Tuesday, April 23, 2024

కోల్పోయిన కుటుంబాన్ని తిరిగి ఇచ్చిన ఆధార్!

- Advertisement -
- Advertisement -

Mentally challenged boy meet his family with Aadhar help

కోల్పోయిన కుటుంబాన్ని ఇచ్చిన ఆధార్!
పదేళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరిన మానసిక వికలాంగ బాలుడు
మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

నాగపూర్: దాదాపు పదేళ్ల క్రితం రైల్వే స్టేషన్‌లో తప్పిపోయిన ఓ బాలుడు ఆధార్ వివరాల కారణంగా తిరిగి తన తల్లిదండ్రులను చేరుకోగలిగాడు. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు 2011లో మతి స్థిమితం లేని ఓ బాలుడిని రైల్వే స్టేషన్‌లో గుర్తించారు. అతని తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది. అప్పటికి ఆ బాలుడు అమ్మా అని పిలవడం తప్ప తన పేరు కూడా చెప్పలేకపోయాడు. దీంతో పోలీసులు ఆ బాలుడ్ని సమర్త్ దామ్లే అనే అతను నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో చేర్చారు. తన పేరు కూడా చెప్పలేని స్థితిలో ఉన్న ఆ బాలుడికి అమన్ అని దామ్లే పేరు పెట్టాడు. 2015లో అనాథాశ్రమాన్ని మూసేయాల్సి వచ్చింది. దీంతో దామ్లే అమన్‌కు తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చాడు. తన కుటుంబంలో ఒకడిగా చూడడమే కాకుండా చదువు కూడా చెప్పించాడు. ఈ ఏడాది అతను పదో తరగతి పూర్తి చేశాడు కూడా.

కాగా దామ్లే ఇటీవల అమన్ పేరిట ఆధార్ కోసం ప్రయత్నించగా అతడి బయోమెట్రిక్ వివరాలను ఆధార్ డేటా బేస్ స్వీకరించలేదు. దీంతో దామ్లే ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆధార్ కేంద్రం నిర్వాహకుడు మరాఠే సాయంతో అమన్‌కు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోగలిగాడు. ఈ క్రమంలో అమన్ అసలు పేరు మహ్మద్ అమీర్ అని మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన వాడని తెలిసింది. అమన్ విషయంలో ఆధార్ కేంద్రం నిర్వాహకుడు మరాఠే కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు. అమన్‌ను అతడి కుటుంబం చెంతకు చేర్చాలనుకున్నాడు. ఇదే విషయాన్ని దామ్లేకు చెప్పగా ఆయన కూడా అంగీకరించాడు. ఈ క్రమంలో మరాఠే తనకు తెలిసిన వాళ్ల ద్వారా అమీర్ తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకున్నాడు. దామ్లే వారిని ఫోన్‌ద్వారా సంప్రదించి అమీర్ తన వద్ద ఉన్నట్లు చెప్పాడు. ఇక ఎప్పటికీ చూడలేమనుకున్న తమ కుమారుడి ఆచూకీ తెలియడంతో అమీర్ తల్లిదండ్రుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. తర్వాత వారు నాగపూర్‌లో ఉన్న దామ్లేను కలిశారు. చట్టప్రకారం లాంఛనాలన్నీ పూర్తి చేసిన దామ్లే అమీర్‌ను అతడి తల్లిదండ్రులకు అప్పగించాడు. అమీర్‌ను వదులుకోవడం బాధ కలిగించినప్పటికీ అతడిని తన అసలు తల్లిదండ్రుల వద్దకు చేర్చడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని దామ్లే ఈ సందర్భంగా మీడియాకు తెలిపాడు.

Mentally challenged boy meet his family with Aadhar help

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News