Home జోగులాంబ గద్వాల్ లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన సర్వేయర్

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన సర్వేయర్

ACB arrested Surveyor while taking bribe

మన తెలంగాణ/గద్వాల: రూ.20వేలు లంచం తీసుకుంటూ కేటిదొడ్డి మండలం సర్వేయర్ తిక్కన్న ఎసిబికి చిక్కాడు. మహబూబ్‌నగర్ ఎసిబి డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేటిదొడ్డి మండలం ఈర్లబండ గ్రామానికి చెందిన తెలుగు రామన్న అనే రైతు సర్వేనంబర్ 185/2లో 3.14 ఎకరాలు, సర్వేనంబర్ 186/1లో 0.26 ఎకరాలు, సర్వేనంబర్ 186/1లో 3 ఎకరాలు మొత్తం 7 ఎకరాల భూమి కలదు. తెలుగు రామన్న పొలాన్ని పక్క పొలం వారు ఆశ్రయించారని తెలిసి బాధితుడు 2015లో భూ సర్వే కోసం ధరఖాస్తు చేసుకున్నాడు. సర్వే చేయకపోవడంతో 2018, 2020లో మండల సర్వే కొరకు మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి కేటిదొడ్డి మండలం సర్వేయర్ తిక్కన్న సర్వే చేయకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

జనవరి 2021లో మండల సర్వేయర్ తిక్కన్న రైతు పొలం దగ్గరకు వచ్చి సర్వే చేసాడు. కాని హద్దులు ఏర్పాటు చేయలేదు. హద్దులు ఏర్పాటుకు, సర్వే రిపోర్టు కోసం సర్వేయర్ రూ.20,000 డిమాండ్ చేయడంతో మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం రైతు గద్వాల పట్టణంలోని సర్వేయర్ ఇంట్లో రూ.20వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు. కేటిదొడ్డి మండలంలోని సర్వేయర్ ఆఫీస్‌లో సోదాలు నిర్వహించి పూర్తి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి గురువారం ఏసీబీ స్పెషల్ కోర్టు నాంపల్లిలో హాజరుపరుచనున్నట్లు ఎసిబి డీఎస్పీ తెలిపారు. ఈ దాడులో మహబూబ్‌నగర్ ఎసిబి డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్, ఇన్‌స్పెక్టర్ లింగస్వామి, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.