Home అంతర్జాతీయ వార్తలు స్నేహం-వెన్నెల సోన!

స్నేహం-వెన్నెల సోన!

friendship_manatelanganaఒక మనిషి ఇష్టాల్ని మరొకరిలో గుర్తించడం..ఒకరి ఆలోచనల్లో మరొకరు ప్రతిబింబించడం.. ఒకరి కంటిలో నలుసు పడితే మరొకరి గుండె విలవిల్లాడడం. ఒక కుమిలే హృదయాన్ని మరో గుండె పొదివి పట్టు కోవడం.. ఒక నాణేనికి రెండు వ్యక్తిత్వాలు ముద్రించి నట్లుగా కనిపించడం.. అనుభూతుల కలబోతలో పారదర్శకంగా కనిపించే మనస్తత్వాన్ని ప్రదర్శించడం.. ఈ బంధాన్ని, అను బంధాన్ని ఏమంటాం..? చెప్పేందుకు వేరే పదాలేం గుర్తు కొస్తాయి.. సరితూగుతాయి.. అది ఒకే ఒక్క పదం స్నేహం. చెలిమి లేని చిన్నతనం ఉండదు. సావాసం లేకుండా జీవన సాఫల్యత లభించదు. అభిరుచు ల్లో సామీప్యం.. అభిప్రాయాల్లో సారూప్యం.. రెండు హృదయాలూ ఒక మనస్సు.. దీనికి ప్రతిరూపమే స్నేహం. ‘శోకరాతి భయత్రాణం ప్రతీ విస్రంభ భాజనం… కేనరత్న మిదం స్పష్టం మిత్ర మిత్యక్షర ద్వయం’ అంటే దు:ఖం నుంచీ, శత్రుభయం నుంచీ రక్షించేదీ, విశ్వాస ప్రీతిపాత్రమైనదీ అయిన ‘మిత్రం’ అనే రెండు అక్షరాల ఈ రత్నాన్ని ఎవడు సృష్టించాడో కదా అని హితోపదేశం చాటింది.
స్నేహం అదో సజీవ స్రవంతి. ప్రతి మనిషి జీవితంలో ప్రతి దశలోనూ అది వెంటనడుస్తుందీ.. దేశ, జాతి, మత, కాల వ్యత్యాసాలకు అతీతమైందీ చెలిమి. ఆ స్నేహం అమలినమైనదీ..అనిర్వచనీయమైనదీ..అనంతమైనదీ. లింగ, వయో భేదాలు కూడా అడ్డురావు. అమ్మ ఒడినీ, నాన్న చిటికెన వేలునూ వదిలిపెట్టిన మరుక్షణమే మరో భుజంపై చేయి వేసి సంతోషంగా, సరదాగా, స్వచ్ఛంగా సాగిపోయే జీవితమే స్నేహం. నిజమైన స్నేహం ఎప్పటికీ వాడదు.. వీడదు. అనురాగాలు, ఆప్యాయతల పరిమళాలు వెదజల్లు తూనే ఉంటుంది. అందుకే మనసు కవి ఆత్రేయ ‘మల్లెపూవు నల్లగా మాయవచ్చును, మంచుకూడ వేడి సెగల ఎగయవచ్చును, పువ్వుబట్టి తేనె రుచి మార వచ్చును, చెక్కు చెదరనిది స్నేహమని నమ్మవచ్చును, స్నేహబంధము..ఎంత మధురము.. చెరిగిపోదు.. తరిగి పోదు.. జీవితాంతము’ అని కమ్మని గీతం రాశారు. మన విశ్వసాహిత్యంలో ఎందరో స్నేహితులు కనిపిస్తారు. రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు. కృష్ణ కుచేల చెలిమి… స్నేహానికి కలిమి లేములు అడ్డుకావని నిరూపించింది. దుర్యోధనుని పట్ల కర్ణుని మిత్రత్వ కృతజ్ఞత.. తల్లి కుంతీదేవి ప్రేమకు కూడా లొంగలేదు. మహాకవి గురజాడ రాసిన ‘డామన్ పితియస్’ స్నేహం ఎంతో విశిష్టమైంది. ‘వన్నెకెక్కిరి డామను పితియసులన్న యవనుల ముజ్జగంబుల మున్ను, వారల స్నేహసంపదనెన్న సుకృతం’ అని గురజాడ ఆ స్నేహ సంపదను వర్ణించాడు. ఆధునిక కాలంలోనూ ఎందరో స్నేహితులు మనకు కనిపిస్తారు. వారందరిలోనూ మహామహో పాధ్యాయులు మార్క్స్ ఏంగెల్స్‌ల స్నేహం వెలకట్టలేనిది. చెక్కుచెదరని స్నేహతత్వాన్ని జీవితాంతం నిలుపుకొన్న నిజమైన మిత్రులు వారు. ఈ ఆధునిక ప్రపంచంలో స్నేహానికి నిజమైన ప్రతీకగా చెప్పాలంటే.. మార్క్స్ ఏంగెల్స్‌లనే చూపాలి.
మనిషి ఎంత పెద్దవాడైనా, ఏ హోదాలో ఉన్నా.. తీయని ఊసులు బాల్యస్నేహితులు పంచినవే. వాటిని నెమరువేసుకు

