Home తాజా వార్తలు బరిలో ముందంజ

బరిలో ముందంజ

ప్రజాక్షేత్రంలో దూకుడు పెంచిన టిఆర్‌ఎస్
పొత్తులు, అభ్యర్థుల వేటలో విపక్ష పార్టీలు

Election

హైదరాబాద్ : రాజకీయ వ్యూహరచనలో దిట్టగా గుర్తింపు పొందిన కెసిఆర్ రాష్ట్రంలోని విపక్షాలను నిద్ర కరువయ్యేలా చేశారు. ఒక్కసారిగా అసెంబ్లీని రద్దుచేసి, 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి విపక్షాలను దిగ్భ్రాంతికి గురిచేశారు. ఇప్పటికీ ఆ పార్టీలు కోలుకోలేకపోతున్నాయి. ఆ పార్టీలేవీ తేరుకోకముందే అన్ని అసెంబ్లీ నియోజకర్గాల్లో ప్రచారాన్ని కూడా షురూ చేశారు. స్వయంగా కెసిఆర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు రోజుల క్రితమే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జాబితాలోని 105 మంది అభ్యర్థులు వారివారి నియోజకవర్గాల్లో ఓటర్లను కలు స్తూ ఇంటింటి ప్రచారాన్ని వేగం చేశారు. ప్రతిపక్షాలు మాత్రం ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేక అభ్యర్థులను వెతుక్కోవడం, పార్టీలతో పొత్తుల చర్చలు జరపడం, సీట్ల సర్దుబాటు వంటి ప్రక్రియల్లోనే తలమునకలయ్యాయి. ఈ ప్రక్రియ ఇప్పట్లో ముగిసేలా లేదు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సైతం నవంబరులోనే ఎన్నికలు జరపాల్సి రావచ్చన్న అంచనాతో నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. టిఆర్‌ఎస్ తరఫున పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర మంత్రులు సైతం పలు నియోజకవర్గాల్లో పాల్గొంటూ అసెంబ్లీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు మరో తలనొప్పి పట్టుకుంది. ఆ పార్టీమీద విశ్వాసం సన్నగిల్లి అధికార టిఆర్‌ఎస్‌లో చేరడానికి ఒక్కొక్కరూ వెళ్ళిపోతుండడంతో వారిని నిలువరించుకోడానికి, కొత్తగా వెళ్ళేవారెవరో ఆరాతీసి జాగ్రత్తలు తీసుకోవడంపైనే ప్రధాన దృష్టిని పెట్టాల్సి వస్తోంది. దీనికి తోడు విమర్శలు చేయడానికి, మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి తగినంత సమయాన్ని వెచ్చించక తప్పడంలేదు. కానీ టిఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించిన మరుసటిరోజు నుంచే వారంతా నియోజకవర్గాలకు చేరిపోయి ప్రచారాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టమైన సూచనలు, మార్గదర్శకాలు చేయడంతో ఆ బాటలో మరే పార్టీ ఇప్పట్లో అందుకోనంత వేగంగా ప్రచార ప్రక్రియను ప్రారంభించారు.
50 రోజుల్లో వంద బహిరంగసభలు : కెసిఆర్ 50 రోజుల్లో వంద నియోజకర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొంటారని పార్టీ ఇప్పటికే ప్రకటించడంతో ఆ రూట్‌మ్యాప్ ఏ విధంగా ఉందో, దానికి తగినట్లుగా రూట్‌మ్యాప్‌ను ఏ విధంగా తయారుచేసుకోవాలో అనే చర్చ కూడా బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో మొదలైంది. ప్రతీ రోజు రెండు నియోజకవర్గాల్లో ఏర్పాటయ్యే బహిరంగసభల్లో కెసిఆర్ ప్రసంగించనుండడం విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కెసిఆర్ చేసే ప్రసంగంలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని, ఆ పార్టీ చేసిన నిర్వాకాన్నీ ప్రస్తావిస్తుండడంతో వాటికి కౌంటర్ వ్యాఖ్యలు చేయడానికే కాంగ్రెస్ ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఢిల్లీ అధిష్టానాన్ని సంప్రదించి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే సమయంకల్లా టిఆర్‌ఎస్ ఒక దఫా ప్రచారాన్ని అన్ని నియోజకవర్గాల్లో పూర్తిచేసే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లోనే టిఆర్‌ఎస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా తయారుచేసి కెసిఆర్‌తో చర్చించి విడుదలచేయడానికి ప్రణాళిక ఖరారైంది.
