Home కలం శ్రమజీవుల ‘ఆపతి’

శ్రమజీవుల ‘ఆపతి’

Novel-Book

 

పాలమూరులోని మారుమూల గ్రామం అయిన దాసరిపల్లిలో పుట్టిన కురసెట్టి వీరేశం, ’అవనిశ్రీ’ కలం పేరుతో ప్రాచుర్యం పొందారు.ప్రకృతిపై,కుల వృత్తులపై, అసమానతలపై, అవమానాలపై,అణిచివేతలపై, కార్మికుల, కర్షకుల కడగండ్లపై అనేక కవితలు సామాజిక మాధ్యమాల్లో, వివిధ పత్రికల్లో విశేష ఆదరణ పొందాయి. ’మట్టికుదురు’ పేరుతో వచ్చిన మొదటి పుస్తకంలో తెలంగాణ యాసను బతికించుకునే యావతో పాలమూరు మాండలికాలను, పల్లె భాషను దాని గోసను తన కలంతో ప్రజల ముందుంచిన యువకవి. పల్లె జీవనంలో మమేకమైనప్పుడు మాత్రమే కవిత్వానికి జీవం పోయగలమని నమ్మి పల్లె నాడి పట్టుకున్న ప్రజా వాగ్గేయకారుడు.

వృత్తి కులాలు కూలిపోయి, ఉపాధి కోల్పోయి ప్రపంచీకరణ ప్రవాహంలో రోడ్డున పడి దగా పడ్డ దారుణానికి రోదిస్తూ, మన పాలకులు తెచ్చిన దుస్థితిని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ శక్తుల అనుకూల నిర్ణయాలకు శ్రమ జీవుల ’ఆపతి’గా ధిక్కార స్వరమై ఘర్జిస్తాడు. అసమర్థ పాలనలో సబ్బండ జాతులు,ఉత్పత్తి కులాలు ’ఆపతి’లో ఉన్నాయని చెప్పడమే తన ఉద్దేశం. ’మా పల్లె మాదిగలు’ అనే కవితలో ’ఎద్దుకూర తింటే మొద్దులంటీరి/ బర్రె పాలు తాగినోడు బుద్ధిమంతుడెట్లయితడు’ అని సమాజానికి సవాలు విసురుతాడు. ’మేము మాదిగలం/మానవత్వంలో సాటిరాని మహారాజులం’అంటూ కల్లకపటం ఎరుగని మాదిగ జాతి స్వరమైతడు. ’వడ్ల ఆచారి’ కవితలో ’నేను వడ్ల ఆచారిని/ఈ నేల తల్లి పంటలకు/ జీవంబోసే ఆచార్యుడిని’ అంటూ వ్యవసాయానికి ఆయువయిన ఆచారిని ఆదరిస్తడు.

’కొలిమి భగ భగ మండితేనే/మా ఇంటిలో పొయ్యి వెలిగేది’ అంటూ వడ్లోళ్ళ ధీన గాధను, దుఃఖాన్ని దిగమింగుతూనే ’ఇనుమును ఇంద్ర ధనుస్సులా ఓంపితేనే/నల్లరేగడి పచ్చటి పంటల్ని కనేది/ మా అరచేతులు బొబ్బలెక్కి కాయగాస్తేనే/ఈ దేశానికి అన్నంబెట్టి ఆదుకునేది’ అంటూ వాళ్లకు త్యాగాన్ని, ధైర్యాన్ని నురిపోస్తాడు.’సితికిన నా బత్కులో/ఈ దేశ బీదరికాన్ని కలగంటాను’ అంటూ దేశ ఆర్థిక మూలాల సారాన్ని తెలుపుతాడు.

కేవలం వృత్తి కులాలు, పల్లెలే కాకుండా, నగరాల్లో పనిచేసే సపాయి కార్మికుల వెతలను ’పొరకలు పట్టిన చేతులు’ లో ,పగలంతా చెత్తతో నిండిన నగరాన్ని రాత్రంతా కష్టపడి శుభ్రపరిచే వారిని ’పొరకలు పట్టిన ఆ చేతులు/నగరాలకు నగిషులు అద్దె హస్తాలు/పాసి బట్టిన రోడ్లపై/పండువెన్నెల పూయిస్తారు’అంటాడు.’ఎంత కష్టం చేసి కసువుగొట్టినా/కాన్కెలిచ్చే ప్రభుత్వం కనుచూపుకైనా కనబడట్లేదు’ అని పాలకులను ఎత్తిపొడుస్తాడు. సంచార జాతుల జీవితాన్ని’మూడు పొయిరాళ్లు’ కవితలో ’ఆ మట్టి కాళ్లకు దండం/ ఎన్ని ఊర్లకు బాటలేసినయో’ అంటూ ’సంచారం సకల గ్రంథాల సారాంశం/సంచార జీవి/కోటి పుస్తకాల జ్ఞాన సంపన్నుడు’అని కీర్తిస్తాడు. దర్జీల జీవితాలపై ’కడుపులో ఆకలి నకనకలాడినా/మిషిను పై కాలు కదాలడుతుంటుందని’,’బీదవాడేవడైనా సరిపోని బట్టలు తెస్తే/ బీదతనపు మానాన్ని కాపాడిన మనిషైతాడు’ అంటూ వారి మానవత్వాన్ని ఆవిష్కరిస్తాడు.

