Home కలం వర్గీకరణ సంఘీభావ దండోరా

వర్గీకరణ సంఘీభావ దండోరా

Kuvva

చరిత్రను ఎటు తిప్పి చూసినా ధర్మం, న్యాయం మోసినంతగా కష్టాల కావడి కుండలను మోసం, దగా భుజానికెత్తుకున్న దాఖలాలు కనిపించవు. అధర్మ శక్తులు సంఖ్యాప రంగా తక్కువే అయినా కుయుక్తులతో ముందుంటారు. శాసించే స్థాయినే కోరుకుంటారు. వాటి మెడలు వంచేందుకు బలహీన సమూహాలు ఏకమై చేసే యుద్ధం న్యాయ పక్ష విజయమే పొందినా అది ఎన్నడు ముగు స్తుందో తెలిసి చావదు. చలి చీమలు ఏకం కాకుం డా సర్పం కుట్రలు పన్నుతూనే ఉంటుంది. అణగా రిన వర్గాలు కండ్లు తెరిసేలోగా మరో పన్నాగ నాటక అంకం తెరలేస్తుంది. మాయ మాటలతో నిజాల్ని మరుగుపరచేందుకు అసత్యాన్నే సత్యమ ని భ్రమింపజేసేందుకు నిర్విరామ యత్నాలు సాగుతుంటాయి. ఈ మబ్బుల్ని దులిపి అణగా రిన వర్గాల ఆలోచనలకు పదును పెట్టడమే ఉద్యమాల పని.
ఏ ఉద్యమ రథానికైనా అక్షరం ముందు చక్రమే. ఉద్యమ లక్షాలపై స్పష్టత, స్ఫూర్తిని ఇచ్చేది సాహిత్యమే. అదే దశదిశను నిర్దేశిస్తుంది. ఎస్‌సిల వర్గీకరణ వల్ల అన్ని షెడ్యూల్డు కులాలకు సమన్యాయం దక్కుతుందని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని ఉన్నత పదవులు, స్థానాలు మాలలపరం అవుతున్నాయని, ఉప కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్ల పంపకం జరుగాలని తెలుగు నేలపై దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోంది.
ప్రత్యేకంగా మాదిగలు మనువాద కుల వ్యవస్థలో వెలివాడ బతుకులు అనుభవిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లలో తమకు న్యాయమైన వాటా అందడం లేదని ఆత్మగౌరవ పోరాటాన్ని ఆరంభించారు. మాదిగలతోపాటు ఎస్‌సిలలో మిగిలిన 59 కులాలను సైతం రక్షించే పనిలోపడ్డారు. ఇరువై మూడేళ్లుగా సాగుతున్న ఈ వర్గీకరణోద్యమం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. అడ్డుతగులుతున్న వ్యతిరేక శక్తులను దాటుకుంటూ న్యాయపర చిక్కులను విప్పుకుం టూ సాగుతోంది.
ఉద్యమానికి సైదోడుగా ఎస్‌సి వర్గీకరణకు మద్దతుగా జరుగుతున్న అన్యాయాన్ని, ఉప కులాల ఆశయాల్ని కవితం, కథలు, నవలలు, నాటకాలు, పాటలు, విమర్శ, వ్యాసాల ద్వారా నిర్విరామంగా కలం యోధులు బహిర్గతం చేస్తున్నారు. ఎస్‌సి వర్గీకరణను సమర్థిస్తూ వర్గీక రణీయం, మాదిగ చైతన్యం, దండోర దరువు, కైతునకల దండెం మొదలైన కవితా సంకలనాలు ఇది వరలో వచ్చాయి. అదే వరుసలో ‘వర్గీకరణో ద్యమ సంఘీ భావ కవిత్వం’గా చెప్పుకుంటూ వచ్చిన మరో సంకలనం ‘కువ్వ’ సరియైన పంప కాల ద్వారా చెందే భాగమే కువ్వ. కువ్వలు కువ్వలుగా పాళ్లు వేసుకోవలసిన రాజ్యాంగ ప్రయోజనాలలో హెచ్చు తగ్గులున్నాయని ఎత్తి చూపే కవిత్వం ఇందులో ఉంది.