విపక్ష నేతలంతా హైదరాబాద్‌లోనే :
ఎన్నికల ప్రచారం టిఆర్‌ఎస్ నేతలు, అభ్యర్థులు పూర్తిస్థాయిలో నిమగ్నంకాగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు మాత్రం ఇంకా హైదరాబాద్‌లోనే చర్చలు, సంప్రదింపుల దశలోనే ఉన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో పార్టీ పోలిట్‌బ్యూరో, కేంద్రకమిటీ నేతలతోనూ, సర్వసభ్య సమావేశంలో కార్యకర్తలతోనూ మాట్లాడి త్వరలోనే పొత్తులపై నిర్ణయం తీసుకుందామని సూచించారు. పొత్తుల చర్చలు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితరాలన్నీ జరిగేటప్పటికి ప్రచారం కోసం మిగిలే సమయం చాలా తక్కువగానే ఉంటుంది. దీనికి తోడు ఆ రెండు పార్టీల తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబునాయుడు, ఢిల్లీ నుంచి రాహుల్‌గాంధీ లాంటి నాయకులు వచ్చి ప్రచారం చేయడానికి షెడ్యూలును తయారుచేయడం మరో ప్రహసనమే. కెసిఆర్ వాగ్ధాటి, విసిరే పంచ్‌లు, తెరపైకి తీసుకొచ్చే సంచలన అంశాలతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరికావడంతో పాటు వాటికి సమాధానం చెప్పడానికి గణనీయమైన స్థాయిలో సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ప్రచారంలో టిఆర్‌ఎస్ పరుగులు పెడుతూ ఉంటే విపక్షాలు మాత్రం ఇంకా ప్రారంభించనేలేదు.
క్షేత్రస్థాయి కార్యకర్తలతో అభ్యర్థుల సమావేశాలు:
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు స్థానికంగా ఉండే పార్టీ నేతలతో సంప్రదింపులు, సమావేశాలను ప్రారంభించారు. ఇంటింటికీ ప్రచారం చేయడానికి నిర్దిష్ట వ్యూహంపై చర్చించారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎంపి బాల్క సుమన్ శుక్రవారమే స్థానిక పార్టీ శ్రేణులతో సమావేశాన్ని ఏర్పాటుచేయగా, తెలంగాణ భవన్‌లో మళ్ళీ శనివారం మరికొద్దిమంది శ్రేణులతో సమావేశం నిర్వహించి ప్రచార వ్యూహంపై చర్చించారు. అదే విధంగా అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే షురూ చేశారు.
బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ఆలయంలో పూజలుచేశారు. అనంతరం కార్యకర్తలు, స్థానిక నేతలతో చర్చలు జరిపారు.
లకా్ష్మరెడ్డి తన నియోజకవర్గంలో కార్యకర్తలతో హైదరాబాద్‌లోని నివాసంలో సమావేశమై ప్రచార వ్యూహం గురించి చర్చించారు.
అహ్మద్ బోధన్ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు.
నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా పకడ్బందీ ప్రచార వ్యూహాన్ని రూపొందించి స్థానిక నాయకత్వంతో చర్చించారు.
నియోజకవర్గంలో గ్యాదరి కిషోర్, నకిరేకల్‌లో వేముల వీరేశం తదితరులు కూడా నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు.
మర్రి జనార్ధనరెడ్డి ఇప్పటికే పలు దఫాలుగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, శ్రేణులతో సమావేశమై చర్చలు జరపడంతో పాటు ఆదివారం ఉదయం భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేశారు.
నియోజకవర్గంలో రెడ్యానాయక్ సైతం ప్రచారాన్ని ప్రారంభించారు