’చేనేత మగ్గం’ కవితలో ’బట్టలు నేసేటి ఆ మగ్గాలు/మా జీవితపు బండిని నడిపే పగ్గాలు/మా నరాలనే దారాలుగా అల్లుకుని/రంగు రంగుల బట్టలు నేస్తూ/ఏ రంగు లేని జీవితాలను నెమరువేస్తం’అంటూ పద్మశాలీల బతుకును చూపెడుతాడు. అదేవిధంగా ’లోకానికి బట్ట కప్పిన వాడి పయ్యంత బరిబత్తలయ్యింది/పట్టుచీరలు నేసిన చేతులకు/పట్టెడన్నం కరువైంది’ అని ప్రభుత్వాలకు కర్తవ్య బోధ చేస్తాడు. ’ఎరుకలి వాకిలి’ కవితలో ’పంది పిల్లలే తన పరివారము’ అని ’రచ్చ కట్టకు ఊరి బొడ్రాయికి దూరపు సుట్టమే’అంటూ వారికి జరుగుతున్న సామాజిక అణిచివేతను ఎత్తిచూపుతాడు. ’కుమ్మరి చక్రం’ కవితలో ’కుండ నాగరికతకు తొలిపదం’అని చరిత్రను వెలికితీస్తాడు.’రాజుల కాలమైన/ రాకెట్ కాలమైనా/కుండకున్న విలువ కుండదే’ అంటూ కుండ ప్రాముఖ్యతను చెప్తాడు.

’నేను మంగలివాణ్ణి’ కవితలో ’కడుపులో ఆకలి కరాళ నృత్యం చేస్తుంటే/ తలపై కత్తెర భరత నాట్యమాడుతుంటుంది’ అని మంగల్లోళ్ల గోసను వెల్లకక్కుతాడు. ఇలాంటి పద ప్రయోగం చూస్తే రచయితకు పరిస్థితులపై ఉన్న సునిశిత పరిశీలన అర్ధం అవుతుంది. ’పలిగిన అద్దంలో/మా బతుకు మెత్కులను వెత్తుకుంటాం’ అంటూ వారి బాధలను కళ్ళకు కట్టినట్లు పాఠకులకు చూపిస్తాడు.’ఈతాకు నీడ బిడ్డలం’ కవితలో గౌడన్నల ఆవేదనను చెప్తూ ’కల్లు తాగిననాడు జనమంత కలిసుండేది/నేడు బీరుమందుతో కుటుంబ వ్యవస్థలే నాశనమైనవి’అని ప్రభుత్వం మద్యం పాలసీల పేర మూటకట్టిన పాపాలను వెలికితీస్తాడు.’మేము గౌడన్నలం/సర్వాయి పాపన్న వారసులం/కులవృత్తి కరువై కూడు కరువైన కులపోళ్ళం’ వీరిపై ప్రభుత్వాలు చూపేది సవితి తల్లి ప్రేమే అని గుర్తు చేస్తాడు. ’వృత్తి రక్షణ కోసం ఉద్యమాలెన్నో చేస్తున్నం/కల్లుగీసే కత్తిపైన పెత్తనంజేస్తే మాత్రం/గీసి కత్తులతోనే ముందుకు కదుల్తం’ అని పాలకులను హెచ్చరిస్తాడు.

