Home Default అభిజిత్, ‘ద్వంద్వ’ పౌరసత్వం!

అభిజిత్, ‘ద్వంద్వ’ పౌరసత్వం!

Editorial Cartoon

 

అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి లభించిన వార్త తర్వాత దేశంలో అనేక చర్చలు మొదలయ్యాయి. అభిజిత్ బెనర్జీకి నోబెల్ బహుమతి ప్రకటించిన తర్వాత కోల్‌కతాలో ఒక రిపోర్టరు ఆయన తల్లి వద్దకు వెళ్ళి అభిజిత్ బెనర్జీ పౌరసత్వం గురించి అడిగాడు. ఆయన 2017లో అమెరికా పౌరసత్వం తీసుకున్నారు కదా అని కూడా అడిగాడు. అభిజిత్ బెనర్జీ తల్లి జవాబిస్తూ, “తాను చాలా ప్రయాణాలు చేస్తుంటాడు” అని మాత్రమే చెప్పింది.ఇప్పుడు మనం కొన్ని వాస్తవాలు కూడా చూద్దాం. భారత పాస్ పోర్టుకు అంతర్జాతీయ ర్యాంకింగ్ చూస్తే చాలా తక్కువ. 2019లో 86వ ర్యాంకులో ఉంది. 2010లో కాస్త మెరుగు, అప్పట్లో 77వ ర్యాంకులో ఉండేది. ఈ ర్యాంకు ప్రాముఖ్యం చాలా ఉంటుంది.

వీసా లేకుండా దేశంలో ప్రవేశించే అనుమతి లేదా ఎయిర్ పోర్టులో దిగగానే వీసా ఇచ్చే అనుమతి లభించాలంటే పాస్ పోర్టు ర్యాంకింగ్ చూస్తారు. మన పాస్ పోర్టు ర్యాంకింగ్ ద్వారా ప్రపంచంలో ఎన్ని దేశాలు మన పాస్ పోర్టు ఉన్నవారికి వీసా ఫ్రీ ప్రవేశం కల్పిస్తున్నాయో, వీసా ఆన్ ఎరైవల్ ఇస్తున్నాయో ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో పేదల సంఖ్య చాలా ఎక్కువ. అందువల్ల ఇక్కడి నుంచి విదేశాలకు అక్రమ ప్రవాసులుగా వెళ్ళేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల మెక్సికో నుంచి 311 మంది భారతీయులను వెనక్కి పంపారు. అంటే అక్రమ ప్రవాసులుగా గుర్తించి పంపేశారు. అభివృద్ధి చెందిన దేశాల ఎయిర్ పోర్టుల్లో భారత పాస్ పోర్టుకు సులభ ప్రవేశం ఇప్పుడప్పుడే లభించేలా కనబడడం లేదు. మనం విశ్వగురు అని చెప్పుకున్నప్పటికీ, ప్రపంచంలో ఇప్పుడు భారతదేశం పెద్ద శక్తిగా మారిందని అనుకున్నా భారత పాస్ పోర్టుకు సంబంధించిన వాస్తవాలివి.

అందువల్లనే ఎక్కువగా ప్రయాణాలు చేసే ప్రతిభావంతులైన వారు, సంపన్నులు, విదేశాల్లో నివసించేవారు విదేశీ పౌరసత్వం తీసుకుంటారు. చా లా మంది భారతీయులు విదేశీ పౌరసత్వం తీసుకోడానికి కార ణం వాళ్ళు భారతదేశం పట్ల వ్యతిరేకత కలిగి ఉండడం కాదు, వారేమీ దేశద్రోహులు కాదు. విదేశీ పాస్ పోర్టు వల్ల కొన్ని సౌలభ్యాలున్నాయి. అమెరికా లేదా బ్రిటన్ దేశాల వీసా కోసం ప్రయత్నించే వారికి ఈ వాస్తవం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2014 2017 మధ్యకాలంలో నాలుగున్నర లక్షల మంది భారతీయులు మరో దేశంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గమనించవలసిన మరో వాస్తవమేమంటే, విదేశాలు పౌరసత్వం కూడా తేలిగ్గా ఇస్తున్నాయి. పెట్టుబడులు పెడితే, డబ్బు వెదజల్లగలిగితే పౌరసత్వం దొరుకుతుంది. ఈ ధోరణి పెరుగుతున్నదే కాని తగ్గడం లేదు. కాబట్టి చాలా మంది భారతీయులు విదేశీ పౌరసత్వం కోరుకోవడం అనేది సౌలభ్యం కోసం మాత్రమే.

వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు అలాంటి భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వకపోవడం చాలా విచిత్రమైన, హాస్యాస్పదమైన విషయం. ప్రపంచంలో 85 దేశాలు ద్వంద్వ పౌరసత్వం ఇస్తున్నాయి. భారతదేశం కూడా ఈ జాబితాలో చేరడమే మంచిది. ఒక భారతీయుడు నోబెల్ బహుమతి గెలుచుకున్నాడు, కాని ఆయన భారత పౌరుడు కాదు లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అప్పుడు తలెత్తకుండా ఉంటాయి. ఇండియాలో ప్రవాస భారతీయులకు “ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా” కార్డు ఇస్తుంది. కాని ఈ ఓవర్సీస్ సిటిజన్లు నిజానికి సిటిజన్లు కాదు, వారిని పౌరులుగా పరిగణించడం సాధ్యం కాదు. ఎందుకంటే భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం అవకాశమే లేదు. ఓవర్సీస్ సిటిజన్ హోదా అనేది పాక్షికమైన పౌరసత్వం వంటిది. ఈ కార్డు ఉంటే భారతదేశంలోకి రావచ్చు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళవచ్చు, ఇక్కడ పని చేయవచ్చు. కాని ఇక్కడ ఓటు వేయడానికి వీలులేదు.

అభిజిత్ బెనర్జీ విషయంలో చాలా మంది చాలా విమర్శలు చేశారు. మరి అక్షయ్ కుమార్ గురించి ఏమంటారు? బాలీవుడ్ హీరోగా అనేక సినిమాలు చేసి ఇక్కడే సంపాదించిన అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వాన్ని తీసుకున్నారు. దానికి కూడా కారణం బహుశా అంతర్జాతీయ ప్రయాణాల్లో సౌలభ్యం ఉం టుంది కాబట్టి మాత్రమే. మరో సందర్భంలో అక్షయ్ కుమార్ తాను గొప్ప జాతీయవాదిగా పరిచయం చేసుకునే ప్రయత్నం చేశారు. యా క్షన్ హీరోగా దేశభక్తి పాత్రలతో ముందుకు వచ్చాడు. ఎందుకంటే, ఇప్పుడు నడిచే సినిమాల సీజను అదే కాబట్టి. అప్పుడు అక్షయ్ కుమార్‌ను కూడా కొందరు ఈ ప్రశ్న వేశారు. ఒకవైపు జాతీయవాదిని అం టూ కెనడా పౌరసత్వం ఎందుకు తీసుకున్నావని నిలదీశారు. ఆయన చాలా చాకచక్యంగా తనకు గౌరవ పౌరసత్వం ఇచ్చారని చెప్పాడు. తర్వాత అది పెద్ద అబద్ధమని తేలిపోయింది.

భారతదేశం అక్షయ్ కుమార్ కు ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండే అవకాశం ఇచ్చి ఉన్నట్లయితే, ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఇచ్చి ఉన్నట్లయితే, కెనడా పాస్ పోర్టుతో పాటు భారత పాస్ పోర్టు కూడా తనతో ఉంచుకునే అవకాశం ఇచ్చిఉన్నట్లయితే ఏంజరిగి ఉండేది? ఏమన్నా భూమి కంపించి పోయేదా? లేక ఆకాశం బద్దలయ్యేదా? ఏలాంటి నష్టమన్నా జరిగేదా? భారత పాస్ పోర్టును వదులుకుని విదేశీ పాస్ పోర్టు స్వీకరించడం అనేది చాలా మందిని భావుకతకు గురిచేసే అంశం. చాలా మంది విదేశీ ప్రయాణాల్లో సౌలభ్యం కోసం, తక్కువ టాక్సులు చెల్లించడానికి లేదా తాము నివసిస్తున్న దేశాల్లో సామాజిక భద్రత సేవలు పొందడానికి విదేశీ పాస్ పోర్టు స్వీకరిస్తున్నారు. ద్వంద్వ పౌరసత్వం ఉంటే వారికి ఈ సేవలు, సదుపాయాలు పొందుతూ భారత పౌరులుగా ఉండే అవకాశం లభిస్తుంది. ఇటీవల నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్ కలిసి హోస్టన్‌లో వేలాది భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు.

