Home కెరీర్ భావంలోనే భాగ్యం

భావంలోనే భాగ్యం

self-confodence

జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే భయం బెరుకు లేకుండా ఇతరులతో మాట్లాడాలి. మన గురించి మన అవసరం గురించి ఇతరులకు స్పష్టంగా తెలియాలంటే మనం చెప్పేది ఎదుటివారికి స్పష్టంగా అర్ధం కావాలి. నంగినంగిగానో, నసిగినట్టుగానో, గొణిగినట్టుగానో కాక చక్కగా విపులంగా, విశదంగా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడాలి. మాటలో మంచి ఫ్లో ఉండాలి. అప్పుడే వినేవారిని మన మాట ఆకట్టుకుంటుంది.

ఈ పోటీ ప్రపంచంలో ఎందరో విద్యార్థులు తమ మనోభావాలను ప్రకటించడంలో తడబడి వెనకబడిపోవడాన్ని చూస్తున్నాం. విషయజ్ఞానం ఉన్న వారు, లేనివారు ఆత్మవిశ్వాసం లేక ఇలా వెనకబడిపోతున్నారు. ముందు తమమీద తమకు విశ్వాసం ఉండాలి. చెప్పే విషయం పట్ల స్పష్టత ఉండాలి. ఎట్టిపరిస్థితిలోనూ ఉద్వేగానికి లోను కాకూడదు. ఏం మాట్లాడితే ఏం కొంపమునుగుతుందో అన్న భయం మొదలైతే మనం స్వేచ్ఛగా మాట్లాడలేం. అందుకు ఆత్మన్యూనత కూడా ఒక కారణం. బాగా మాట్లాడడమేం బ్రహ్మవిద్యకాదు. ప్రయత్నిస్తే అందరూ బాగా మాట్లాడగలుగుతారు.

మౌఖికపరీక్షలలో (Oral Examinations), గ్రూప్ డిస్కషన్స్‌లో (Group discussions), జనరల్ డిస్కషన్స్ (General discussions) ఉద్యోగ ఇంటర్వ్యూస్ లో(Job Interviews), పెద్దలతో మాట్లాడే సందర్భాలలో (discussions with Adults) చురుకుగా, చొరవగా, విషయం ఉన్న వారిలాగా మాట్లాడాలి. భావ వ్యక్తీకరణలో(Communication) లో

ప్రధానంగా రెండు ప్రక్రియలుంటాయి.
1. మాటల ద్వారా వ్యక్తపరిచేది(Verbal Communication)
2. హావభావాలు (Non Verbal Communications).
మాట్లాడటం యెంత ముఖ్యమో మనసులో భావం క్లీన్‌గా, క్లియర్‌గా వ్యక్తం కావడం కూడా అంతే ముఖ్యం. ఏదో ఒకటి మాట్లాడేయడం కాదు. అర్థవంతంగా మాట్లాడడం ముఖ్యం. మాటకు తగ్గ బాడీలాంగ్వేజ్ అంటే హావ, భావ, విన్యాసాలు కూడా ఉండాలి. కళ్ళలో కాంతి, జీవం ఉట్టిపడేవిధంగా ఉండాలి. తలదించుకునో, తలవంచుకునో, పక్కచూపులు, నేలచూపులు చూస్తూనో మాట్లాడకూడదు. అది ఎవ్వరినీ ఆకర్షించదు. నిజాయితీ, నిలువెత్తు మనోబలం కనిపించేలా స్ఫుటమైన చూపుతో మాట్లాడగలగాలి. చూపులో ఆ కాన్ఫిడెన్స్ అనేది కనిపించాలి. ఆత్మవిశ్వాసం గల వాడి స్వరం కంగుమంటూ ఉంటుంది. కనుక మనోబలం, ఆత్మస్థయిర్యం వ్యక్తమయ్యేలా వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి. అరిచినట్టుగానో, కరిచినట్టుగానో కాక మాటతీరు సౌమ్యంగా, ఆహ్లాదకరంగా, మనోహరంగా ఉండాలి. మౌఖిక పరీక్షలలో విజ్ఞానానికితోడు, వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే చూపు, గుండెదిటవును పట్టిచూపే మాటతీరు చాలా అవసరం. ఎక్కువ మార్కులు వీటికే పడతాయి. ఈ మూడింటిని సాధన
చేశారా విజయం మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. ఇవన్నీ సాధనతో సమకూరేవే! కాన్ఫిడెన్స్‌గా మాట్లాడే విషయంలో అనుమానాలుంటే అద్దం ముందర నించోని మాట్లాడుతూ అవుట్‌పుట్ ఎలా ఉందో గమనించుకోండి. కొన్ని రోజులు పాటుపడితే జీవితకాలం సుఖపడవచ్చు.

అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే మనల్ని మానసికంగా వేధించేది ఆవేశం..ఆవేదన. అనుకున్న గమ్యాన్ని చేరాలంటే విద్యార్థి దశ నుంచే కృషి ప్రారంభించాలి. పబ్లిక్‌లో మాట్లాడడానికి గొంతుపెగలనివాళ్ళు సెల్ ఫోన్స్, వెబ్ సైట్స్‌లో విహారాలు, ఫేస్‌బుక్‌లలో అవధులు లేని మాటలు, చాటింగ్స్, కామెంట్స్ చేయడంలో ముందుంటున్నారు. అందివచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో తప్పు లేదు కానీ.. మన జీవిత లక్ష్యాన్ని దెబ్బ తీసే విధంగా వుండకూడదు.
జాబ్‌మాంగర్స్, జాబ్ సీకర్స్ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఉద్యోగం ఎంత అవసరమో ఉద్యోగం ఇచ్చేవారికి నిపుణులు అంతే ముఖ్యం. ఉద్యోగస్తుల మీద ఖర్చు పెట్టె ప్రతి రూపాయి అవుట్‌పుట్‌లో కనిపించాలని వారు కోరుకుంటారు.
1. మనం ఏ రంగానికి చెందిన వారమైనా చదివిన చదువులో లోతైన పరిజ్ఞానం పెంచుకోవాలి. అప్పుడు పరీక్ష రాసినా, ఇంటర్వూలో నిలబడినా ధైర్యంగా సమాధానం చెప్పవచ్చు.
2. చదువులతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం వార్తా పత్రికలు చదవటానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.
3. మన సబ్జెక్ట్‌కు సంబంధించిన పుస్తకాలను, అనుబంధ పుస్తకాలను చదవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా ప్రయోజనం పొందడానికి వీలవుతుంది. 4. మిత్రులతో వివిధ అంశాలపై చర్చిస్తూ ఉండాలి. అందువల్ల తప్పొప్పులు సరి చేసుకోడానికి వీలవుతుంది.
5. ఆత్మన్యూనతా భావాలు (InferiortyComplex)మనకు మనంగా పెంచుకునేవే! దీనిని స్పీచ్‌తెరపిస్ట్ సహాయంతో లేదా అనుభవజ్ఞులైన పెద్దల సలహాలతో పోగొట్టుకోవచ్చు.విద్యార్ధి దశ నుంచే మంచి భావనాపటిమ, భావవ్యక్తీకరణ కలిగేలా తల్లిదండ్రులు అజమాయిషీ చేయాలి. ఈ కోణంలో బలమైన పునాదులు పడితే విజయం మీదే! విజేతలు మీరే!