Home జాతీయ వార్తలు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్‌పై వివాదం

యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్‌పై వివాదం

Manmohan Singhన్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ బారు తన మాజీ బాస్‌పై రచించిన పుస్తకం ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఆధారంగా అదే పేరుతో రూపొందిన చిత్రం రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలియచేస్తూ వాస్తవాలు వకీకరించారని ఆరోపించింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో తలెత్తిన అంతర్గత రాజకీయాలకు మన్మోహన్ సింగ్ బాధితులయ్యారన్నట్లు ఈ చిత్రం ట్రైలర్‌లో చిత్రీకరించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం తెలపింది. చిత్రం విడుదలకు ముందు తమకు ఈ చిత్రాన్ని చూపించాలని, లేని పక్షంలో దేశంలో ఈ చిత్రం ఎక్కడా ప్రదర్శించడానికి తాము అనుమతించబోమని మహారాష్ట్ర యువజన కాంగ్రెస్ గురువారం చిత్ర నిర్మాతలను హెచ్చరించింది.

ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుగానే మా పార్టీ కార్యవర్గ సభ్యులకు చూపిచకపోయినా, మేము సిఫార్సుచేసిన సన్నివేశాలను తగిన విధంగా మార్చకపోయినా మీరు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను వక్రీకరించదలచినట్లు అర్థం చేసుకోవలసి వస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం ఎలాగే మాకు వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అని మహారాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యజీత్ తంబే పాటిల్ చిత్ర నిర్మాతలైన సునీల్ భోరా, ధవల్ గడాలకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పాత్రలో నటిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలోని పాత్రలన్నీ నిజమైన పేర్లతోనే ఉంటాయని, రాజకీయ బయోపిక్‌లలో ఈ చిత్రం పెను మార్పులు తీసుకువస్తుందని అన్నారు. తమ చిత్రం ఏ ఒక్క రాజకీయ పార్టీనో సమర్థించడానికో విమర్శించడానికో ఉద్దేశించినది కాదని, ఎవరికి నచ్చిన భాష్యాలు వారు చెప్పుకోవచ్చునని ఖేర్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున లేదా గణతంత్ర దినోత్సవం రోజున దేశభక్తిని ప్రబోధించే చిత్రాలు విడుదల చేస్తుంటారని, ఇది రాజకీయ చిత్రమని, దీన్ని తాము వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలోనే విడుదల చేయదలచామని ఆయన అన్నారు.

విజయ్ గుత్తే దర్శకత్వం వహించిన ఈ రాజకీయ చిత్రంలో సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా, సోనియా గాంధీ పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్, రాహుల్ గాంధీగా అర్జున్ మాథుర్, ప్రియాంక గాంధీగా ఆహనా కుమ్రా నటిస్తున్నారు.

Accidental Prime Minister sparks controversy