మన తెలంగాణ / సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసిపి జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము డిమాండ్ చేశారు. గురువారం సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిరిసిల్లలో స్థానిక అవసరాల కోసం ఇసుకను వే బిల్లుల ద్వారా తరలించాలని ఆదేశాలు ఉండగా అధికార పార్టీ నాయకుల ఇసుక స్మగ్లర్లుగా అవతారం ఎత్తి ఫోర్జరీ సంతకాలతో నకిలీ వే బిల్లులు, సంతకాలే లేని వే బిల్లులు ప్రదర్శిస్తూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇసుక అక్రమ రవాణా దారులు, ట్రాక్టర్లతో సహ నకిలీ వేబిల్లులతో రెడ్‌హ్యండేడ్‌గా దొరికినా అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడం, ప్రజలు బాహటంగా అక్రమ ఇసుక రవాణాదారులైన అధికార పార్టీ నేతల పేర్లు లిఖిత పూర్వకంగా ప్రకటించినా తమశాఖ పరిధి కాదనే నెపంతో చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇసుక అక్రమరవాణాను అడ్డుకోవాలని అధికారులను కోరారు. సిరిసిల్ల పట్టణంలో ప్రధాన రోడ్లను ఆనుకుని సెట్‌బ్యాక్ లేకుండా ఇండ్లు నిర్మిస్తున్నా మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికారులు బాధ్యతతో చర్యలు తీసుకోకపోతే తాము కలిసివచ్చేవారితో కలిసి ఆందోళనలు చేయడంతో పాటు న్యాయస్థానం మెట్లు ఎక్కి ప్రజల పక్షాన న్యాయపోరాటం సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండి ఆంజనేయులు, ఎంఆర్‌పిఎస్ జిల్లా కన్వీనర్ కానాపురం లక్ష్మణ్, బొల్లారం చంద్రమౌళి, బూత్కూరి అంజి, ఎస్‌సిఎస్‌టి సబ్‌ప్లాన్ జిల్లా కన్వీనర్ కంసాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -