నాకు మంత్రి పదవి రాకుండా పార్టీలో ముఖ్య నేతలు అడ్డుకున్నారు.. అని మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అడ్డుకున్నది ఎవరో స్పష్టం చేయకుండా ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అధిష్టానం నిలబెట్టుకోలేదని ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్న హామీ నిజమేనని చెప్పారు. అధిష్టానం హామీ ఇచ్చిన సమయంలో తానూ అక్కడే ఉన్నానని చెప్పడం గమనార్హం. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ట్వీట్‌లో భట్టివిక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. నాడు ఏమి జరిగిందో,
అధిష్టానం ఇచ్చిన హామీని తేటతెల్లం చేసేలా భట్టివిక్రమార్క ప్రజలకు వివరించారని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా పార్టీలోనే కొంత మంది ముఖ్య నేతలు అడ్డుకుంటూ అవమానిస్తున్నారని ఆయన ఆ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని అన్నారు. ప్రజలు అవినీతి రహిత పాలన కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇదిలాఉండగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించినందున రాజగోపాల్ రెడ్డికి ఇవ్వలేమని పార్టీ అధిష్టానం అభిప్రాయంగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదన్న భావనతో అధిష్టానం ఉన్నట్లు పార్టీ నేతలు అంటున్నారు.