Home ఎడిటోరియల్ ఒక దార్శనికుని స్వప్నం

ఒక దార్శనికుని స్వప్నం

Comprehensive Progress in States

 

దేశానికి కొత్త దిశ కావాలి. సరికొత్త ఆర్ధిక విధానం రావాలి. ఈ బృహత్తర లక్ష్యం చేరుకోవాలంటే ముందు రాష్ట్రాల్లో సమతుల, సమగ్ర ప్రగతి సాధించేలా చర్యలు తీసుకోవాలి. అందుకు జాతీయ ఎజెండానే సమూలంగా మార్చివేయాలి. జాతిని సముజ్వల ప్రగతి వైపు నడిపించాలి. పొరుగున వున్న చైనాతో, ఆమాటకొస్తే ప్రపంచంలోని ఇతర అగ్రదేశాలతో సమానంగా, దీటుగా ఎదిగే అద్భుతమైన సహజ వనరులు, సాంకేతికత, నైపుణ్యం, ప్రావీణ్యం, మానవ వనరులు మన దగ్గర కూడా పుష్కలంగా వున్నాయి.

కాని లేనిదొక్కటే లక్ష్య శుద్ధి, సాధించాలన్న సంకల్ప బలం. ఈ విషయంలో కేంద్రం తన సంప్రదాయ ఆలోచనా విధానాలను మార్చుకొని దేశాభివృద్ధికి అవసరమైన నవీన ఆర్ధిక ఎజెండాకు రూపకల్పన చేయాలి…” ఈ మాటలు ఏ ప్రసిద్ధ ఆర్ధిక శాస్త్రవేత్తో, ప్రముఖ రాజనీతి వేత్తో అన్నవి కావు. తెలంగాణ అరవై ఏండ్ల బానిస సంకెళ్ళను బద్దలు కొట్టిన ప్రజాస్వామ్య ‘శాంతి సమరయోధుడు’ అధికారం చేపట్టిన అయిదేండ్లలోనే అభివృద్ధిలో తెలంగాణను దేశానికే ‘రోల్ మోడల్’ గా తీర్చిదిద్దిన పరిపాలనా దురంధురుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశ ఆర్ధిక చికిత్సకు ఇచ్చిన ‘ప్రిస్క్రిప్షన్’ లోని మౌలికాంశాలు ఇవి. ఇటీవల మన హైదరాబాద్ లో జరిగిన 15 వ ఆర్ధిక సంఘం సమావేశంలో కెసిఆర్ దేశాభివృద్ధికి అనేక శాస్త్రీయ సూచనలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా, విశాల దేశ ప్రయోజనాలు లక్ష్యంగా బలమైన, సుసంపన్నమైన దేశ నిర్మాణం ఆవశ్యకత ఆశయంగా ఆయన ఈ విలువైన, ‘అర్థ’వంతమైన ప్రతిపాదనలు దేశం ముందు పెట్టారు. మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రాంతీయ పార్టీ నేత అయినా తన రాష్ట్రానికే పరిమితమైన ఆలోచనలు చేస్తారు.

కేంద్రానికి అలాంటి ప్రతిపాదనలే చేస్తారు. కాని ఇప్పుడు కెసిఆర్ రాష్ట్రాల హద్దులు, సరిహద్దులు దాటి దేశ హితం కోరుకుంటున్నఫెడరల్ ఫ్రంట్ నేతగా దేశం ముందు ఈ సరికొత్త ఎజెండాను, ఆలోచనను పెట్టినట్లు అనిపిస్తుంది. నిజమే మరి, తెలంగాణను సర్వతోముఖ వికాసం వైపు నడిపిస్తూ.. బంగారు తెలంగాణ దిశగా పరుగులు తీయిస్తున్న పరిపాలనా దక్షునిగా దేశ వ్యాప్తంగా ఆయన ఆలోచనలకు ప్రభుత్వాలు కాని, ప్రజలు కాని ప్రాధాన్యమిస్తారు. ఇస్తున్నారు కూడా.. అందుకు సాక్ష్యమే కెసిఆర్ చేపట్టిన రైతు బంధు, రైతు బీమా వంటి పలు పథకాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం. చివరకు రైతులంటే గిట్టని, పట్టని మోడీ ప్రభుత్వం కూడా కెసిఆర్ బాట పట్టక తప్పలేదు. అందువల్ల కెసిఆర్ ఇప్పుడు ఆర్ధిక సంఘానికి చేసిన సూచనలు, ప్రతిపాదించిన ఆలోచనలు దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకుల్లో, మేధావుల్లో, ప్రజల్లో చర్చను, ఆలోచనను రేకెత్తించగలవని ఘంటాపథoగా చెప్పవచ్చు.

వనరులు పుష్కలం.. చర్యలు నిష్ఫలం!
దేశం గురించి, దేశంలోని సహజ వనరుల గురించి, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి కెసిఆర్ చేసిన సూచనలను గమనిస్తే.. రాజకీయాలకు అతీతంగా ఆయనలోని విశాల దృక్పథం, రాజనీతిజ్ఞత, అధ్యయన పటిమ, దార్శనికత, శాస్త్రీయ విధివిధాన విచికిత్స ఎంత లోతుగా, ఎంత గాఢంగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో 40 కోట్ల ఎకరాల సాగుభూమి వుండగా, 70 వేల టిఎంసిల జలాలు అందుబాటులో వున్నాయని.. సంకల్పం, లక్ష్య శుద్ధి వుంటే అందులో కేవలం 40 వేల టిఎంసిల నీళ్ళతోనే దేశంలోని ప్రతి ఎకరాకు నీటి సరఫరా చేయవచ్చినని కెసిఆర్ చక్కని ఆలోచనాత్మక, ఆచరణాత్మక ప్రతిపాదన చేశారు. ఇంత సువిశాల దేశంలో కేవలం 5.5 కోట్ల ఎకరాల (కేవలం 14 శాతం) వ్యవసాయ భూమి మాత్రమే కాలువల కింద సాగు అవుతోందని, మిగిలిన భూమికి నీరు అందించాలంటే ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని ఆయన చేసిన సూచన ఎంతో విలువైనది.

