Home నాగర్ కర్నూల్ వెగటు పుట్టిస్తున్న వ్యక్తి గత దూషణలు

వెగటు పుట్టిస్తున్న వ్యక్తి గత దూషణలు

తానా అంటే తందానా  అంటున్న అనుచర గణం
దూషణలే తప్ప చర్చ ఎక్కడ?

Meeting

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : నాగర్‌కర్నూల్ నియోజక వర్గంలో రాజకీయ నేతల మాటలు కట్టు తప్పుతున్నాయి. సభ్యతా సంస్కారాలు అన్న పదాలను ఉచ్చరిస్తూనే నీచమైన పదజాలంతో ఎదుటి వారిపై దూషణలకు దిగుతున్నారు. పత్రికల్లో రాయలేని భాషతో ఎదుటి వారిని దూషిస్తున్నారు. ‘ ఈనెపుల్లతో నేనిట్లంటే విసన కర్రతో తానిట్టానే’అన్నట్లు ఒకరు ఒకటి అంటే మరొకరు దాన్ని మించి ఎలా తిట్ట గలం ,ఎవరితోతిట్టిస్తే ఎదుటివారికి బాధ ఎక్కువగా కల్గుతుంది అన్న ఆలోచనతో పైశాచికానందం పొందుతున్నారు. నేతల భాష బూతు పురాణం వినడానికి , చదవడానికి తొలుత ఒకింత ఆసక్తి కల్గించినా అదికాస్తా ముదరడంతో ప్రజలకు రోత పుట్టిస్తున్నది. సమస్యలపై చేసే విమర్శలకు ఆదే స్థాయిలో శాస్త్ర బద్దమైన సమాధానాలతో మాట్లాడితే అది సమస్యల పరిష్కార దిశగా ప్రజలకు ఉపయోగ కరంగా ఉండేది. అలా గాక పాత సుద్దులతో ఎదుటి వారిపై పై చేయి సాదించే యత్నంలో ప్రజల్లో ఎవరికి వారే చులకన అవుతున్నారన్న విషయాన్ని గ్రహించడంలేదన్నది పలు వురి భావన.

అర్హతల పంచాయతీ

ఏనేత అయినా ఏదైనా సమస్యలపై మాట్లాడగానే ఇతర నేతల అనుచరులు తానా అంటే తందానా అన్నట్లు ఒంటికాలిపై లేస్తున్నారు. మానేతను విమ ర్శించే స్థాయి మీకెక్కడిది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆప్రశ్నించే వ్యక్తుల స్థాయి ఏంటో మాత్రం అనుచర గణం ఒక్క క్షణమైనా ఆలోచించడంలేదు. పార్టీలు మారటం,ఓటమి గురించి అనుచరగణం మాట్లాడే మాట గురివింద నీతులు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక ఓటమి,ప్రజల తిరస్కరణ అంటారు ఇం దులో ఎవ్వరూ అతీతులుకారని అందరూ పరాజితులే నన్న విషయాన్ని మా త్రం ఒప్పుకోరు. ఎవ్వరికి ఏపదవి శాశ్వతం కాదన్న చరిత్ర పట్ల కనీస పరిజ్ఞా నంలేకుండా పరస్పర దూషణలకుదిగుతున్నారు. పార్టీ మారడంలో నేతలే కాదు వారి అనుచరగణం కూడా ఓ అడుగు ముందున్నామన్న విషయాన్ని మరిచి పోతున్నారు.

సమస్యలేంటి మాటల తీరేంటి

రాజకీయ నేతల మద్య వ్యక్తి గత దూషణల పర్వం ఇక్కడ   కొత్తేమి కాదు. కొత్త రాష్ట్రంలో కొత్త నేతల రంగ ప్రవేశంతో ఆతీరు మారుతుందని నియోజకవ ర్గం ప్రజలు ఆశించారు. ప్చ్.. నాగర్‌కర్నూల్ ప్రజల దురదృష్టం నేతలు మారినా దూషణల పర్వంలో ఎలాంటి మార్పు లేదు. నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ ప్రజా ప్రతినిధి ఒకరు ఇప్పటిదాకా ఉన్న నేతల్ని ప్రజలు పరిగెత్తించి కొడతారంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. ఆతర్వాత కొంత కాలం సాధారణంగా ఉన్నా కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఓ నేత విపక్ష ప్రజా ప్రతినిధిపై వ్యక్తి గతంగా చేసిన విమర్శకు మండి పడిన సదరు విపక్ష నేత పాత వ్యక్తి గత విషయాలను గుర్తు చేస్తూ విరుచుకు పడ్డారు. ఆతర్వాత అడపాదడపా ఈ మాటల యుద్దం కొససాగింది.