‘కువ్వ’లోని కవిత్వంలో ఎస్‌సి వర్గీకరణను స్వీయానుభవ పూర్వకంగా కాంక్షిస్తున్న కవుల రచనలతోపాటు , వారికి తోడుగా, మద్దతుగా వర్గీకరణ ఆవశ్యకతను సమర్థించే దళితేతరులు రాసిన కవిత్వం కూడా ఉంది. ఇది మంచి పరిణామం. ఇలాంటి సంఘీభావం ఉద్యమ నిజాయితీని, తోడొచ్చిన రచయిత గుండె కొలతల ను తెలియజేస్తోంది.
50 కవితలున్న ఈ సంకలనంలో ఆవేశకావేశాలకన్నా, తమ హక్కులను హరిస్తున్న వారిపై కోపతాపాలకన్నా, కలిసి పంచుకొని ఒక టిగా బతుకుదామని, విడదీసే కుట్రలకు బలికా వద్దనే ఆశ, ఆలోచన ఉంది.దళితుల్లోని ఒక వర్గం రిజర్వేషన్ల ఫలాలను గంపగుత్తగా అనుభవిస్తూ మిగితా ఉప కులాలను అన్యాయం చేస్తుందనే భావన ఈ కవిత్వంలో విస్పష్టంగా కనిపిస్తోంది. చాటుగానో, నేటుగానో మాలలు ఈ దుష్ట పాత్ర పోషిస్తున్నారని కవుల గొంతుల్లో వినిపిస్తోంది. ఎండ్లూరి సుధాకర్ తన ‘వర్గీకరణ వ్యధ’ కవితలో – ‘నాలుగు ముద్దల్ని/ నలుగురం పంచుకుం దామంటాము మేము/ కాదు కుండ మాకే కావాలంటారు వాళ్లు’, ఎస్కిమోల్లాగా మేము మంచు గుహల్లో ఉంటే/ ఎస్కలేటర్ల మీద/ పార్లమెంటుకు తరలిపోయారు కదా!’ అంటారు. ‘వాళ్లు’ ఎవరో ఊహించుకోవలసిందే.
‘డక్కలి జాంబ పురాణం’ను ముద్రించి, దానిని సగౌరవంగా పల్లకిలో ఊరేగించి, మాదిగల్లో తానూ మాదిగనే అని సభాముఖంగా ప్రకటించిన ప్రొ” జయధీర్ తిరుమల రావు ‘మచ్చలమై సాక్షి సాక్షిగా’ అనే కవితలో సంఘీభావం ప్రకటించారు. ‘ప్రశ్నిస్తున్నది దండోరా/ దిగంతాలు ఏకం చేసేలా / ప్రతి జాంబవ పుత్రుడి వెనుక పది మంది నిలిచేలా’ అని తాను నిలిచారు.
‘తెరతీయగ రాదా’ అంటూ కృపాకర్ మాదిగ వర్గీకరణపై నోరెత్తని దళిత నేతలను నిలదీశారు. ‘రుధిర క్షేత్రంలో మెరిసిన ‘కత్తి’కి దళిత చిలుం పట్టింది, ఐక్యతని ‘తారక’ మంత్రంలా జపిస్తోంది. రాయితీ పోగులన్నీ నావేనని మోహిని ‘చింత’గా మూల్గింది. ‘శీలం’లేని నక్క మాదిగ సేలో పడింది, ఎబిసిడిలకు అడ్డంగా ‘మల్లు’లను దింపింది. అనే పంక్తుల్లో కవి దృష్టిని గ్రహించవచ్చు.
పసునూరి రవీందర్ ‘ఒక డిఎన్‌ఎ కొట్లాట’కు కాలు దువ్విండు. నా బొక్క నాకు దొరికే వరకు/ ఈ ధర్మ యుద్ధాన్ని కొనసాగిస్తూనే / నాబొక్కే కాదు / ఈ భూమ్మీద ఎవడి బొక్క వాడికి దొరికే దాక/ జాంబవంతుడి డిఎన్‌ఏనై కోట్లాడత’నం టాడు. ‘యుద్ధం అనివార్యమైనపుడు / నా మీదై నా సరే/ నేను కలబడతా’ అనడంలో విశాల బహుజన ఐక్యతకు సంకేతముంది.
