Sunday, July 20, 2025

హడలెత్తించిన ఎసిబి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం లో ఏసిబి అధికారులు వరుస దాడులతో ప్రభుత్వాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తం గా 33 ఆర్టీఓ కార్యాలయాలు, సరిహద్దుల్లోని ఆర్‌టిఏ చెక్‌పోస్టులపై గురువారం ఏక కాలంలో దాడులు చేశారు. గ్రేటర్ పరిధిలోని ఉప్పల్, తిరుమలగిరితో పాటు మరో ఎనిమిది చోట్ల, రాష్ట్రవ్యాప్తంగా కా మారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలో ని ఆర్‌టిఏ కార్యాలయాలతో పాటు మరో 19 ఆర్‌టిఏ ఆఫీసులు, చెక్‌పోస్టులపై మొ త్తంగా 33 కార్యాలయాలు, చెక్‌పోస్టులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడు లు చేసి సుమారుగా రూ.1,81, 030 నగదును స్వాధీనం చేసుకున్నారు. గత సంవత్సరం జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా పలు ఆర్‌టిఏ కార్యాలయాలపై ఏసిబి అధికారులు దాడులు చేసిన విషయం తెలిసింది. ఈ సంవత్సరం మరోసారి ఏసిబి అధికారులు ఆర్‌టిఏ కార్యాలయాలపై దాడులు చేయడం సంచలనంగా మారింది.

గురువారం గ్రేటర్ పరిధిలో జరిగిన దాడులు హైదరాబాద్ ఏసిబి డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డిఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీఓ ఏజెంట్లను ఏసిబి అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయాలపై ఏసిబి అధికారులు మెరుపు దాడులు చేశారు. ఏకంగా కార్యాలయం గేటు మూసివేసి తిరుమలగిరిలో 10 మంది ఏజెంట్‌లను, ఉప్పల్‌లో మరో 10 మంది ఏజెంట్లను ఏసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో ఆర్టీఓ కార్యాలయం పరిధిలో ఉన్న మరికొందరు ఏజెంట్లు అక్కడి నుంచి పరారయ్యారు. డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వాహనదారులు ఏసిబి రెయిడ్స్ నేపథ్యంలో కొన్ని గంటల పాటు కార్యాలయం నుంచి పనికాకుండానే అక్కడి నుంచి నిష్క్రమించడం విశేషం.

ఏజెంట్ల ఆగడాలు శృతిమించడంతో
తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంతో పాటు మరికొన్ని ఆర్‌టిఏ కార్యాలయాల్లో ఏజెంట్ల ఆగడాలు శృతిమించిన నేపథ్యంలో ఏసిబికి ఫిర్యాదులు అందడంతో అధికారులు ఈ సోదాలను నిర్వహించినట్టుగా తెలిసింది. ఏజెంట్ల నుంచి ఏసిబి అధికారులు ఇప్పటికే పలు విషయాలను సేకరించినట్టుగా తెలిసింది. ఏజెంట్ల నుంచి సెల్ ఫోన్లు, ఇతరత్రా సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. సుమారుగా రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఏజెంట్లను ఏసిబి అధికారులు అదుపులోకి వారిని ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఆర్‌టిఏ కార్యాలయాల్లో అక్రమంగా వాహనాల లైసెన్సుల జారీ తదితర విషయాల్లో అధికారులు, రవాణా ఉద్యోగులు కమీషన్లు తీసుకుంటూ అక్రమ దందాలకు పాల్పడుతున్నట్టు ఏసిబి అధికారులు గుర్తించినట్టుగా సమాచారం.

సలాబత్‌పూర్ చెక్‌పోస్టులో రూ.91వేలు స్వాధీనం
మద్నూర్ మండలం సరిహద్దు సలాబత్ పూర్ వద్ద రవాణా శాఖ తనిఖీ కేంద్రంపై అర్ధరాత్రి నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా వసూలు చేసిన రూ. 91,000/- నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. తనిఖీ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులు నిద్రిస్తుంటే.. ప్రైవేట్ వ్యక్తులే చెక్ పోస్ట్ ను వారి చేతిలోకి తీసుకొని లారీల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గమనించామన్నారు. పలువురు ప్రైవేట్ వ్యక్తులు పారిపోగా, ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించామని అన్నారు. తనిఖీలు కొనసాగిస్తామని పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు చెప్పారు. ఏసీబీ అధికారులు వచ్చిన సమాచారం తెలుసుకున్న ప్రైవేట్ వ్యక్తులు దూరప్రాంతాలకు పరుగులు తీశారు. పదేళ్ల క్రితం ఇదే తనకి కేంద్రంపై దాడులు నిర్వహించారు. పదేళ్ల తర్వాత మళ్లీ దాడులు నిర్వహించడంతో అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు భయాందోళనకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News