సమస్యలకు సమాధానం వ్యక్తి గత దాడులేనా?

పాలమూరు రంగా రెడ్డి ఎత్తి పోతల పథకం డిజైన్ల మార్పులో ముడుపులు ఆరోపణలు, అవినీతి అంటూ కోర్టులో కేసులు,కెఎల్‌ఐ నీటి విడుదల, హక్కున్న ప్రాంతాలను ఎండగట్టి సంబం ధంలేని ప్రాంతాలను నానబెట్టే యత్నంలో నేతల చర్యలపై ప్రతి పక్షాల విమర్శలు, అధికార పక్షం కౌంటర్లతో కొద్ది కాలంగా నేతల మధ్య విమర్శల దాడులు జోరందుకున్నాయి. కొద్ది రోజుల క్రితం నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డ్‌లో కందుల కొనుగోలులో చేతి వాటం ఫిర్యా దులు, పర్సెంటేజీల ఆరోపణలతో పరిస్థితి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలోనే కెసిఆర్ ఆయన కుటుంభం అవినీతికి పాల్పడుతుందంటూ సెంట్రల్ విజిలెన్స్ కమిటితోపాటు రాష్ట్రంలోని విచారణ సంస్థలకు బిజెపి సీనియర్ నేత ఫిర్యాదు చేయడం, నిజాయితీ ఉంటే ఆఫిర్యాదులను సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేయడం, విచారణ జరిపితే తమిళనాడులో శశికళకు పట్టిన గతే కెసిఆర్‌కు కూడా పడుతుందని విమర్శించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఇక తమనేతనే తప్పు పడతావా అంటూ అధికార పక్షం నేతలు రెచ్చిపోయారు. సంస్కారానికి సభ్యతకు తిలోదకాలు ఇచ్చి వ్యక్తి గత దాడులు మరింత ఉదృతం చేశారు. చివరకు చిన్నా పెద్దా అన్న తేడా,గౌరవం లేకుండా కొందరు, ఎదుటి వ్యక్తి కున్న అధికారిక ప్రోటోకాల్‌కు కనీ స విలువ ఇవ్వకుండా ఇంకొకరు ఇలా ఇరువర్గాల అనుచరగణం బూతు పంచాంగం ,పాత ఆరోపణలకు పదును పెడుతుంది.

బహిరంగ చర్చకు ఎందుకు సిద్ధం కారు..

నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డ్‌లో కందుల కొనుగోలులో అవినీతిపై విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకునే బదులు ప్రతి దాడులతో అనుమానాలను మరింత పెం చుతున్నారు. ఇక పాలమూరు రంగా రెడ్డి పథకంలో ప్రారంభంలో డిజైన్ల మార్పుతో కోట్ల వ్యయం పెరుగుతుందని , కెఎల్‌ఐకి ప్రమాదం ఉందని ప్రతిపక్ష నేతల ఆరోపణకు ఒక దశలో జిల్లా మంత్రి విలేఖరుల సమావేశంలో కొంత క్లారిటి ఇచ్చేందుకు ప్రయత్నించారు. అది ప్రజల కు చేరేలా విపక్ష ఆరోపణలను కట్టడి చేశేలా ముమ్మరం చేయడానికి బదులు కార్యకర్తలు వ్యక్తి గత దూషణలు ప్రారంభించారు. కెఎల్‌ఐ నీటి పారుదల విషయంలో అంతే.నేతల దూషణల పర్వంలో ఇరు పక్షాలు అవినీతి ఆరోపణలు చేసుకోవడం వల్ల దొందూ దొందేలే అన్న చులకన భావవన ప్రజల్లో కల్గుతుంది తప్ప సమస్యపైవాస్తవాలు ఏంటన్నది ప్రజల్లోకి వెల్లడంలేదన్నది పలువురి భావన.