’నా తండా తండ్లాట’లో గిరిజనులు పూటకెల్లక పసి పిల్లల్ని అమ్ముకునే బాధను చెప్తూ ’ఇల్లు నడువనప్పుడు/పురిటి పండగనాడే/కన్నబిడ్డలనమ్ముకుంటరు’అని బాధపడ్తడు. ’ఓట్ల నాడే/ఒక్క పొద్దుజూసే/తండా కంట్లో/మనుగొట్టే రాజకీయ ఉద్దండులే/రాజ్యమేలుతారు’అని ఎన్నికల సమయానికి తండా మొత్తం ఓట్లకు లెక్కకు గట్టి మళ్ళీ తిరిగిచూడని పార్టీలను తూర్పారబడుతాడు. ’నేను గొర్ల కాపరిని’ కవితలో ‘నా చూపులు వనమూలికలకు పునాదులు/సబ్బండ జాతులను సలినుండి కాపాడి/వెచ్చటి ఉన్ని గొంగళ్లనిచ్చిన జాతినది’అంటూ యాదవులే పల్లెల్లో మొదటి వైద్యులు, వారికి తెలియని వైద్యం ఉండదంటాడు.’జీవనోపాధి కరువై/జీవిగంజి కరువైంది నాకు’ అని రియలేస్టేటు మాయలో గొర్రె పిల్లల మేపే జాగలేక బతుకుదెరువు లేక జీవనం ఛిద్రమైందంటాడు. ’ఆపతి/సబ్బండ జాతుల బత్కులకు సోపతి’ అని, కష్టాలు శ్రమజీవుల జీవితంలో బాగమైనవంటాడు.’డప్పు పాట’లో ’భుజమెక్కిన ఈ డప్పు/వీరుల త్యాగాలను/విప్లవ నినాదాలను నెమరేస్తుంటుంది.’ అవును, డప్పు లేని ఏ ఉద్యమాన్ని ఉహించుకోలేం.

’డప్పు/ ఒక వాద్యం కాదు/ఖచ్చితంగా ఒక వేదమే’ అనే వేందంతం చెప్పాడు. ’జోడెద్దుల కన్నీరు’లో ’జోడెద్దులు/సేద్యానికి చెమట పద్యాలు/రైతులకు పెద్ద కొడుకులు’అని, ఎద్దులేని ఎవుసాయాన్ని ఊహించలేమంటాడు.’ఆరుగాలం/పండే పాటలో వాటలేమి అడగలేని/రైతన్న ప్రేమపదాలు’ అంటూ, రైతులను దళారీ వ్యవస్థ చేసే మోసాలు, పాలకులు మద్దతు ధర కల్పించక, సరైన రాయితీలివ్వక ప్రతోడు రైతును మోసం చేసేటోడే, వారి కష్టాన్ని వాటాలుగా పంచుకునేవాళ్లే, కానీ జోడెద్దులు మాత్రమే నిస్వార్థంగా తోడుండేవి, ఇంటి సభ్యులతో సమనవైనవంటాడు. పల్లెల్లో పండ్లు అమ్ముకునే అవ్వ కష్టానికి చలించిన కవి ’సిన్గిన చీర పేదరికపు గుర్తులు/మాసిననెత్తి మాడినకడుపు/ ఆకలిచూపుల అలిసిన దేహం’ అంటూ సాగిన వర్ణన అత్యద్భుతం.’బోయ వాల్మీకులు’ కవితలో ’రామాయణ కావ్యమాలకు కారణజన్ములం/రేపటి పొద్దును కలగనే కవీంద్రులం’అని వారి వారసత్వాన్ని గుర్తుచేస్తాడు.’సాకి రేవు’లో ’మా సేతులు పల్లెను చదివేసిన పుస్తకాలు/సదువుకున్నోడికన్న సాకలోడే మేలని/ పల్లెనే మాకు సదువుపట్టానిచ్చింది’ అంటూ చాకలివారి ప్రతిభను పొగుడుతాడు.

’వడ్డెర ఎతలు’ చెప్తూ ’ఆనకట్టలెన్నో కట్టిన/ఆకలిధీర లేదు మాకు’అని వాపోతాడు.’కడుపు కాలినప్పుడు/ఆకలిపాటెత్తుకుంటార’ని ’వృత్తి కళాకారుల’ గోడును చెప్తాడు.’నదీతీరాలు నాగరికతలకు పుట్టినిల్లు’ అంటూ ’నీటిపాఠం నేర్పినోడు’లో ’జీవనమే కరువై/జలంలోనే సమాధౌతున్నారు’అనే వాక్యాలు మనసున్న గుండెలను మెలిపెడతాయి.మొత్తం ముప్పై కవితలతో కూడిన ఈ పుస్తకం చదువుతుంటే పల్లె సందుల్లో తిరుగుతూ,పచ్చని పంటచేల వెంట పరిగెడుతున్న అనుభూతి కలుగుతుంది. పల్లె ప్రజల జీవితాలను,వెతలను రాసి, వారు ఎంతటి ’ఆపతి’లో ఉన్నారన్నది మన ముందుంచిన ’అవనిశ్రీ’, సమాజంలోని మరెన్నో అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాలకుల దోపిడీ నుండి ప్రజలను అప్రమత్తంగా ఉంచడానికి తన సాహిత్యాన్ని అందించాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలతో.

Aapathy novel book written by Avani sri