Home ఎడిటోరియల్ మరి పిఒకెకి ఏది ఓకే!

మరి పిఒకెకి ఏది ఓకే!

Azad Kashmir

 

పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల మనోభావాలు తెలుసుకొనేందుకు 2017లో సిటిజన్ పబ్లిక్ ఒపీనియన్ పేరిట ఒక సర్వే జరిగింది. 32 సబ్ డివిజన్లలోని పది వేల మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది. వారిలో 73% మంది కశ్మీర్‌లో కలిసి ఉండేందుకు ఇష్టపడ్డారు. ప్రధానంగా ఆజాద్ కశ్మీర్ ప్రజలను, ప్రాంతాన్ని పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలకు ఉపయోగించుకుంటోంది. సరిహద్దుల్లో ఉన్న ప్రజలు అటు పాలనా వివక్షతో ఇటు యుద్ధ భీతితో బతుకుతున్నారు.

దేశం తెల్లదొరల పాలన నుండి విముక్తి పొందిన ఆనందం మిగలని ప్రాంతంగా జమ్ము కశ్మీర్‌ను పేర్కొనవచ్చు. వందలాది సంస్థానాలు భారత్‌లో విలీనం కాగా జమ్ము కశ్మీర్ మాత్రం అపరిపక్వ, అరకొర విధానాలతో అస్థిరత పాలయింది. నిజాం స్టేట్ విలీనం విషయానికొస్తే ముస్లిం రాజు కన్నా హిందూ ప్రజలు ముఖ్యం. అదే జమ్ము కశ్మీర్‌లో ముస్లిం ప్రజల కన్నా హిందూ రాజు అభీష్టం ప్రధానం. నిజాం లొంగుబాటుకు జనం జేజేలు పలికితే రాజా హరిసింగ్ ఒప్పందానికి తిరుగుబాటు జరిగింది. పష్తూన్ గిరిజనుల ఆగ్రహానికి ఆజ్యంగా పాక్ సైన్యం తోడైంది. తిరగబడ్డ వారికి ఫలితం దక్కకపోగా వారు పాకిస్థాన్ ఆక్రమిత నేల బిడ్డలుగా మిగిలిపోయారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ అనగానే ఒకే రకమైన నైసర్గిక ప్రాంతంగా అనిపించవచ్చు కాని అది రెండు భిన్న జీవన విధానాల భౌగోళిక ప్రాంతం. పిఒకె ఆజాద్ జమ్ము కశ్మీర్, గిల్‌గిట్ బల్టిస్థాన్‌గా విడదీయబడింది. రెంటి మధ్య ఎలాంటి పోలికా లేదు. ఆజాద్ కశ్మీర్ సాధారణ భూభాగం జనసమ్మర్ధంగా ఉంటే గిల్‌గిట్ బల్టిస్థాన్ పూర్తిగా పర్వతమయ అటవీ ప్రాంతం. విస్తీర్ణపరంగా ఆజాద్ కశ్మీర్ కన్నా గిల్‌గిట్ బల్టిస్థాన్ ఆరింతలు పెద్దదైన భూమి. జనాభా విషయానికొస్తే ఆజాద్ కశ్మీర్‌లో 30 లక్షలుంటే గిల్‌గిట్‌లో 10 లక్షలే నివాసితులు. ఆజాద్ కశ్మీర్‌తో పోల్చితే గిల్‌గిట్ బల్టిస్థాన్ అన్ని విషయాల్లోనూ వెనుకబడ్డ ప్రాంతం. ఆజాద్ కశ్మీర్‌కు ముజఫరాబాద్ ముఖ్య పట్టణం. ఇందులో 8 జిల్లాలుంటాయి. దానికి సొంత అసెంబ్లీ, విధాన మండలి ఉన్నాయి. 49 మంది శాసన సభ్యులను ప్రజలు ఎన్నుకోగా, 12 మంది ఉన్న కౌన్సిల్‌కు పాకిస్థాన్ ప్రధాని అధిపతిగా ఉంటాడు.