న్నప్పుడు మనిషికి అసలు స్వర్గమంటే ఇదే కదా అని అనిపిస్తుంది. చెట్టపట్టాలు వేసుకుని చెలిమి గీతం పాడుకున్న బాల్యం ప్రతి మనిషికీ అపురూపమైందే. గోళీలాటలు, క్రికెట్ పరుగులు, బొమ్మల పెళ్లిళ్లు, సైకిలు నేర్చుకుంటూ కిందపడ్డప్పుడు ఒకరికి గాయమైతే మరొకరికి నొప్పితగలడం లాంటి అనుభూతులు, చిలిపి దొంగ తనాలు, అల్లరి చేష్టల శ్రీకృష్ణలీలలు, అందమైన అమ్మాయిలను కళ్లింతలు చేసు కుని తుళ్లింతలు పోవడం.. ఏ మనిషి జీవితం లోనైనా సహజాతిసహజాలే.
కానీ కాలం మారింది. స్నేహం కూడా వాతావరణం లా కలుషిత మవుతోంది. హాయ్ అంటూ పలకరింపులు, బై అంటూ ముగింపులు వెనువెంటనే చోటుచేసు కుంటున్నాయి. పలకరింపుల్లో పైసా పరమార్థం, కరచాలనంలో స్వార్థ ప్రయోజనం, ఆలింగనాల్లో లాభాపేక్ష దాగి ఉంటోంది. ప్రపంచీకరణ, సరళీకరణ, వాణిజ్యీక రణలో స్నేహం ఓ సరకులా మారిపోవడమే విచారం. నెట్టింటిలో వందలాది మిత్రులు దొరకవచ్చుగానీ మనసు పంచుకొనేవారూ, జీవితంలో అండై నిలిచేవారూ.. ఒక్కరు కూడా కనిపించని విచిత్రపరిస్థితి నేడు దాపురించింది. నిజానికి, స్నేహం అంటే చమురు అనే అర్థం కూడా ఉంది. దీని ప్రకారం చేతి చమురు వదిలించుకొని స్నేహితులను పోగుచేసుకునే వారూ ఉన్నారు. స్నేహితులుగా వచ్చి జేబు ఖాళీచేసి వెళ్లేవారూ ఉన్నారు. ఇటువంటి స్నేహాలు గతంలోనూ ఉన్నాయి. సుప్రసిద్ధ ఫ్రెంచి తత్వవేత్త వోల్తేర్ తన స్నేహితుల వల్ల ఎంతో వ్యధకు గురయ్యాడు. ఆయన బాగా సంపాదించిన తర్వాత అందర్నీ ఆదరించడమూ, ఆదుకోవడమూ అలవర్చు కొన్నాడు. ఈ క్రమంలో స్వార్థపరులైన కొందరు స్నేహితులు ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ‘భగవం తుడా, నా స్నేహితుల నుంచి నన్ను రక్షించు, నా శత్రువుల నుంచి నన్ను నేను రక్షించుకుంటాను.’ అని వేడుకున్నా డట. స్నేహం ఎంతో మధురమే కాదు, పదిలంగానూ చూసుకోవాలి. అప్పుడే ఆ స్నేహం కలకాలం నిలుస్తుంది. నిజమైన స్నేహం ఎలా ఉండాలో లియో టాల్‌స్టాయ్ పిల్లల కథలో చెబుతాడు. ఇద్దరు స్నేహితులు అడవిలోని దారి వెంట వెళుతుంటారు. వారికి ఎలుగుబంటి ఎదురవు తుంది. దాన్ని చూసి వారు భయపడతారు. వారిపైకి అది ఉరికి వస్తుంటుంది. దీంతో ఒకడు పక్కనే ఉన్న చెట్టు ఎక్కుతాడు. రెండోవాడికి చెట్టు ఎక్కడం రాదు. ఏం చేయాలో అర్థంకాదు. వెంటనే ఒక ఉపాయం తట్టి చచ్చినవాడిలా ఊపిరిబిగబట్టి కింద పడి పోతాడు. ఎలుగుబంటి వచ్చి వాడి ముఖం వాసన చూసి, చనిపోయాడనుకొని వెళ్లిపోతుంది. చెట్టెక్కిన వాడు నిదానంగా కిందకు దిగివచ్చి… ఎలుగుబంటి ఏం చెప్పిందిరా అని రెండోవాణ్ని అడుగుతాడు. ‘ఆపదలో ఉన్న స్నేహితుణ్ని వదిలి వెళ్లిపోయినవాడు మంచివాడు కాదని చెప్పిందిరా.’అని సమాధానం ఇస్తాడు. దీన్నిబట్టి స్నేహితుడంటే ఎలాఉండాలనేది అర్థంచేసుకోవచ్చు. ప్రపంచం వ్యాపారమయంగా మారిన ఈ రోజుల్లో కూడా స్వచ్ఛమైన స్నేహానికి ఎందరో ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నారు. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అనుకుంటూ జీవించేవారూ ఉన్నారు. భావాలు కలిసి, అభిరుచులు ఏకమై.. తనువు వేరైనా మనస్సులు ఒక్కటిగా సాగడమే నిజమైన స్నేహం. స్నేహం ఎప్పుడూ.. నీడాతోడై నడుస్తుంది. కష్టాల్లో, నష్టాల్లో, అవమానాల్లోనూ కలిసినడిచే వాడే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహం మనిషికి అన్ని అవయవాలకూ మించిన గొప్ప అవయవం. దాంతో ప్రపంచాన్ని చూడవచ్చు.. అంతా మంచే వినవచ్చు.. సువాసల్ని ఆస్వాదించవచ్చు.. సురుచిని ఆఘ్రాణించవచ్చు.. మదీ, హృదీ చేసే పనులను సైతం మరిపించవచ్చు. చివరకు జీవితాన్నే సంపద్వంతం, సుఖవంతం చేసు కోవచ్చు. కాబట్టి స్నేహమంటే వెన్నెల సోన, వెలుగుల ధార.