Home స్కోర్ ధోనికి దక్కని ’ఎ ప్లస్‘

ధోనికి దక్కని ’ఎ ప్లస్‘

dhoni

వార్షిక వేతనాల్లో తేడాలు.. ఆశ్చర్యపోయిన అభిమానులు

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల వార్షిక వేతనాలు భారీగా పెంచుతూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు( బిసిసిఐ) కొత్త కాంట్రాక్టులు బుధవారం ప్రకటించింది. అయితే ఈ కాంట్రాక్టుల్లో సీనియర్ క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని, సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశిన్‌లకు టాప్‌గ్రేడ్ దక్కలేదు. బిసిసిఐ ఈసారి ఎ ప్లస్ , ఎ, బి, సిలుగా ఆటగాళ్ల కాంట్రాక్టులను విభజించింది. బిసిసిఐ కొత్తగా చేర్చిన ఎ+ గ్రేడ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ఐదుగురు ఉన్నారు. అన్ని ఫార్మట్లలో ఆడటం ఒకటైతే, ఐసిసి టాప్10 ర్యాం కుల్లో ఉన్న ఆటగాళ్లకు ఎ ప్లస్ గ్రేడ్ ఇవడం రెం డో కారణం. ఎ+ ఆటగాళ్లకు రూ. 7 కోట్ల వార్షిక వేతనం అందుంతోంది. వారు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బుమ్రాకు ధోని కంటే ఎక్కువ జీతం ఇవ్వడం ఏమిటని అభిమానులు ఆశర్యం వక్తం చేశారు.
కారణం ఏమిటి?
ధోనికి టాప్ గ్రేడ్ దక్కక పోవడానికి కారణమేమిటని ప్రశ్నించినపుడు బిసిసిఐ ఉన్నతాధికారి ‘సెలెక్టర్లు చాలా సునాయాస విధానాన్ని కనుగొన్నారు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఎక్కువ వేతనాలు పొందమనేదే ఈ విధానం. ప్రస్తుతం ఎ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఐదుగురు ఆటగాళ్లు మూడు ఫార్మాట్‌లలో ఆడుతున్నారు. దాంతో వారికి ఎక్కువ జీతం పొందే హక్కు లభించింది. ఈ విషయంలో రవిశాస్త్రి, కోహ్లి, ధోనిలను విశ్వాసంలోకి తీసుకోవడం జరిగింది’ అని తెలిపారు.
ఎ గ్రేడ్‌లో ఎవరెవరిని ఎందుకు చేర్చారు?
రెండో ర్యాంకయిన ఎ గ్రేడ్‌లో ఏదో ఒక ఫార్మాట్‌లో ఆడే క్రికెటర్లను చేర్చారు. అంటే సాహా, పుజార వంటివారిని. ధోని టెస్టు మ్యాచ్‌ల నుంచి విరమించుకున్నారు. కాగా అశ్విన్, జడేజాలు పరిమిత ఓవర్లలో లేరు. వారిని ఇప్పటికీ ప్రపంచ కప్‌కు సెలెక్ట్ చేయలేదు. కనుక వారిని ఈ రెండో ఎ గ్రేడ్‌లో ఉంచారు. ఎ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు వార్షిక వేతనం లభించనుంది. ఇక కె.ఎల్. రాహుల్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చహల్, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, దినేశ్ కార్తీక్‌లను బి గ్రేడ్‌లో ఉంచారు. వీరికి వార్షిక వేతనం రూ. 3 కోట్లు ఉండగలదు. సి గ్రేడ్ ఆటగాళ్లకు వార్షిక వేతనం రూ. 1 కోటి ఉండనుంది. ఈ గ్రేడ్‌లో కేదార్ జాదవ్, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, సురేశ్ రైనా, పార్థీవ్ పటేల్, జయంత్ యాదవ్ ఉన్నారు. మూడో ర్యాంకయిన బి గ్రేడ్‌లోని ఆటగాళ్లను ఏదో ఒక ఫార్మట్ టీమ్‌లో ఉంచడం జరుగుతుందని బిసిసిఐ అధికారి తెలిపారు. గత ఏడాది భారత్ తరఫున కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడిన ఆటగాళ్లను సి గ్రేడ్‌లో ఉంచారు.
ఏ గ్రేడ్‌కు ఎంత వృద్ధి?
ఈ వార్షిక వేతనం విభజన 2017 అక్టోబర్ నుంచి 2018 సెప్టెంబర్ వరకు ఉండనుంది. ఎ+ గ్రేడ్‌లోని ఆటగాళ్ల వార్షిక వేతనాన్ని రూ. 2 కోట్ల నుంచి రూ. 7 కోట్లకు పెంచారు. అంటే దాదాపు 350 శాతం వృద్ధి. ఇక రెండో ర్యాంకులోని ఆటగాళ్ల వార్షిక వేతనాన్ని రూ. 5 కోట్లు చేశారు. వారి వృద్ధి దాదాపు 500 శాతం.
వీరికి కాంట్రాక్టుల్లో స్థానం లభించలేదు!
ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై ఆయన భార్య గృహ హింస, వివాహేతర సంబంధాల ఆరోపణ చేసిన కారణంగా ఆయన పేరును నిలిపి ఉంచారు. యువరాజ్ సింగ్, రుషభ్ పంత్‌లను జాబితా నుంచి తొలగించారు. కాగా సురేశ్ రైనాను జాబితాలో తిరిగి చేర్చారు.
మిథాలీ రాజ్‌కు రూ. 50 లక్షలు…

మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ ఫీజులను కూడా బిసిసిఐ భారీ గా పెంచింది. ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఇప్పుడు ఏడాదికి రూ. 50 లక్షల (గత ఏడాది రూ. 15 లక్షలు) చొప్పు న లభిస్తుంది. ఈ జాబితాలో స్టార్ క్రీడాకారిణులు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన ఉన్నారు. మరి ఆరుగురికి ‘బి’ గ్రేడ్ (రూ. 30 లక్షలు)లో అవకాశం కల్పించగా, కొత్తగా గ్రేడ్ ‘సి’ని (రూ. 10 లక్ష లు) చేర్చి ఇందులో 9 మందిని చేర్చారు. దేశవాళీ క్రికెట్ లో (రంజీ ట్రోఫీ తదితర) కూడా మ్యాచ్ ఫీజులు ఏకంగా 200 శాతం పెరగడం మరో విశేషం. సీనియర్ పురుషుల విభాగంలో మ్యాచ్ జరిగే రోజుల్లో తుది జట్టులో ఉండే ఆటగాడికి రోజుకు రూ. 35 వేల చొప్పున చెల్లిస్తారు. ఇదే తరహాలో సీనియర్ మహిళల మ్యాచ్‌కు రోజుకు రూ. 12,500 చొప్పున లభిస్తుంది. క్రీడాకారులకు కాంట్రాక్ట్ మొత్తం అందించేందుకు బోర్డు తమ పిఆర్/సిఇఎఫ్ ఫండ్ నుంచి ఏడాదికి రూ. 125 కోట్లు కేటాయిస్తోంది. ఒకవేళ బోర్డు ఆదాయంలో కోత పడినా ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసుకున్నామని బిసిసిఐ వెల్లడించింది.

ఎవరెవరు ఏయే గ్రేడుల్లో..

‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): కోహ్లి, రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా.
‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): అశ్విన్, జడేజా, విజయ్, పుజారా, రహానే, ధోని, సాహా.
‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): రాహుల్, ఉమేశ్, కుల్దీప్, చహల్, పాండ్యా, ఇషాంత్, దినేశ్ కార్తీక్.
‘సి’ గ్రేడ్ (రూ. 1 కోటి): జాదవ్, పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, రైనా, పార్థివ్, జయంత్.