ఒక స్వతంత్ర దేశానికి మాదిరే ప్రధాని, అధ్యక్షుడు కూడా ఉన్నారు. సొంత రాజ్యాంగం ఉంది. ఒక దేశంగా చెప్పుకొనేలా జాతీయ జెండా ఉంది. అయితే ఇదంతా బొమ్మల కొలువు. తోలు బొమ్మలాట. ఏ వ్యవస్థకూ ఎలాంటి అధికారాలు లేవు. అన్ని నిర్ణయాలు పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకుంటుంది. పాకిస్థాన్ ప్రభుత్వంలో కశ్మీర్ వ్యవహారాల కోసం ఒక మంత్రిత్వ శాఖ ఉంది. దాని ఆమోద ముద్ర తోనే ఇక్కడి పాలనలో కదలికలుంటాయి. సొంత హైకోర్టు, సుప్రీంకోర్టు, నేర స్మృతి, జాతీయ గీతం, పతాక ఉండి స్వతంత్రం బతకలేని ప్రాంతం ఇది. ఇదంతా భారత్‌లో ఒకనాటి బ్రిటిష్ పాలనకు నమూనాలా అనిపిస్తది. ఆజాద్ కశ్మీర్ రక్షణ, పన్నుల సేకరణ, విదేశీ వ్యవహారాలు అంతా పాక్ చూసుకుంటుంది.

ఇది వ్యవసాయాధారిత నేల అయినా అక్షరాస్యత ఎక్కువే. ప్రజలు కష్ట జీవులు. మొక్కజొన్న, గోధుమ ప్రధాన పంటలు. కర్ర సామాగ్రి, దుస్తుల తయారీ, కార్పెట్లు పరిశ్రమకు మంచి గుర్తింపు ఉంది. సొంత నేలపై, పాక్‌లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నందున చాలా మంది ఇతర దేశాలకు వెళుతుంటారు. ఆజాద్ కశ్మీర్ పౌరులు యూరపులోని వివిధ దేశాల్లో, అరబ్ దేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. వారి సంపాదన సొంత నేలకు పంపడం వల్ల పాకిస్థాన్‌కు చెప్పుకోదగ్గ విదేశీ మారక ద్రవ్యం అందుతోంది. ఆజాద్ కశ్మీర్ ప్రజలు తాము కశ్మీరీలమని భావిస్తారు తప్ప పాకిస్థానీలమనుకోరు. కాని ఏమీ చేయలేని అసహాయత వారిలో దశాబ్దాలుగా గూడుకట్టుకుంది. వీరికి సైనిక పాటవాలు నేర్పవద్దనే దృష్టిలో పాక్ సైన్యంలో వీరిని చేర్చుకోరు.

ఆజాద్ కశ్మీర్ అసెంబ్లీకి పోటీ చేసే వారిపై పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ చాటుగా విచారణ చేపడుతుంది. పాక్ వ్యతిరేక చర్యలలో పాల్గొన్నవారు గాని, అలాంటి ఆలోచన ఉన్న వారిని గాని పోటీకి అంగీకరించరు. జరిగే ఎన్నికలు ఒక ప్రహసనంగా ముగుస్తాయి. గిల్‌గిట్ బల్టిస్థాన్ పరిస్థితి మరింత దారుణం. ఇది పూర్తిగా పాకిస్థాన్ పాలనలో ఉంటుంది. ఎలాంటి సొంత రాజ్యాంగ వ్యవస్థలు లేవు. అంతర్జాతీయ, మానవ హక్కుల సంఘాల ఒత్తిడికి తలవొగ్గి అక్కడ పాక్ నామమాత్రపు స్వయం పాలనను ఏర్పాటు చేసింది. ప్రధాని ప్రతినిధిగా గవర్నర్ కార్యనిర్వాహక అధికారిగా కొనసాగుతారు. 15 మంది సభ్యులున్న కౌన్సిల్‌కు 8 మందిని పాక్ ప్రభుత్వం నియమిస్తుంది. ఏడుగురిని ప్రజలు ఎన్నుకుంటారు. గిల్‌గిట్ బల్టిస్థాన్‌లో అక్షరాస్యత కేవలం 15 శాతమే. మూడింట రెండు వంతుల గ్రామాలకు తాగునీటి సౌకర్యం, విద్యుత్తు, టెలిఫోను, ఆరోగ్య కేంద్రాలు, బలికల పాఠశాలలు, రోడ్లు నిర్మాణం, రేషన్ షాపులు లేవు.

