Home ఎడిటోరియల్ ‘మొండి’ రోగం

‘మొండి’ రోగం

Reserve-bankబ్యాంకుల మొండి బకాయిలపై సుప్రీం కోర్టు స్వయంగా విరుచుకు పడవలసి వచ్చిందంటే ఈ రోగం ఎంతగా ముదిరిపోయిందో చెప్పుకోనక్కరలేదు. రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ ఈ సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేయని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. దీని నుంచి బ్యాంకులను బయటపడేయ డానికి పెద్ద శస్త్ర చికిత్సే అవసరమవుతుందని ఆయన స్పష్టం చేసి ఉన్నారు. బ్యాంకుల మొండి బకాయిలు అపరిమితంగా పెరిగిపోతున్నాయంటే దేశ ఆర్థిక వ్యవస్థ కాటికి కాళ్ళు చాచుకొని ఉందని భావించాలి. సుప్రీం కోర్టు మంగళవారం నాడు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా మొండి బకాయిలపై తీక్షణంగా దృష్టిసారించింది. గడువు దాటినా చెల్లించని 500 కోట్ల రూపాయల పైబడిన రుణ బకాయిదారుల జాబితాను సమర్పించాలని రిజర్వు బ్యాంకును ఆదేశించింది. పబ్లిక్ రంగంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలన్నింటి నుంచి సమాచారం సేకరించి ఇవ్వాలని స్పష్టంగా సూచించింది.
2012 ఆర్థిక సంవత్సరాంతానికి పబ్లిక్ రంగం బ్యాంకుల మొండి బకాయిల కిమ్మత్తు 15,551 కోట్ల రూపాయలు కాగా 2015 మార్చి నాటికి మూడింతలు పెరిగి 52,542 కోట్ల రూపాయలకు చేరుకున్నది. 2004-2012 మధ్య 4 శాతం పెరిగిన ఈ బకాయిలు 2013-2015 మధ్య రెండేళ్లలోనే 60 శాతం విజృంభించడం గమనించవలసిన అంశం.
బ్యాంకుల నుంచి మామూలు జనం తీసుకునే అప్పులు చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసూలైపోతుంటాయి. ఈ వర్గాల అత్యవసరాలకు బ్యాంకులు అప్పులివ్వడమే అరుదు. ఇచ్చినా అవసరానికి మించి హామీలు, ఆస్తుల పత్రాలు తీసుకుంటాయి. రుణగ్రహీతలు కూడా నిజాయితీతో, పరువుకి భయపడి సకాలంలో వాటిని తిరిగి తీర్చివేస్తుంటారు. లేనిపక్షంలో బ్యాంకు మేనేజర్లు వారి పరువు బజారున పడవేస్తుంటారు. అందుచేత మొండి బకాయిలకు పేద, మధ్య తరగతి వర్గాలకు సంబంధం ఉండదు.
దేశ ఆర్థికాభివృద్ధికి, ఎగుమతుల పెంపుకి తోడ్పడతామని, యువతకు ఉద్యోగావకాశాలు అపారంగా కల్పించే పరిశ్రమలు, ప్రాజెక్టులు, వ్యాపారాలు నెలకొల్పుతామనే నెపంతో బ్యాంకుల వద్ద భారీ స్థాయిలో అప్పులు తీసుకునే ధనిక వర్గాలు – వాణిజ్య పారిశ్రామిక వేత్తలనిపించుకునే వారు, అటువంటి కార్యకలాపాలు నడుపుతూ ఉండే పలుకుబడి గల రాజకీయ పెద్దలు వాటిని తిరిగి చెల్లించక వేలు, లక్షల కోట్ల రూపాయల్లో అవి పేరుకు పోతుంటాయి. అప్పు తీసుకున్న తర్వాత వారు ప్రారంభిస్తామని చెప్పే ప్రాజెక్టు గాని, పరిశ్రమ గాని నిలదొక్కుకోడానికి పట్టే సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సరళమైన నిబంధనల పైనే వీరికి బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. అయినా చెప్పిన ప్రాజెక్టునే పెట్టని వారు, నామ మాత్రంగా పెట్టినట్టు చూపించి ఆ డబ్బును ఇతరత్రా మళ్లించుకొనే బడాబాబులు లెక్కలేనంత మంది ఉంటారు. అటువంటి వారు కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్నత అధికార పదవులు వెలిగిస్తూనూ ఉండవచ్చు. బ్యాంకుల వద్ద