Home తాజా వార్తలు శంకరా… ఇన్ని ఆస్తులా!

శంకరా… ఇన్ని ఆస్తులా!

ACB Raids on Shabad Inspector Sankarayya

 

షాబాద్ సిఐ శంకరయ్య స్థిర, చర ఆస్తుల విలువ రూ.10కోట్లు
ఎసిబి సోదాల్లో వెలుగు చూసిన భారీ అక్రమ సంపాదన

మనతెలంగాణ/హైదరాబాద్ : లంచం కేసులో పట్టుడిన షాబాద్ సిఐ శంకరయ్య స్వగ్రామం నల్గొండ జిల్లా ముల్కపట్నం, ఎల్‌బి నగర్‌లోని ఇళ్లల్లో శుక్రవారం నాడు ఎసిబి సోదాలలో రూ.10 కోట్ల స్థిరచరాస్తులు బయటపడ్డాయి. ఎసిబి బృందాలు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐ నివాసంలో చేపట్టిన సోదాలలో కళ్లు చెదిరే ఆస్తులు వెలుగుచూశాయి. సిఐ శంకరయ్య అక్రమాస్తులు మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ. 10 కోట్ల మేరకు ఉంటాయని ఎసిబి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా ఓ భూ కేసు వివాదంలో లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య, ఏఎస్‌ఐ రాజేందర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే.

ఈక్రమంలో గురువారం నాటి నుంచి శంకరయ్య ఇంటిలో ఎసిబి సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటిలో భారీగా నగదు, నగలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఎసిబి డిఎస్‌పి సూర్యనారాయణ తెలిపిన వివరాలే మేరకు షాబాద్ మండల పరిధిలోని చిన్న సోలిపేట్‌కు చెందిన వెంకన్నగారి విజయ్‌మోహన్‌రెడ్డి అలియాస్ (జయరాంరెడ్డి), ఇదే గ్రామానికి చెందిన భారతమ్మ మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం కొనసాగుతోంది.ఈ విషయంలో విజయ్‌మోహన్‌రెడ్డిపై పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ వివాదంలో తనకు సాయం చేస్తామని సూచించిన.. షాబాద్ సిఐ శంకరయ్య, ఎఎస్‌ఐ రాజేందర్ తమకు డబ్బు ఇవ్వాలని విజయ్‌మోహన్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఈక్రమంలో పథకం ప్రకారం విజయ్‌మోహన్‌రెడ్డి ఎఎస్‌ఐ రాజేందర్‌తో కలిసి సిఐకి లంచం ఇచ్చేందుకు వెళ్లాడు.

బయట ఏఎస్‌ఐకి డబ్బు ఇవ్వాల్సిందిగా సూచించడంతో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే విజయ్‌మోహన్‌రెడ్డి నగదు అందించాడు. వెంటనే ఎసిబి అధికారులు దాడిచేసి డబ్బు స్వాధీనం చేసుకుని సీఐ, ఎఎస్‌ఐని అదుపులోకి తీసుకుని ఎసిబి కోర్టులో హాజరుపర్చగా వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కాగా సిఐ శంకరయ్య ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నడన్న ఆరోపణల మేరకు ఆయన స్వగ్రామం, నగరంలోని ఎల్‌బి నగర్‌లోని నివాసంలో ఏకకాలంలో ఎసిబి సోదాలు నిర్వహించడంతో భారీ ఎత్తున స్థిరచరాస్థులు వెలుగులోకి వచ్చాయి. దీంతో సిఐ శంకరయ్యపై రెండు కేసులు నమోదు చేశారు. లంచం కేసుతో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేశారు.

CI, ASI nabbed by ACB for taking bribe from farmer