టర్కీలోని బలికేసిర్ వాయువ్య ప్రాంతంలో ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి ఒకరు చనిపోగా, డజన్ల కొద్ది భవనాలు కూలాయని, కనీసం 29 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం సిందిర్గీ పట్టణంలో నమోదయింది. ఇస్తాంబుల్ ఉత్తరం వైపు దాదాపు 200 కిమీ. మేరకు ప్రకంపనలు వ్యాపించాయి. ఇస్తాంబుల్ నగరంలో 1 కోటి 60 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. సిందిర్గిలో ఓ భవనం కూలిపోవడంతో ఓ ముసాలావిడ చనిపోయింది.
శిథిలాల కింది నుంచి నలుగురిని కాపాడారు. ఆ ప్రాంతంలో దాదాపు 16 భవనాలు కూలిపోయాయని ఆంతరంగిక మంత్రి అలీ యెర్లికాయ విలేకరులకు తెలిపారు. భూకంపం తర్వాత అనేక ప్రకంపనలు వచ్చాయని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా ప్రభావితులంతా త్వరగా కోలుకోవాలని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ కాంక్షించారు. అంతేకాక ‘దైవం మిమ్మల్ని, మన దేశాన్ని రక్షించుగాక’ అని ఎక్స్ పోస్ట్ కూడా పెట్టారు. 2023లో కూడా టర్కీలో పెను భూకంపం వచ్చిందన్నది గమనార్హం.