అక్కడ పాల్గొన్న అనేక మంది భారతీయుల్లో చాలా మందికి భార త పాస్ పోర్టు ఉంటే, చాలా మందికి అమెరికన్ పాస్ పోర్టు ఉంది. అక్కడ నరేంద్ర మోడీకి కాని, డోనాల్డ్ ట్రంప్‌కిగాని ఇద్దరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే, అక్కడకు వచ్చిన భారతీయులు అందరూ రెండు దేశాల పట్ల సద్భావం, విధేయత కలిగిన వారే. ఇటీవల ఒక సర్వేలో తెలిసిన విషయమేమంటే, అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ద్వంద్వ పౌరసత్వం కోరుతున్నారు. కాని, భారతీయ జనతా పార్టీ విదేశీ సెల్ అధినేత విజయ్ చౌతాయ్ వాలా మాత్రం ద్వంద్వ పౌరసత్వం కుదరదంటే కుదరదని తెగేసి చెప్పేస్తున్నారు. “ద్వంద్వ పౌరసత్వంలో చాలా చిక్కులున్నాయి. కాబట్టి సమీప భవిష్యత్తులో జరిగే అవకాశం లేదు” అని చెప్పేశారు. దీనికి సంబంధించిన సాంకేతిక సమస్యలను అనేక దేశాలు సునాయాసంగా పరిష్కరించుకున్నాయి.

బంగ్లాదేశ్ పౌరులు “ద్వంద్వ పౌరసత్వ ధ్రువీకరణ పత్రం” పొందాలి. ఎవరికి, ఎలాంటి పరిస్థితుల్లో ద్వంద్వ పౌరసత్వం ఇస్తున్నారో తెలుసుకుని తమ నియంత్రణ ఉండేలా చూసుకుంటారు. బ్రెజిల్ కూడా ద్వంద్వ పౌరసత్వం ఇస్తుంది. అయితే బ్రెజిలియన్లు బ్రెజిల్ లోకి రావాలన్నా, వెళ్ళాలన్నా కేవలం బ్రెజిల్ పాస్ పోర్టు మాత్రమే ఉపయోగించవలసి ఉంటుంది. కెనడా ద్వంద్వ పౌరసత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అమెరికా ద్వంద్వ పౌరసత్వం పట్ల ఆసక్తి చూపించదు, కాని అనుమతిస్తుంది. దేశభద్రత విషయమే అభ్యంతరాలకు కారణమైతే, పాకిస్థాన్ కూడా భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. కాని పాకిస్థాన్ కూడా ద్వంద్వ పౌరసత్వం ఇస్తుంది. అయితే కేవలం 16 దేశాలకు మాత్రమే అనుమతిస్తుంది. ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించే దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలూ ఉన్నాయి. వర్ధమాన దేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచీకరణ తర్వాత విదేశీ ప్రయాణాల సౌలభ్యం కోసం ఈ పని చేస్తుంటాయి.

నరేంద్ర మోడీ చాలా సందర్భాల్లో ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాను ఉద్దేశించి రక్తసంబంధం పాస్ పోర్టు రంగు కన్నా బలమైందని చెబుతుంటారు. అది నిజమే. అలాంటప్పుడు వివిధ రంగుల్లో ఉన్న విభిన్న దేశాల పాస్ పోర్టులు కలిగి ఉండే అనుమతి ఎందుకు ఇవ్వరాదు? అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వం కలిగి ఉండి కూడా గొప్ప జాతీయవాది, దేశభక్తుడిగా సినిమా ప్రపంచం ద్వారా మనపై ముద్ర వేసినప్పుడు, అభిజిత్ బెనర్జీ అమెరికా పౌరుడు అయినప్పటికీ భారతీయులకు గర్వకారణమే అవుతారు. కాబట్టి ద్వంద్వ పౌరసత్వం గురించి ఆలోచించే సమయం వచ్చేసింది.

Abhijit Banerjee, Esther Duflo Winning the Nobel Prize