Home జాతీయ వార్తలు ప్రమాదవశాత్తే శ్రీదేవి మృతి

ప్రమాదవశాత్తే శ్రీదేవి మృతి

Sree-devi

దుబాయ్ అధికారుల నిర్ధారణ
ఆ తర్వాతే బోనీ కపూర్ కుటుంబానికి భౌతికకాయం అప్పగింత

దుబాయ్ : నటి శ్రీదేవి మృతిపై క్షణక్షణంగాగంటల పాటు సాగిన ఉత్కంఠ ముగిసింది. శ్రీదేవి హోటల్ గదిలో బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిందని నిర్థారణ అయినట్లు దుబాయ్ ప్రాసిక్యూషన్ వారు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదికలోని అన్ని అంశాలను క్షుణ్ణం గా పరిశీలించిన తరువాత శ్రీదేవిది ప్రమాదవశాత్తూ జరిగిన మృతిగా నిర్థారించుకుంటున్నట్లు మంగళవారం మధ్యాహ్నం దుబాయ్‌లో అత్యున్నత విచారణా వ్యవస్థ అయిన ప్రాసిక్యూషన్ వర్గాలు ప్రకటించాయి. వెనువెంటనే వివిధ కోణాల్లో సాగిన దర్యాప్తు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు, మృతి కేసులో విచారణ ముగిసినందున, కేసును మూసివేస్తున్నట్లు దుబాయ్ పోలీసులు సాయం త్రం వెల్లడించారు. దీనితో అన్ని క్లియరెన్స్ పత్రాలు భారతీయ ఎంబసీ వర్గాలకు అందడంతో శ్రీదేవి భౌతిక కా యం స్వదేశానికి చేరుకోవడానికి వీలేర్పడింది. దీనికి ముందు వైద్య ప్రక్రియలో భాగంగా మృతదేహం ఎంబామింగ్ ప్రక్రియకు తరలించారు. శ్రీదేవి పార్థివ దేహం స్వాధీనం చేసుకునేందుకు శ్రీదేవి మేనల్లుడు సౌరభ్ మల్హోత్రా ఆసుపత్రికి చేరుకున్నారు. శనివారం రాత్రి దుబాయ్‌లోని జుమైనా ఎమిరేట్స్ హోటల్‌లో నటి శ్రీదేవి మృతి చెందారు. తొలుత గుండెపోటుతో మృతి చెందినట్లుగా వార్తలు వెలువడ్డాయి.

అయితే తరువాత ఆమె బాత్‌టబ్‌లో స్పృహలేని స్థితిలో పడి చనిపోయినట్లుగా తెలియడంతో ఫోరెన్సిక్ నివేదికపై అత్యున్నత ప్రాసిక్యూషన్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దుబాయ్‌లోని జుమైరాహ్ ఎమిరేట్స్ హోటల్ గదిలో శ్రీదేవి మృతి చెందారు. ఈ దశలో అన్ని స్థాయిలలో సంబంధితులను విచారించిన తరువాత ప్రాసిక్యూషన్ వారు ఫోరెన్సిక్ నివేదికలోని అంశాలు సరిగ్గానే ఉన్నాయని నిర్థారించారు. దీనితో కేసును క్లోజ్ చేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకూ శ్రీదేవి భర్త ఇతరులపై విచారణ సాగుతుందని, శ్రీదేవి భౌతికకాయం తరలింపు ఆలస్యం అవుతుందనే వార్తలకు తెరపడుతూ బోనీ కపూర్, కుటుంబసభ్యులు రిలయన్స్ వారి ప్రత్యేక విమానంలో శ్రీదేవి భౌతిక కాయంతో పాటు ముంబైకి చేరుకునేందుకు వీలేర్పడింది. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారని దుబాయ్ మీడియా ఆఫీసు ఒక ప్రకటన వెలువరించింది. పూర్తి స్థాయి దర్యాప్తు ముగిసిన నేపథ్యంలో మృతదేహం అప్పగింతకు ఉన్నత స్థాయిలో నిర్ణయం జరిగిందని వెల్లడించారు. ఆసుపత్రిలో కాకుండా వేరే చోట జరిగే మరణాలపై సాధారణంగా పాటించే అన్ని నిబంధనల మేరకు దర్యాప్తు జరిగింది. సెలబ్రిటీ కావడంతో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా క్షుణ్ణంగా విచారణ జరిగిందని అధికారవర్గాలు తెలిపాయి. శ్రీదేవి భౌతిక కాయాన్ని ఇండియాకు తీసుకువెళ్లేందుకు, తండ్రి కి సహకరించేందుకు నటుడు అర్జున్ కపూర్ ముంబై నుంచి దుబాయ్‌కు చేరుకున్నారు.

ముంబైలో అభిమానుల నిరీక్షణ
శ్రీదేవి భౌతిక కాయం ముంబైకి చేరుకుంటుందనే వార్తల నేపథ్యంలో వేలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు ముంబైలో ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం పవన్‌హాన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. శ్రీదేవి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి, కుషి కపూర్‌లో నటుడు అనిల్ కపూర్ నివాసంలో ఉన్నారు. తల్లిని అంతిమంగా చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ముంబైలో అనిల్‌కపూర్ నివాసం వద్ద బందోబస్తు ముమ్మరం చేశారు.