ఎన్.గోపీ సంఘీభావంగా ‘ఇక ముందు కొమురయ్య డప్పు/ బొల్లి కొమరయ్య భవితవ్యా న్ని పాడుతుంది కాబోలు!’ అంటూ తన ‘డప్పు’ కవితలో రాబోయే తరాలకైనా వర్గీకరణ ఫలాలు దక్కాలని కాంక్షించారు.‘ఢిల్లీ సభలో భేషరతుగా చట్టం కావాలి/ ఎన్ని దఫాలైనా ఫరవాలేదు ఇక / కూచోని మాట్లాడుకోవాలి… సమ్మతించాలి/ సాధ్యం కాని పీఠముడిని తెలివిగా విప్పేయాలి…’ అని దామెర రాములు అశించారు. ‘గ్రహాలన్నీ విడవడ్డవే గదా’ అనే కవితలో డప్పోల్ల రమేష్ ‘మనువును ఏకిపారేసిన / కులాలకూ/ మలినం ఉన్నదంటే/ మనసుకు వడ్తలే/ ఇరవయేండ్లుగా నీ మనసు/ మారకపోవడమే అంతుబట్టని / అన్వేషణగా మిగిలింది’ అని రంధిపడ్తాడు.జూపాక సుభద్ర పెద్ద మనసుతో ‘నేను గోరు కొయ్యనై కావలుంటరా బిడ్డా/ మన సబ్బండ జాతి మీద ఆన/ విడువనియ్యరా గీ కత/ ‘వేయి పడిగెల’ పని బట్టే కత/ ముందటున్నది రార్రా..’ పంచాయతి తెంపింది.
ఇంకా – సి.నారాయణరెడ్డి, కె. శివారెడ్డి, కోయి కోటేశ్వరరావు, కంచె అయిలయ్య, వనపట్ల సుబ్బయ్య, జుగాష్‌విలి నను మాసస్వామి, స్కైబాబా, బెల్లం కొండ సంపత్ కుమార్ వంటి కవులు తమ అక్షరాల ద్వారా వర్గీకరణకు సంఘీభావం తెలిపారు.
ఈ సంకలనానికి ఆచార్య కొలుకనూరి ఇనాక్, ఆచార్య గుండెడప్పు కనకయ్య, జూపాక సుభద్ర, డా.నాళేశ్వరం శంకరం, డా. దార్ల వెంకటేశ్వరరావులు ముందు మాటలు అందించారు. వీటి ఆధారంగా పాఠకులు ‘మాదిగ హకుల దండోరా’ పూర్వపరాలు తెలుసుకోవ చ్చు. వీటిలో కవిత్వ విశ్లేషణతోపాటు ఉద్యమ గతులను కూడా అనివార్యంగా ప్రస్తావించడంతో నిండైన సమాచారం అందినట్లయింది. కువ్వ ఆవిష్కరణ కూడా ఒక సంచలనమే. తెలంగాణ లోని పది జిల్లాలలో ఒకే రోజు 9 ఆగస్టు 2016 నాడు ఏకకాలంలో ఆవిష్కరించబడింది. ఆ తర్వాత ఉద్యమ అవసరానుసారం ఢిల్లీ, బీదర్, విజయవాడలలో కూడా కువ్వ విడుదల సభలు జరిగాయి.
కువ్వ సంపాదకులు డప్పోల్ల రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రచయిత, కవి, గాయకుడు, కళాకారుడు అయిన రమేష్ మాదిగలకు, మాదిగ ఉప కులాలకు జరుగుతున్న అన్యాయం గురించి రాసే వారిలో ముందున్నాడు. వలపోత, చిటికె కోల దండోర ‘దీర్ఘ కవితల ద్వారా తన ఆవేదనాగ్నిని అక్షరీకరించాడు. గొప్ప సంకల్పంతో సామాజిక ప్రయోజనాన్ని ఆశించి కవుల సమూహాన్ని సంఘీభావ బాట పట్టించిన కృషి రమేష్‌ది. ఎస్‌సి వర్గీకరణోద్యమంలో సాహిత్యం చేసిన తోడ్పాటుకు గుర్తుగా కువ్వ నిలిచి ఉంటుంది.