ఇక్కడి భూభాగంలో చైనా వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి సెప్టెంబర్ 2009లో ఒప్పందాలయ్యాయి. ఇలా అక్కడ సహజ వనరులు చైనాకు అప్పగించినా దానికి ప్రతిఫలంగా గిల్‌గిట్ ప్రజలకు ఏమీ దక్కడం లేదు. కనీసం నిర్మాణంలో ఉపాధి అవకాశాలు కూడా స్థానికులకు దక్కడం లేదు. ఈ విషయంలో ప్రశ్నించిన నాయకుడు డా॥ సెంగే సేరింగ్‌పై దేశ ద్రోహ అభియోగం మోపబడింది. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్న ఆయన కశ్మీర్ పట్ల భారత్ తీసుకున్న ఇటీవలి నిర్ణయాలను స్వాగతించారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మొత్తానికి భావ ప్రకటనా స్వేచ్ఛ మృగ్యమనే చెప్పవచ్చు. పాక్ దమనకాండను, తమ స్వతంత్ర కాంక్షను తెలియజేసే ఒక్క అక్షరమూ పత్రికల్లో, రచనల్లో కనబడకూడదు. హద్దు దాటిన రచయితలపై, జర్నలిస్టులపై దేశ ద్రోహ నేరం తప్పదు. మంజూర్ హుసేన్ పర్వానా సంపాదకత్వంలోని కిర్గిల్ ఇంటర్నేషనల్ ఈ విధంగా 2004లో నిషేధించబడింది. ఎడిటర్, పబ్లిషర్ ఇద్దరిపై రాజ ద్రోహ నేరం మోపబడింది. పర్వానా రాసిన, ‘సబ్ లిభ్‌నా జుల్మ్ హై’ అనే పుస్తకం పదేళ్లుగా నిషేధంలో ఉంది. పిఒకెపై రాసిన బయటి పుస్తకాలకు ప్రవేశం లేకపోగా స్థానికులు రాసిన పుస్తకాలపై నిషేధం ఉంది. 2016లో 16 పుస్తకాలను నిషేధిత చిట్టాలో పాక్ ప్రభుత్వం చేర్చింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల మనోభావాలు తెలుసుకొనేందుకు 2017లో సిటిజన్ పబ్లిక్ ఒపీనియన్ పేరిట ఒక సర్వే జరిగింది. 32 సబ్ డివిజన్లలోని పది వేల మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది. వారిలో 73% మంది కశ్మీర్‌లో కలిసి ఉండేందుకు ఇష్టపడ్డారు. ప్రధానంగా ఆజాద్ కశ్మీర్ ప్రజలను, ప్రాంతాన్ని పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలకు ఉపయోగించుకుంటోంది. సరిహద్దుల్లో ఉన్న ప్రజలు అటు పాలనా వివక్షతో ఇటు యుద్ధ భీతితో బతుకుతున్నారు. ఆగస్టు 5న కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు పిఒకెను స్వాధీనం చేసుకుంటామని భారత ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడి ప్రజల్లో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయనవచ్చు.

అయితే ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలు బయటికి పొక్కడం లేదు. అటు పాకిస్థాన్ యుద్ధానికి రంకెలు వేస్తోంది. ఈ పరిస్థితి చక్కబడడానికి ఎంత సమయం పడుతుందో, ఏ మలుపులు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారత్‌లో ముస్లింల పరిస్థితి తెలిసినా పొయ్యిలోంచి పెంక మీద పడినా కొంత ఉపశమనమే కదా అని పిఒకె ప్రజలు భావిస్తున్నారనవచ్చు. అయితే మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్ట బడితే ఆ భూభాగం యుద్ధ క్షేత్రంమూ అయే అవకాశం ఉంది.

A survey titled Citizen Public Opinion in 2017