Saturday, March 25, 2023

ఆప్ మెడపై ఇసి కత్తి

- Advertisement -

party

*20 మంది ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి సిఫార్సు 

జోడు పదవుల కారణంతో ఇసి చర్య
ఆమోదిస్తే ఢిల్లీలో మరో ఎన్నికల పర్వం
తప్పుడు ఆరోపణలతో అనర్హత సిఫార్సు : ఆప్
మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ
కేజ్రీవాల్ రాజీనామాకు కాంగ్రెస్, బిజెపిల డిమాండ్
ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ బలం 66, బిజెపి 4

న్యూఢిల్లీ : ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని సర్కార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 20 మంది ఆప్ శాసనసభ్యులను అనర్హులుగా ఎన్నికల సంఘం(ఇసి) ప్రకటించింది. రాజ్యాంగానికి విరుద్ధంగా లాభదాయక పదవులు చేపట్టారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ శుక్రవారంనాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫార్సు చేసింది. ఎన్నికల సంఘం ప్రతిపాదనకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే త్వరలో ఢిల్లీలో మరోసారి ఎన్నికల యుద్ధం తప్పేట్టు లేదు. నిబంధనల ప్రకారం చూస్తే కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఏడుగురు మంత్రులుండాలి. కానీ 2015లో 21 మంది ఎంఎల్‌ఎలను కేజ్రీవాల్ పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. మంత్రులకు కల్పించే సౌకర్యాలన్నీ వారికి సమకూర్చారు. పరిపాల నా సౌలభ్యం కోసం 21మందిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించామని పేర్కొంటూ దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించాలని కోరుతూ రాష్ట్రపతికి పంపించారు. ఎంఎల్‌ఎలకు సంబంధించిన అంశం కావటం, లాభదాయకమైన జోడు పదవులు  అనుభవిస్తున్న కారణంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దానిని తిరస్కరించారు. ఈ 21 మందిని అనర్హులుగా ప్రకటించాలా వద్దా తేల్చాలని రాష్ట్రపతి ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ జూన్, 2016లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రశాంత్ పటేల్ అనే న్యాయవాది కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం 21మంది ఎంఎల్‌ఎలకు వివరణ ఇవ్వాలని కోరూతూ గత ఏడాది అక్టోబర్‌లో నోటీసులిచ్చింది. దీనికి వారు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం తాజాగా 20మంది ఎంఎల్‌ఎలపై అనర్హత వేటుకు సిఫార్సు చేసింది. 21మంది ఎంఎల్‌ఎలలో జర్నైల్ సింగ్ పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి పదవికి రాజీనామా చేశారు. ఇక మిగిలిన 20 మంది ఎంఎల్‌ఎలపై వేటు వేస్తూ ఇసి నిర్ణయం తీసుకుంది. 70స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ బలం 66. మిగతా నలుగురు బిజెపి సభ్యులు. 20మందిపై ఆప్ శాసనసభ్యులపై అనర్హత వేటువేసినప్పటికీ ఇప్పటికిప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వానికి వచ్చిన గండమేమీ లేదు.
అనర్హత ఎదుర్కొంటున్నది వీరే…
అనర్హత వేటు ఎదుర్కొంటున్న వారిలో ఆల్కా లాంబా, ఆదర్శ్ శాస్త్రి, సంజీవ్ ఝా, రాజేశ్ గుప్తా, కైలాశ్ గెహ్లాట్, విజేంద్ర గార్గ్, ప్రవీణ్ కుమార్, శరద్ కుమార్, మదన్‌లాల్, శివచరణ్ గోయల్, సరితా సింగ్, నరేశ్ యాదవ్, రాజేశ్ రిషి, అనిల్ కుమార్, సోమ్ దత్, అవతార్ సింగ్, సుఖ్వీర్ సింగ్, మనోజ్ కుమార్, నితిన్ త్యాగి, జర్నైల్ సింగ్ ఉన్నారు. తాజా పరిణామాలపై ఆప్ మండిపడింది. తప్పుడు ఆరోపణలనే ఆధారం చేసుకోని అనర్హత ప్రతిపాదన చేశారని, అన్ని రంగాల్లో విఫలమైన బిజెపి ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు సొంత పార్టీ ఏజెంట్ల ఇదంతా చేయిస్తోందని ఆప్ అధికార ప్రతినిధి నాగేంద్రశర్మ ట్వీట్ చేశారు. ఎంఎల్‌ఎల వాదనలు వినకుండా రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపినట్లు ఎన్నికల కమిషన్ ఎలా లీకులిస్తుందని, ఇసి చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని దుయ్యబట్టారు. మరోవైపు కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బిజెపి డిమాండ్ చేశాయి. 20మంది ఎంఎల్‌ఎపై అనర్హత వేటు వేయాలంటూ ఇసి రాష్ట్రపతికి చేసిన ప్రతిపాదనను ఆ రెండు పార్టీలు సమర్ధించాయి.
మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ
20మంది ఎంఎల్‌ఎలను అనర్హులకు గురిచేయాలంటూ- రాష్ట్రపతికి ఎన్నికల కమిషన్ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్‌ఎలు పలువురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇసి ప్రతిపాదనపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అయితే హైకోర్టు వారి వినతిని తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News