు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాము.సినిమాని మొదట రెండు భాగాలని అనుకోలేదు. సినిమా అనేది వినోదంతో (Cinema entertainment) పాటు, సందేశాన్ని అందించాలనేది నా భావన. నేను రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలు అలాగే ఉంటాయి. వీరమల్లు అనేది చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే.. ఎక్కువమందికి చేరువ అవుతుందని భావించాము. పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడిగా ఎదిగారు.ఆయన గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. అలాగే పవన్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను.. ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయే గొప్ప చిత్రమిది’ అని అన్నారు.