రాష్ట్రాల స్వయం ప్రతిపత్తితోనే అద్భుత ప్రగతి!
కేంద్రానికి- రాష్ట్రాలకు మధ్య వున్న పెద్ద అగాధమే దేశాభివృద్ధికి తీరని ప్రమాదం. ఇందుకు దుర్భర దారిద్య్రం, పేదరికం, అనారోగ్యం, అవిద్య, అసమతుల ప్రగతితో కునారిల్లుతున్న 70 ఏండ్ల స్వతంత్ర భారతమే కళ్ళెదుట కనిపిస్తున్న సజీవ సాక్ష్యం. ఈ విషయంలో మన గత పాలకులు, పార్టీలు అనుసరిస్తున్న రాజకీయ, ఆర్ధిక విధానాలు ఎంత అవివేకంగా, అర్థ రహితంగా వున్నాయో కెసిఆర్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం ఎలా అభివృద్ధి సాధిస్తుందని, దేశంలో కేవలం 8 నుంచి 10 రాష్ట్రాలు మాత్రమే ప్రగతి సాధిస్తే అది దేశాభివృద్ధి కానే కాదని అంటూ.. అన్ని రాష్ట్రాలు సమాన ప్రగతి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు అని చెబుతూ.. అందుకు రాష్ట్రాలకు స్వయం ప్రతి పత్తి కల్పించే నూతన ఆర్ధిక వ్యవస్థకు రూపకల్పన జరగాలని కెసిఆర్ చేసిన సూచన కేంద్ర పాలకులకు కనువిప్పు కలిగించేలా వుంది.

రాష్ట్రాల పరిధిలోకి మరికొన్ని పాలనారంగాలు
ఆది నుంచి కూడా రాష్ట్రాల ప్రగతికి అనేక అవరోధాలు, పాలనాపరమైన ఆటంకాలు ప్రతిబంధకాలుగా వున్నాయి. కేంద్రం చేతిలో వున్న కొన్ని రంగాలు, ఉమ్మడి జాబితాలో వున్న మరికొన్ని రంగాలు.. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా శిశు సంక్షేమం లాంటి రంగాలను రాష్ట్రాల పరిధికి వదిలేస్తే వాటిని సమగ్రంగా, సంపూర్ణంగా అభివృద్ధి చేయవచ్చునని కెసిఆర్ మరో నిర్మాణాత్మక ప్రతిపాదన చేశారు. నిజమే.. ఎక్కడైనా అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే ప్రగతి పరుగులు తీస్తుంది. కానీ అనేక స్థానిక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న కీలక రంగాలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల వాటి ప్రగతి కుంటుపడుతోంది.

అడ్డుగా వున్న అంతర్రాష్ట్ర ‘చిక్కు ముళ్ళు’!
ప్రగతికి నిధుల కొరతే కాదు, బ్రిటిష్ కాలం నాటి మన చట్టాలు, నియమ నిబంధనలు, బూజు పట్టిన విధానాలు కూడా అడుగడుగునా అడ్డు తగులుతున్నాయి. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలు, తీర్పు ఇవ్వాల్సిన ట్రిబ్యునళ్ళు సంవత్సరాలపాటు కాలయాపన చేయడం వంటి అంశాలతో పాటు, చట్టపరమైన సమస్యలు, భూసేకరణ, పునరావాస సమస్యలు కూడా ప్రాజెక్టులకు ప్రతిబంధకాలే.. అందుకే మన దేశంలో ఏ ప్రాజెక్టు కూడా దశాబ్దాలు గడిచినా పూర్తి కాదు. ఆర్ధిక అంచనాలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి.. ఒక్కోసారి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వాలు భయపడే పరిస్థితి ఎదురవుతుంది. అందువల్ల అంతర్రాష్ట్ర చట్టాలను, స్థానిక బంధనాలను సమూలంగా మార్చాల్సిన అవసరం వుంది. ఈ విషయంపై కెసిఆర్ ఆలోచనలు ఆచరణీయం, అనుసరణీయం కూడా..

దేశ ప్రగతిపై ఆర్ధిక సంఘం ముందు కెసిఆర్ చేసిన ప్రతిపాదనలు, సూచనలు.. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేవలం రాష్ట్రానికే పరిమితమై లేవు. దేశం పట్ల, దేశాభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన ఒక దార్శనికుని స్వప్నానికి సంకేతంగా, సర్వతోముఖ దేశ ప్రగతికి సందేశంగా కనిపిస్తాయి. అందుకే ఆయన తెలంగాణ ప్రగతి మాత్రమే కాదు.. రాష్ట్రాల ప్రగతి.. తద్వారా దేశ ప్రగతి తన తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నట్లు, ఆ దిశలోనే ఆయన ఫెడరల్ ఫ్రంట్ బాధ్యతను తలకెత్తుకున్నట్లు తోస్తుంది. కలలను కనడమే కాదు .. వాటిని సాకారం చేసుకునే అసాధ్యుడు.. అనితర సాధ్యుడు కెసిఆర్! అందుకే తెలంగాణతో పాటు .. దేశం కూడా ఈనాడు కెసిఆర్ ఆలోచనలకు, విధానాలకు జేజేలు పలుకుతోంది!

Actions to Achieve Comprehensive Progress in States