Home ఆఫ్ బీట్ వయసుకు సవాలే..!

వయసుకు సవాలే..!

Ability to do any work is not particularly related to age

ఏ పని చేయాలన్నా సంకల్ప బలం ముఖ్యంగానీ వయసుతో సంబంధం లేదని నిరూపించారు ఈ బామ్మలు.  మొక్కవోని ధైర్యం, లక్షంతో 102 ఏళ్ల వయసులోనూ క్రీడాకారిణిగా రాణిస్తోంది మన్‌కౌర్. 96 ఏళ్లలోనూ మూడో తరగతి పాసై తనేంటో నిరూపించుకుంది మరో బామ్మ కార్తాయనీ.

అలుపెరుగని సాహసం!

పెద్ద వయస్సు వచ్చేసరికి ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, కూర్చున్న చోట నుంచి లేవలేకపోవడం వంటి సమస్యలు ఎవరినైనా ఇబ్బందిపెడతాయి. కానీ దీనికి భిన్నంగా ఈ బామ్మ ఇలాంటివేమీ లేకుండా ఈ వయస్సులో కూడా సెంచరీని సునాయసంగా దాటేసింది. 102 ఏండ్ల వయసులో ఎంతో చలాకీగా ఉంటూ క్రీడల్లోనూ రాణిస్తోంది. రాణించడమే కాదు ఏకంగా 102 పతకాలను సాధించి వయసుకు సవాల్ విసురుతోంది. చండీగఢ్‌కు చెందిన 102 సంవత్సరాల మన్‌కౌర్ అద్భుతమైన క్రీడాకారిణి. కొడుకు గురుదేవ్ 93 ఏండ్ల వయసులో తల్లిని అథ్లెటిక్స్‌లోకి తీసుకొచ్చాడు. స్వతహాగా తను క్రీడాకారుడు కావడంతో ముదిమి వయసులో తల్లిని సీనియర్ సిటిజన్ విభాగంలో క్రీడాకారిణిగా పరిచయం చేశాడు.

2011 లో మొదటిసారిగా మన్‌కౌర్ 3.21 మీటర్ల లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్‌ను, 100 మీటర్ల లాంగ్ జంప్‌లో బ్రాంజ్ మెడల్‌ను సాధించింది. తొలిసారిగా 100 మీటర్ల పరుగును ఒక నిమిషం, ఒక సెకను సమయంలోనే పూర్తిచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2017లో న్యూజిలాండ్‌లో జరిగిన జాతీయస్థాయి పరుగు పోటీల్లోనూ బంగారు పతకాన్ని గెలిచింది. 100 మీటర్ల పరుగులో ఆమె ఇంతకు ముందు సాధించిన రికార్డులను సైతం బద్దలుకొట్టి మరిన్ని విజయాలను సాధించింది. క్రీడారంగంలో విజయం సాధించేందుకు ఆమె ఎన్నో కష్టాలకు ఓర్చి శిక్షణ తీసుకుంది.

అలా 102 పతకాలు సాధించింది. సుమారు ప్రపంచ స్థాయిలో మాస్టర్ గేమ్స్‌లో 20కి పైగా పతకాలను కౌర్ సొంతం చేసుకుంది. ఫిట్‌నెస్ కోసం కౌర్ కఠిన నియమాలు పాటించింది. ఉదయం సాయంత్రం మొలకెత్తిన గోధుమలతో రొట్టెలను తయారు చేసుకుని తినేది. పండ్ల రసం, నాలుగు చెంచాల గోధుమ గడ్డితో చేసిన జ్యూస్, గింజలు తీసుకునేది. ఉదయాన్నే లేచి ప్రతి రోజూ రన్నింగ్, జంపింగ్ చేస్తూ ఉండేది. అంతేకాదు రోజు విడిచి రోజు అవుట్ డోర్ గ్రౌండ్‌కు వెళ్లి శిక్షణ పొంది విజయాలను అందుకునేందుకు ఎంతో శ్రమ పడింది. ప్రస్తుతం కౌర్ జపాన్‌లో జరగబోయే 2020 మాస్టర్స్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంతో ప్రాక్టీస్ చేస్తోంది.

చదువుల బామ్మ..!

‘అరే ఫలానా అమ్మాయిని చూడండి. క్లాస్‌లో టాపర్‌గా వచ్చింది.’ ఇది సాధారణంగా వినిపించే మాట. 96 ఏళ్ల వయసులో మూడో తరగతి పరీక్షలో 98 శాతం మార్కులతో పాసయ్యారంటే వినడానికి అసాధారణ విషయంగా ఉంది కదా! అవును నిజం. ఈ సంఘటన కేరళలో జరిగింది. 96 ఏళ్ల కార్త్యాయనీ అమ్మ ‘అక్షర లక్ష్యం సాక్షరతా కార్యక్రమం’ కింద నిర్వహించిన మూడో తరగతి పరీక్షలో 98 శాతం మార్కులతో పాసయ్యారు. కేరళ అక్షరాస్యతా మిషన్ కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పరీక్షలో చదవడం, రాయడం, లెక్కలు చేయగలిగే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఈ పరీక్షలో పాసైన కార్త్యాయని తాను ఇక్కడితో ఆగిపోనని, “నేను నాలుగు, ఐదు.. అలా పది వరకు చదువుతాను. నాకు వందేళ్లు వచ్చేలోపు పదో తరగతి పూర్తి చేస్తాను. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అప్లై చేస్తాను” అని తెలిపింది. కేరళ నుంచి మొత్తం 43 వేల మంది ఈ పరీక్ష రాశారు. పరీక్ష రాసిన వారిలో కార్త్యాయనే అత్యంత వృద్ధురాలు.

ఈ పరీక్ష పాసైన కార్త్యాయనికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నుంచి సర్టిఫికెట్ కూడా లభించిందంట. చిన్నతనంలో పేదరికం, కుటుంబ పరిస్థితుల కారణంగా తాను చదువుకోలేకపోయినట్లు కార్త్యాయని తెలిపారు. ఆమె అళప్పుజ జిల్లాలోని చెప్పాడు గ్రామానికి చెందింది. మూడవ తరగతి పాసైన కార్త్యాయని తర్వాత లక్ష్యం కంప్యూటర్ నేర్చుకోవడమట. “పిల్లలు చదువుకుంటుంటే చూసి నాకూ ఉత్సాహం వచ్చింది. నేను చిన్నప్పుడే చదువుకుని ఉంటే ఇవాళ ప్రభుత్వోద్యోగిని అయి ఉండేదాన్ని అని” ఆమె చెబుతోంది. కార్త్యాయని టీచర్ మాట్లాడుతూ, తను ఎన్నడూ తలగడ కింద పుస్తకాలు పెట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమెను నాలుగో తరగతిలో చేర్చామని వెల్లడించారు. పదో తరగతి పూర్తి చేయాలని కార్త్యాయని చాలా ఉత్సాహంగా ఉందని అంటోంది.

Ability to do any work is not particularly related to age

Telangana Latest News