Home జాతీయ వార్తలు మాట మీద నిలబడి నడుస్తున్నం…

మాట మీద నిలబడి నడుస్తున్నం…

 Modi Government

 

మోడీ సర్కారు 50 రోజుల ప్రోగ్రెస్ రిపోర్టు

న్యూఢిల్లీ : తమ 50 రోజుల పాలన తీరుపై మోడీ ప్రభుత్వం సోమవారం ప్రగతి నివేదిక (ప్రొగ్రెస్ రిపోర్టు)ను సమర్పించింది. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి 50 రోజులు పూర్తి అయ్యాయి. తమ ప్రభుత్వం ప్రజల ఇచ్చిన తీర్పును మన్నిస్తూ మాట మీద నిలబడి నడుస్తోందని ఈ నివేదికలో స్పష్టం చేశారు. ప్రగతి వేగవంతం, సంస్కరణల ప్రక్రియనే చేపడుతామనే వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని తెలిపారు. గత అధికార కాలంతో పోలిస్తే ఈ విషయంలో బాధ్యత తమ ప్రభుత్వంపై మరింతి పెరిగిందని ముందుమాటగా పేర్కొన్నారు.

కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ నివేదికను జాతిముందుకు తీసుకువచ్చారు. మోడీ ప్రభుత్వ ప్రగతిపై ఇది విశ్లేషణ అని, ప్రభుత్వం సాధించిన విజయాలను ఇందులో ప్రజల ముందుంచుతున్నామని వెల్లడించారు. రెండో దశ పాలనాకాలంలో తొలి 50 రోజులు ఫలప్రదం అయ్యాయని తెలిపారు. మూడు ఎస్‌లు స్పీడ్ స్కిల్ స్కేల్‌లు అంటే వేగం, నైపుణ్యం, స్థాయి అనే త్రికోణం ఇన్ని రోజులలో ప్రతిఫలించిందని వివరించారు. ప్రత్యేకించి మాట మీద నిలబడుతున్నామన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమంపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించాం. రైతులు, వ్యాపారులు, చిన్న తరహా వ్యాపారులు, మధ్యతరగతి వర్గాలు, నిరుద్యోగ యువతపై ప్రత్యేకంగా కార్యక్రమాలను కేంద్రీకృతం చేసినట్లు తెలిపారు.

గత హయాంతో పోలిస్తే సంక్షేమం, సంస్కరణల ప్రక్రియ వేగవంతం అవుతోందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నట్లు ప్రొగ్రెస్ రిపోర్టులో చెప్పారు.303 లోక్‌సభ స్థానాలలో గెలుపుతో ప్రధాని మోడీ ప్రభుత్వం మే నెల 30వ తేదీన రెండోసారి అధికారంలోకి వచ్చింది. 1971 తరువాత ఇంతటి ఆధిక్యత గల ప్రభుత్వం రావడం ఇదే తొలిసారి. 5 ట్రిలియన్ డాలర్ల జాతి సంపదతో కూడిన ఆర్థిక వ్యవస్థ కేవలం కల కాదని, దీని సాకారానికి రోడ్‌మ్యాప్ నిర్శేశించుకున్నట్లు జవదేకర్ విలేకరులకు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నాటికి అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తయినందున ప్రజలకు తమ పనితీరును తెలియచేసుకోవడం తమ బాధ్యత అని జవదేకర్ చెప్పారు.

వచ్చే ఐదేళ్లలో సరికొత్తగా పెట్టుబడుల అవకాశాలు అనుబంధంగా ఉద్యోగ ఉపాధి విస్తరణకు వీలేర్పడుతుందని వివరించారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ హామీతో రెండో సారి అధికార స్వీకరణ దశలో ప్రజలకు మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని జవదేకర్ గుర్తు చేశారు. ఈ దఫా అధికారపు తొలి 50 రోజులలో అన్ని వర్గాల అభ్యున్నతిపై దృష్టి సారించినట్లు వివరించారు. రాబోయే కాలంలో విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని జవదేకర్ తెలిపారు. ప్రభుత్వ దృక్పథంపై కార్యాచరణ ఏ విధంగా ఉందనేది ప్రజలకు ఈ 50 రోజులలో విదితం అయిందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో సత్సంబంధాలు, ఇరుగుపొరుగు దేశాలతో మిత్రత్వానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

పెట్టుబడుల సాధన, వనరుల అభివృద్ధి , అవినీతిపై పోరాటం, సామాజిక న్యాయం వంటివి తమ ప్రభుత్వ ప్రాధాన్యతాక్రమాలు అని మంత్రి వివరించారు. ఆర్థిక నేరస్థులను తిరిగి దేశానికి రప్పించి , చట్టపరమైన చర్యలకు తగు ప్రయత్నాలు, కార్పొరేట్ పన్నుల రాయితీలు వంటి పలు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. పోస్కో చట్టాన్ని తగు విధంగా సవరించడం ద్వారా బాలలపై లైంగిక నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి ఈ నివేదికలోని అంశాల ద్వారా విశ్లేషించారు. దేశంలో వైద్యవిద్యారంగంలో కీలక మార్పులకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.

జవదేకర్ తెలిపిన కీలక ప్రగతి అంశాలు
రైతులందరికీ రూ 6000 కోట్ల మేర ఆర్థిక సాయం
కనీస మద్దతు ధరలు మూడింట రెండొంతులు పెంపు
కార్మిక చట్టాలలో మార్పులతో అసంఘటిత రంగంలోని 40 కోట్ల మంది కార్మికులకు వేతన, కార్మిక భద్రత చట్టం ద్వారా మేలు
ప్రభుత్వరంగ బ్యాంకుల బలోపేతానికి, రీ క్యాపిటలైజేషన్‌కు రూ. 70,000 కోట్ల సాయం
స్టార్టప్‌ల కోసం ప్రత్యేక టీవీ ఛానల్ ఏర్పాటుకు రంగం సిద్ధం
జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదుల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలతో సత్ఫలితాలు
వ్యాపారులకు పెన్షన్లు, మధ్యతరగతి వారికి పన్నుల మినహాయింపులు, గృహ రుణాలపై వడ్డీ తగ్గింపు, జిఎస్‌టిలో రాయితీలు.

Achievements of the Modi Government