హైదరాబాద్: సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ జవాన్ కూతురిపై దుండగులు దారుణానికి పాల్పడ్డారు. రెండు నెలల క్రితం ఇంటికి వెళ్తున్న బాలికపై దుండగులు రాడ్‌లతో కొట్టి అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటికి వెళ్తుండగా అమ్మాయిని పట్టుకుని నోట్లో బట్టను కుక్కేసి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. అపస్మారక పరిస్థితిలో రోడ్డుపై పడివున్న బాలికను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
అయితే సంఘటన జరిగి రెండు నెలలు అవుతున్నా ఇప్పటివరకు పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోలేదని బాలిక తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన విషయాలను పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా కేసు మూసివేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. మహిళ డిప్యూటీ కమీషనర్ సుమతి పని చేస్తున్న ప్రాంతంలో మహిళపై జరిగిన అత్యాచారం కేసును పోలీసులు పట్టించుకోకపోవడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిపై దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిలు ఈ కేసు విషయంలో పట్టించుకోవాలని వేడుకున్నారు.