Home తాజా వార్తలు బోనాలకు 15కోట్లు…

బోనాలకు 15కోట్లు…

Aashada Bonalu

 

దేవాలయాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు
సమీక్షా సమావేశంలో మంత్రి తలసాని

హైదరాబాద్ : ఆషాడబోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్ముద్, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.

ఇందులో భాగంగా జూలై 4 గోల్కొండ బోనాలు, జూలై 21న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, జూలై 28న పాతబస్తిలో బోనాలు జరగనున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసి ద్వారా సుమారు రూ.22 కోట్లతో వివిధ పనుల కోసం ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ల మరమ్మత్తులు సానిటేషన్ ఏర్పాట్లను దేవాలయాల వద్ద లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం హైదరాబాద్‌లోని మెట్రో వాటర్ వర్క్ మూడు లక్షలపైన తాగు నీటి ప్యాకెట్లను ఏర్పాటు చేస్తుందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్, పోలీసు, వైద్య శాఖ, ఆర్ అండ్ బి తదితర శాఖల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని వివరించారు. దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ సహకారంతో సాంస్కృతిక, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం హోంశాఖ మంత్రి మహమ్మూద్ అలీ మాట్లాడుతూ, వచ్చే నెల నాలుగు నుంచి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయన్నారు.

ఈ ఉత్సవాల నిర్వహణకు అధికారులు అన్ని పనులను ముందుస్తుగానే పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 26 దేవాలయాలకు పట్టు వస్త్రాలను పంపనున్నామన్నారు.ఈ సమావేశంలో మేయర్ బొంతు రాంమోహన్, నగర పోలీసు కమిషనర్ అంజన్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్, నగర పరిధిలోని పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ ఆలయాల కమిటీ చైర్మైన్‌లు, అధికారులు హాజరయ్యారు.

Aashada Bonalu Celebrations