Home తాజా వార్తలు అద్భుత నటి జయసుధ

అద్భుత నటి జయసుధ

Jayasudha

 

ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనీ… వారిలో ఒకరు మోహన్‌బాబు అయితే మరొకరు మురళీమోహన్ అని సహజనటి జయసుధ పేర్కొన్నారు. మనం ‘మహానటి’ అనే మాటను ఒకరికే ఉపయోగిస్తుంటామనీ, కానీ అందరూ మహానటిలేననీ ఆమె అన్నారు. అయితే జయసుధకు ’అభినయ మయూరి’ అనే అవార్డును ఇవ్వనున్నట్లు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయసుధ మాట్లాడుతూ “మురళీమోహన్‌తో హీరోయిన్‌గా ఎక్కువ సినిమాల్లో నటించాను.

వాటిలో ఎన్నో సక్సెస్ అయ్యాయి. ఇక మహానటి అని మనం ఒక్కరినే అనుకుంటాం. అందరూ మహానటిలే. మహానటి అయితే తప్ప ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేం. ఇక జమున నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా. అవార్డులు రాకపోయినా ఫర్వాలేదని అంటుంటాం కానీ… అవార్డులు వస్తే సంతోషంగా అనిపిస్తుంది. అవార్డు అనేది మనం చేసిన పనికి గుర్తింపు. కొన్ని అవార్డులు ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఉదాహరణకు నంది అవార్డులు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టేశాయి. తమిళనాడు ప్రభుత్వం సినీ ప్రముఖులకు కలైమామణి అవార్డు ఇస్తూ వస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సినీ ప్రముఖులకు ఏ పేరుతోనైనా అవార్డులు ఇవ్వాలి.

వాళ్ల్లు మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? మేం చాలా కార్యక్రమాలకు వస్తుంటాం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాం. అలాంటి మమ్మల్ని గుర్తించి అవార్డులిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దానివల్ల నవ తరానికి కూడా అవార్డు విలువ తెలుస్తుంది. ఎవరిచ్చినా, ఇవ్వకపోయినా సుబ్బరామిరెడ్డి ఆయన బర్త్‌డేకి అవార్డులు ఇస్తుంటారు. 20 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఆయన అవార్డులు ఇస్తుండటం చాలా గొప్ప విషయం”అని అన్నారు.

టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ “జయసుధకు ‘అభినయ మయూరి’ అనే అవార్డును ఇవ్వబోతున్నా. ఆమె అద్భుత నటి. మనం గర్వించే నటి. ఆమెది 46 ఏళ్ల కెరీర్. సెప్టెంబర్ 17న విశాఖపట్నంలోని కళావాహిని ఆడిటోరియంలో ఆమెకు అవార్డును ప్రదానం చేస్తాం. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వస్తున్నారు”అని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ నటి జమున, మురళీమోహన్ పాల్గొన్నారు.

Abhinaya Mayuri Award for Jayasudha