Home Default రిజిస్ట్రేషన్లకు మూలాధార్

రిజిస్ట్రేషన్లకు మూలాధార్

  •  ఆధార్‌కార్డు ఉంటేనే రిజిస్ట్రేషన్
  • శనివారం నుంచే అమల్లోకి
  • నిలిచిపోయిన చాలా భూ లావాదేవీలు

Aadhar

హైదరాబాద్ సిటీబ్యూరో : ఇక ముందు స్థిరాస్తులు కొనాలన్నా… అమ్మాలన్నా ఆధార్ కార్డు కావాల్సిందే. లేకపోతే ఇక రిజస్ట్రేషన్లు నిలిచిపోయినట్టే. కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలు రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న కొంతమంది సబ్ రిజిస్ట్రార్ల చేతివాటానికి తోడు అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఆధార్ కార్డుకు ముడిపెట్టింది. ఇటీవల నగరంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కొందరు సబ్ రిజిస్ట్రార్లు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడడంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నెల రోజులు పాటు ప్రయోగాత్మకంగా మల్కాజ్‌గిరి, చిక్కడపల్లి, బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ్యాల్లో స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకుగాను రిజిస్ట్రేషన్లకు ఆధార్ కార్డు తప్పనిసరిగా అమలు చేశారు. ఈ ప్రయోగం సత్ఫాలితాలను ఇవ్వడంతో శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్థిర, చరాస్తుల క్రయ విక్రయాలకు సం బంధించి రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగాల న్నా ఆధార్ తప్పనిసరయింది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ల సమయంలో సాక్షి సంతకాలు చేసే వ్యక్తులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఆధార్ కార్డు లేని వ్యక్తులు సాక్షి సంతకాలు చేసినా అవి చెల్లుబాటు కావు. అంతేకాకుండా మార్కెట్ ధర ప్రకారం రూ.10 లక్షలకు మించిన స్థిర, చరాస్తులు రిజిస్ట్రేషన్ కావాలంటే ఆధార్‌తో పాటు పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డు కూడా తప్పనిసరి చేసింది.
భారీగా పడిపోయిన రిజిస్ట్రేషన్లు : స్థిర, చరాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేయాలంటే క్రయ, విక్రయదారులకు ఆధార్ కార్డును ప్రభు త్వం తప్పనిసరి చేయడంతో రిజిస్ట్రేషన్లపై భారీ ప్రభావం చూపింది.
దీంతో శనివారం పలు నగరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ్యాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. రిజిస్ట్రేషన్లకు వచ్చినవారు క్రయ, విక్రయదారుడితో పాటు సాక్షులకు తప్పససరిగా ఆధార్ కార్డు కావాల్సి ఉండడంతో పాటు రూ. 10లక్షలకు మించి విలువ గల ఆస్తుల రిజిస్ట్రేషన్లకు పాన్ కార్డు కూడా కావాల్సి రావడంతో చాలా మంది తిరిగి వెనక్కి వెళ్లారు. దీంతో శనివారం రోజువారి కంటే ప్రభుత్వ ఖజానా భారీగా ఆదాయం తగ్గింది.