అప్పుతీసుకున్న సొమ్ముతో సొంత ఆస్తులు, ఆర్భాటాలు పెంచుకుంటున్న వారు లెక్కలేనంత మంది. ఇటువంటి వారి మొండి బకాయిలకు నిరర్ధక ఆస్తులు అని బ్యాంకులు ముద్దు పేరు పెట్టుకున్నాయి. అటువంటి మధురనామాల మాటున ఈ కుళ్ళిపోయిన వ్రణాన్ని ఎంతకాలమో దాచిపెట్ట జాలరని, దీనికి జరగవలసింది ఆపరేషన్ మాత్రమేనని రిజర్వు బ్యాంకు గవర్నర్ అంటున్నారు. అలాంటి చికిత్స చేయగలిగే శక్తి ఆయనకున్నదా ? నిజంగా అందుకాయన చొరవ చూపితే ఆ పదవిలో కొనసాగగలరా? బ్యాంకులు తమ మొండి బకాయిల సమాచారాన్ని ఉద్దేశ పూర్వకంగా దాచి పెడుతున్నాయని కూడా రఘురాం రాజన్ అన్నారు. రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ముంద్రా మరో అడుగు ముందుకు వెళ్ళారు. బ్యాంకుల మొండి బకాయిల సమస్య అవి ప్రైవేటా, ప్రభుత్వ రంగమా – ఎవరి యాజమాన్యంలో ఉన్నాయన్న దానితో నిమిత్తం లేనిదని కేవలం నిర్వహణ లోపం వల్ల మాత్రమే తల ఎత్తుతున్నదని ఆయన కుండ బద్దలు కొట్టారు. అంటే కింది నుంచి పైస్థాయి వరకూ పబ్లిక్ రంగ బ్యాంకుల యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులే ఈ బకాయిలకు బాధ్యులని ఆయన అంతరంగం.
మొండి బకాయిల వల్ల వ్యాపార నష్టాలు అపారంగా పెరిగిపోయి దివాలా అంచుకు చేరిన పబ్లిక్ రంగ బ్యాంకులను కాపాడడానికి ప్రభుత్వం తరచూ తన ఖజానా నుంచి వేలాది కోట్ల రూపాయలను కేటాయిస్తుంది. వచ్చే నాలుగేళ్ళలో ఇందుకు 70 వేల కోట్ల రూపాయలు ప్రత్యేకించవలసి ఉంటుందని ఇప్పటికే అంచనా వేసుకున్నారు. అది ఏ మూలకూ చాలదని నిపుణులు భావిస్తున్నారు. ఇలా బ్యాంకులను ఆదుకోడానికి ప్రభుత్వం విడుదల చేస్తున్న సొమ్ము ఎక్కడి నుంచి వస్తున్నది? సామాన్య ప్రజలు కట్టే పన్నుల ఆదాయం నుంచేనని వేరుగా చెప్పనక్కరలేదు. మామూలు రుణగ్రహీతలకిచ్చే అప్పుల మీద బ్యాంకులు వసూలు చేస్తున్న అధిక వడ్డీ ధనాన్ని కూడా అవి ఈ మొండి బకాయిల వల్ల ఏర్పడుతున్న బొరియలను పూడ్చడానికే ఉపయోగిస్తున్నాయి. అంటే బ్యాంకులు కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నాయి. చిన్న చేపలను పెద్ద చేపలకు ఆహారంగా విసురుతున్నాయి. ఈ అప్పులిచ్చేటప్పుడు వారి నుంచి గట్టి హామీగా తగినంత విలువ గల ఆస్తుల పత్రాలను తీసుకోవడంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఇచ్చిన అప్పును తిరిగి వసూలు చేసుకునే శక్తి కూడా బ్యాంకులకు లోపిస్తున్నది. దీనంతటి వెనుక బ్యాంకు అధికారుల అవినీతి, ఉన్నత అధికార పదవులలోని నేతల పలుకుబడి దండిగా ఉన్నాయన్నది సుస్పష్టం.
అవినీతి పరులను శిక్షించినట్టే ఉద్దేశపూర్వకంగా ఎగగొట్టే మొండి బకాయిదారులు ఎంతటి వారైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ జరిపించి కఠిన జైలు శిక్షలు వేసి అమలయ్యేలా చూసే విధానం రూపొందవలసి ఉన్నది. ఇటువంటి వ్యక్తులకు సమాజంలో గౌరవ స్థానాలు దక్కకుండా చూడవలసి ఉన్నది. మామూలు దొంగతనాలకు, బ్యాంకు దోపిడీలకు పాల్పడే ముఠాలతో సమానంగా వీరిని చూసినప్పుడే ఈ బెదడ మన ఆర్థికరంగానికి కొంతవరకైనా తొలగుతుంది. సుప్రీం కోర్టు అటువంటి మార్గదర్శకాలను రూపొందించగలదని, ప్రభుత్వాలు వాటిని తప్పనిసరిగా పాటించేలా చూడగలదని ఆశిద్దాం.